HomeతెలంగాణMahesh Kumar Goud comments : హరీష్-ఈటల ఎందుకు కలిశారు? కేసీఆర్ తో ఎందుకు మాట్లాడారు?

Mahesh Kumar Goud comments : హరీష్-ఈటల ఎందుకు కలిశారు? కేసీఆర్ తో ఎందుకు మాట్లాడారు?

Mahesh Kumar Goud comments : కాలేశ్వరం కమిషన్ ఎదుట వీరంతా కూడా హాజరవుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలలో సంచలనం నెలకొంది. అయితే దీనికంటే ముందు ఇటీవల ఎర్రవల్లి లోని తన వ్యవసాయ క్షేత్రంలో హరీష్ రావుతో కెసిఆర్ భేటీ అయ్యారు. గంటలపాటు మంతనాలు జరిపారు. ఆ తర్వాత విశ్రాంత ఇంజనీర్లతో కూడా భేటీ అయ్యారు. నాడు కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో చోటుచేసుకున్న పరిణామాలపై చర్చించారు. అయితే మొదట్లో కాలేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు కేసిఆర్ హాజరుకాబోరని గులాబీ మీడియా వార్తలు ప్రచురించింది. ఆ తర్వాత కేసీఆర్ మనసు మార్చుకోవడంతో.. ఆయన విచారణకు హాజరవుతారని చెప్పింది. ఇక హరీష్ రావు, కెసిఆర్ భేటీ కావడం సంచలనం సృష్టించింది. అయితే దీనికంటే సంచలనమైన వార్తను.. సంచలనమైన విషయాలను వెల్లడించారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.. ఇంతకీ ఆయన వెల్లడించిన విషయాలు ఏంటంటే..

Also Read :పార్టీ నుంచి బహిష్కరణ తప్పదా… ఈ ప్రచారంపై గులాబీ బాస్ కుమార్తె ఏమన్నారంటే?

నాటి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ కు కూడా కాలేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మొన్న షామీర్ పేట లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో హరీష్ రావు, ఈటల రాజేందర్ రహస్యంగా కలుసుకున్నారని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.. అనంతరం వాళ్ళిద్దరూ కేసీఆర్ తో మాట్లాడారని విమర్శించారు. కాలేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యే ముందు వారిద్దరు అనేక విషయాలు చర్చించుకున్నారని.. అత్యంత రహస్యంగా ఈ భేటీ జరిగిందని.. నాడు కాలేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. వారిద్దరు పైకి ప్రత్యర్ధులుగా కనిపిస్తున్నారని.. కానీ లోపల మాత్రం ఒకటేనని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ” కాలేశ్వరం విషయంలో కమిషన్ కు వాస్తవాలు చెప్పి ఈటెల రాజేందర్ మోడీ మనిషి అనిపించుకుంటారా లేదా కెసిఆర్ కు అనుకూలంగా చెప్పి బిజెపి వ్యతిరేకి అనిపించుకుంటారా”అనేది ఈటెల రాజేందర్ తేల్చుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు..

” కాలేశ్వరం పథకం నిర్మాణంలో ఇష్టానుసారంగా వ్యవహరించారు. అక్రమాలకు పాల్పడ్డారు. దాని ఫలితమే ప్రస్తుతం ఈ పర్యవసనాలు. ఇవన్నీ కూడా ప్రజలకు కనిపిస్తున్నాయి. అందువల్లే కాలేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపింది. తద్వారా నాటి ప్రభుత్వ పెద్దల అవినీతి ప్రజల ముందు బహిర్గతమవుతుంది.. ఇదంతా కూడా మేము కక్షతో చేస్తున్నది కాదు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే కమిషన్ విచారణకు హాజరు కావాలంటున్నది.. ఈ వ్యవహారంలో ఇప్పటికే మామా అల్లుడు తీవ్రస్థాయిలో చర్చలు సాగించారు. చివరికి కమిషన్ ఎదుట విచారణకు హాజరు కాకపోతే ఇజ్జత్ పోతుందని భావించి వస్తున్నారని” మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మహేష్ కుమార్ సంచలన ప్రెస్ మీట్ తెలంగాణ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరి దీనిపై గులాబీ పార్టీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో.. ఈటల రాజేందర్ వర్గీయులు ఇలాంటి సమాధానం చెప్తారో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version