https://oktelugu.com/

KTR: నేడు కోర్టుకు వెళ్లనున్న కేటీఆర్‌.. కొండా సురేఖ పై పరువు నష్టం కేసులో కీలక పరిణామం

భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్‌ ఇచ్చే అవకాం ఉంది.

Written By: Raj Shekar, Updated On : October 18, 2024 8:59 am
Konda Surekha-KTR

Konda Surekha-KTR

Follow us on

KTR: తెలంగాణలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికలు ముగిసి ఏడాదైనా రాజకీయ వేడి చల్లారడం లేదు. పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో ఒక్కోసారి మాటలు అదుపుతప్పుతున్నాయి. ఇటీవల మంత్రి కొండా సురేఖను కొందరు బీఆర్‌ఎస్‌ నేతలు ట్రోల్‌ చేశారు. వారు బీఆర్‌ఎస్‌ నేతలే అయినా.. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కనీసం స్పందించడం లేదని సురేఖ విమర్శించారు. అంతటితో ఆగకుండా తనపై వస్తున్న సానుభూతిని పెంచుకునేందుకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌పై సంచలన ఆరోపణలు చేశారు. సినీ నటులు సమంత, నాగచైతన్య విడిపోవడానికి కేటీఆరే కారణమని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. మంత్రి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నేతలతోపాటు సినిమా ఇండస్ట్రీవాళ్లు తీవ్రంగా మండిపడ్డారు. హీరో నాగార్జున, ఆయన భార్య అమల, వారి కొడుకు నాగచైతన్య, హీరోయిన్‌ సమంతతోపాటు అనేక మంది మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. దీంతో కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. అయినా హీరో నాగార్జునతోపాటు, మాజీ మంత్రి కేటీఆర్‌ మంత్రి వ్యాఖ్యలతో తమ పరువుకు బంగం కలిగిందని కోర్టును ఆశ్రయించారు. నాగార్జున, కేటీఆర్‌ వేర్వేరుగా పిటిషన్లు వేశారు. నాగాజ్జున పిటిషన్‌పై ఇప్పటికే విచారణ జరిపిన కోర్టు.. స్టేట్‌మెంట్‌ కూడా నమోదు చేసింది. మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. ఇక కేటీఆర్‌ పిటిషన్‌పై విచానణ జరిపి స్టేట్‌మెంట్‌ రికార్డు కోసం వాయిదా వేసింది.

నేడు వాంగ్మూలం నమోదు..
మంత్రి కొండా సురేఖపై వేసిన పరువునష్టం దావాలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుక్రవారం(అక్టోబర్‌ 18న) నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరు కానున్నారు. కోర్టులో కేటీఆర్‌ పిటిషన్‌పై అతని స్టేట్‌మెంట్‌ నమోదు చేసే అవకాశం ఉంది. మాజీ మంత్రితోపాటు సాక్షులుగా ఉన్న తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్‌ వాగ్మూలం సైతన నమోదు చేసే అవకాశం ఉంది. సెక్షన్‌ 356 కింద ఈ కేసులో కేటీఆర్‌ వాగ్మూలం కీలకంగా మారనుంది.

ఆధారాలతో పిటిషన్‌..
ఇదిలా ఉంటే ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ పూర్తి ఆధారాలతో కోర్టును ఆశ్రయించారు. తనపై మంత్రి చేసిన వ్యాఖ్యల గురించిన వీడియో క్లిప్పింగులు, సోషల్‌ మీడియాలో వచ్చిన కథనాలు, పత్రికల్లో వచ్చిన వార్తలు, ఫొటోలను సాక్ష్యాలుగా కోర్టుకు సమర్పించారు. మరోవైపు కొండా సురేఖ కూడా కేటీఆర్‌ కేసును ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నాగార్జున పిటిషన్‌పై ఆమె తన న్యాయవాదులను సంప్రదించారు. కేటీఆర్‌ పిటిషన్‌ను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు.