KTR vs Kavitha political fight: తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నేతల మధ్య ఉద్భవించిన విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), ఆయన సోదరి, బీఆర్‌ఎస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో వ్యక్తం చేసిన భిన్నాభిప్రాయాలు పార్టీలో అంతర్గత సంక్షోభానికి దారితీశాయి. ఇద్దరూ కేసీఆర్ సిద్దాంతం మేరు పనిచేస్తాంటూ వైరుధ్య ప్రకటనలు చేయడం ఇద్దరి మధ్య ఫైట్ మొదలైందా అన్న చర్చ జరుగుతోంది.
ఉపరాష్ట్రపతి ఎన్నికలు బహిష్కరణ..
కేటీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఉపరాష్ట్రపతి ఎన్నికలను బహిష్కరించాలన్న నిర్ణయాన్ని ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతులను వేధిస్తున్నాయని, అందువల్ల బీఆర్‌ఎస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటుందని ఆయన వాదించారు. ఈ నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణలో రైతు సమస్యలను ఎత్తిచూపడం ద్వారా బీఆర్‌ఎస్ తన సంప్రదాయ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. రైతు సమస్యలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ఆయుధంగా ఉపయోగించాలన్నది కేటీఆర్ వ్యూహంగా కనిపిస్తుంది. అయితే, ఈ నిర్ణయం పార్టీలోని అన్ని వర్గాల నుంచి ఏకాభిప్రాయాన్ని పొందలేదు, ముఖ్యంగా కవిత దీనిని పరోక్షంగా వ్యతిరేకించడం ద్వారా అంతర్గత విభేదాలు బయటపడ్డాయి.
తెలంగాణ గుర్తింపుపై కవిత దృష్టి..
కవిత, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని సమర్థించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బిడ్డగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి గెలవాలని కోరుకోవాలని ఆమె సూచించడం ద్వారా బీఆర్‌ఎస్‌లోని ఒక వర్గం ఆలోచనలను ప్రతిబింబించారు. ఇది తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని జాతీయ స్థాయిలో ఉన్నతంగా చాటాలని కోరుకుంటుంది. అయితే, కవిత ఈ పిలుపు బీఆర్‌ఎస్ అధికారిక నిర్ణయానికి విరుద్ధంగా ఉండడం ఆమె పార్టీలోని ఇతర నాయకులతో, ముఖ్యంగా కేటీఆర్‌తో, విభేదాలను సూచిస్తుంది. ఇది కూడా ఆమె సస్పెన్షన్‌కు దారితీసిన కారణాల్లో ఒకటిగా కనిపిస్తోంది.
బీఆర్‌ఎస్‌లో అంతర్గత సంక్షోభం
కేటీఆర్, కవితల మధ్య ఈ భిన్నాభిప్రాయాలు బీఆర్‌ఎస్‌లో లోతైన అంతర్గత సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. కవిత సస్పెన్షన్, ఆమె తదనంతర రాజీనామా బీఆర్‌ఎస్‌లో అధికార పోరును మరింత స్పష్టం చేశాయి. కవిత, హరీశ్‌రావు, సంతోష్‌రావుపై తీవ్ర విమర్శలు చేస్తూ, పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించడం ద్వారా, తన సొంత స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. అయితే, ఈ చర్య ఆమెను పార్టీ నుంచి బహిష్కరణకు గురి చేసింది. కేటీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఈ సంక్షోభాన్ని నియంత్రించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. కవిత సస్పెన్షన్‌కు ముందు ఆమె ఆరోపణలపై పార్టీ అంతర్గతంగా చర్చించినట్లు ఆయన స్పష్టం చేశారు.
అన్న, చెల్లెలి ఫైట్.. ఇప్పటికే అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌కు ఇబ్బందిగా మారనుంది. కేటీఆర్ నాయకత్వంలో పార్టీ రైతు సమస్యలను ఎత్తిచూపడం ద్వారా తిరిగి ఊపందుకోవాలని చూస్తున్నప్పటికీ, కవిత రాజీనామా, కొత్త పార్టీ స్థాపన గురించిన ప్రచారం పార్టీ ఐక్యతను బలహీనపరిచే అవకాశం ఉంది. కవిత తదుపరి రాజకీయ చర్యలు, ముఖ్యంగా కొత్త పార్టీ స్థాపన లేదా కాంగ్రెస్‌లో చేరిక వంటి అంశాలు, తెలంగాణ రాజకీయ లెక్కలను మార్చవచ్చు.
బిగ్ పంచ్..
కేటీఆర్ వర్సెస్ కవిత
కేటీఆర్: బీజేపీ, కాంగ్రెస్ రైతులను వేధిస్తున్నందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్‌ఎస్ దూరం
కవిత: తెలంగాణ బిడ్డ అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలవాలని కోరుకోవాలి https://t.co/7jQ6uEFu5Q pic.twitter.com/FS9ZQA7ao6
— BIG TV Breaking News (@bigtvtelugu) September 9, 2025