Teenmaar Mallanna : 2023 సంవత్సరం కంటే ముందు ముచ్చట ఇది.. నాడు తీన్మార్ మల్లన్న అధికార భారత రాష్ట్ర సమితి మీద ఒంటి కాలు మీద లేచేవాడు. కెసిఆర్ విధానాలను తప్పుపట్టేవాడు. కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో అవినీతిని ఎండగట్టేవాడు. సహజంగానే తీన్మార్ మల్లన్నకు రాజకీయంగా ఎదగాలని కోరిక ఉండేది కాబట్టి.. అప్పట్లో ఎమ్మెల్సీగా పోటీ చేశాడు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని దాదాపు ఓడించినంత పనిచేశాడు. నాడు కాంగ్రెస్ పార్టీకి ఈ స్థాయిలో సోషల్ మీడియా లేదు కాబట్టి.. తీన్మార్ మల్లన్న వీడియోలనే ప్రముఖంగా వాడుకొనేది.
తీన్మార్ మల్లన్న మీద నాటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం కేసులు పెట్టడంతో అనివార్యంగా బిజెపిలో చేరారు. ఆ తర్వాత కొంతకాలానికి బిజెపి నుంచి బయటికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. భారత రాష్ట్రపతి అభ్యర్థి రాకేష్ రెడ్డి మీద విజయం సాధించారు. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా తన ప్రశ్నించే స్వభావాన్ని వదిలిపెట్టలేదు. అధికార కాంగ్రెస్ పార్టీ మీద.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేసుకుంటూనే పోయారు. మొదట్లో ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గానికి నచ్చేది కాదు. అయినప్పటికీ తీన్మార్ మల్లన్న తన ధోరణి మార్చుకోలేదు. పైగా ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన స్వరాన్ని మరింత పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల సర్వే చేపట్టింది. ఈ సర్వేలో కులాల వారీగా వివరాలు సేకరించింది. ఈ వివరాల ఆధారంగానే ఆయా కులాలకు రిజర్వేషన్లు కేటాయించనుంది. ఈ రిజర్వేషన్ల ఆధారంగానే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే ఇటీవల నిర్వహించిన బీసీ కులాల సభలో తీన్మార్ మల్లన్న ప్రభుత్వం నిర్వహించిన సర్వే పై తీవ్ర విమర్శలు చేశారు. దానిని ఉ* పోసి తగలబెట్టాలని పిలుపునిచ్చారు. ఇది సహజంగానే అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
ఇక తెలంగాణ ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో సమగ్ర సర్వేకు సంబంధించి వివరాలను ప్రకటించింది. ఈ జాబితాలో కులాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసింది. దానిని పార్లమెంటుకు పంపించింది. దీనిపై శాసనసభలో చర్చ జరిగింది.ఈ చర్చలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కేటీఆర్ ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రభుత్వం నిర్వహించిన సర్వే మొత్తం డొల్ల అని.. సాక్షాత్తు వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ నే దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. బీసీ జనాభా తగ్గిందని.. సర్వే చేసిన విధానం బాగోలేదని కేటీఆర్ అన్నారు.. అయితే దీనికి కౌంటర్ ఇవ్వలేక అధికార పార్టీ మల్ల గుల్లాలు పడింది.. ఇదే క్రమంలో తీన్మార్ మల్లన్న ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యాడని.. సోషల్ మీడియాలో నాటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగట్టాడని.. ఇప్పుడు అదే తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి కంటగింపుగా మారాడని.. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులను తీసుకొస్తున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.. మరి దీనిపై తీన్మార్ మల్లన్న ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. అన్నట్టు తీన్మార్ మల్లన్న బీసీ సభ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోలను భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం తెగ ప్రచారం చేస్తోంది. అయితే అవి పాత ఫోటోలు అని తీన్మార్ మల్లన్న టీం కౌంటర్ ఇస్తోంది.. మొత్తానికి ఇరు వర్గాల మధ్య ఆరోపణలు ప్రతీ ఆరోపణలతో సోషల్ మీడియా రచ్చ రచ్చ అవుతోంది.
కుల గణన సర్వే రిపోర్ట్ తగలబెట్టాలని మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే అంటున్నాడు https://t.co/6gDohEdElJ pic.twitter.com/o8U5YFyY7V
— Telugu Scribe (@TeluguScribe) February 4, 2025