KTR Kaleshwaram: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాలు నీళ్ల చుట్టూ తిరుగుతున్నాయి. గత ఆదివారం మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పై కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్య మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చ కు దారి తీస్తూనే ఉన్నాయి. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మర్చిపోక ముందే.. ఆయన కుమారుడు రంగంలోకి వచ్చారు. ఈసారి ఏకంగా ఆయన కాళేశ్వరం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంగళవారం సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆయన పరిపాలన మాఫియా మాదిరిగా ఉందని మండిపడ్డారు.. కెసిఆర్ పరిపాలన కాలంలో చేసిన మంచి పనులకు అనేక రకాలుగా రేవంత్ ప్రభుత్వం వక్ర భాష్యం చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇందుకోసం రేవంత్ ప్రభుత్వం చేయని పని లేదంటూ మండిపడ్డారు.
2023 ఎన్నికల సమయంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేశారని కేటీఆర్ ఆరోపించారు. ఆ పథకం పై బాంబులు వేయడం వల్లే దెబ్బ తిన్నదని అనుమానించారు.. ఆ ప్రాంతంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్ డ్యాం ల మీద బాంబులు వేశారని మండిపడ్డారు. మానవ నిర్మిత అద్భుతమైన కట్టడాల మీద మానవ విధ్వంసం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పేరుపొందిన రాజేంద్ర సింగ్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. “ఇసుకను తరలించడానికి ప్రాజెక్టులకు రంధ్రాలు చేస్తున్నారు. అందులో బాంబులు పెట్టి పేల్చుతున్నారు. ఇసుకను దోచుకోవడానికి ప్రాజెక్టులు అడ్డుగా ఉన్నాయని భావించి.. కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో నిర్మించిన చెక్ డ్యాములను పడగొడుతున్నారు. భూగర్భ జలాల పెంపుదల కోసం మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెక్ డ్యాములను నిర్మించాం. ఇసుక కోసం వాటిని కూల్చివేసి.. పొలాలను ఎడారులుగా మారుస్తున్నారు. ఈ పరిణామాలు తెలంగాణ రాష్ట్రానికి ఎంత మాత్రం మంచిది కాదు. వీటిని చూస్తూ ఊరుకోమని” కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నాయకులు కూడా అదే స్థాయిలో సమాధానం చెప్పారు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందని ప్రశ్నించారు.. బాంబులతో పెట్టి కూల్చేస్తే కూలిపోయే స్థాయిలో కాళేశ్వరం ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పడ్డది చిన్న పర్రే అని.. రిపేర్ చేస్తే సరిపోతుంది అని కేటీఆర్ గతంలో అన్నారని.. ఇప్పుడేమో బాంబులు పెట్టి కూల్చేశారని ఆరోపిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఏదైనా ఒక మాట మీద కేటీఆర్ నిలబడాలని సూచించారు.