KTR(5)
KTR: అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ జనంలో బాగా తిరుగుతున్నారు. మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన యాక్టివ్ గా ఉంటున్నారు. గుడ్.. భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఆయన ఆ పని చేయాలి. పైగా ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ కొన సాగుతున్నారు. కెసిఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ కాబట్టి.. ఆ బాధ్యతను ఆయన కచ్చితంగా నిర్వర్తించాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయడం లేదని.. మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిని ఆచరణలో పెట్టడం లేదని.. లక్ష కోట్లు అప్పు తీసుకొచ్చి ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని.. ఒక్క ప్రాజెక్టును నిర్మించలేదని.. ఒక్క వంతెన కూడా ఏర్పాటు చేయలేదని.. ఇలా సందు దొరికితే చాలు కేటీఆర్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పరుష పదజాలంతో దెప్పి పొడుస్తున్నారు. చిట్టి నాయుడు, గుంపు మేస్త్రి.. ఇలా రకరకాల పేర్లు పెట్టి రేవంత్ రెడ్డి పై వ్యక్తిగత దూషణలకు కూడా కేటీఆర్ వెనుకాడటం లేదు. దీనికి తోడు ఆ పార్టీ సోషల్ మీడియా కూడా రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది.. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తోంది.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. తన సోషల్ మీడియా ద్వారా భారత రాష్ట్ర సమితి చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టలేక పోతోంది. డిఫెన్స్ కూడా చేయలేకపోతోంది.. దీనిని అడ్వాంటేజ్ గా తీసుకున్న భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా మరింతగా రెచ్చిపోతున్నది. రోజుకో తీరుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నది. ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ చేస్తున్న ఆరోపణలకు అంతుపొంతు లేకుండా పోతోంది. అయితే ఆయన తొందరపడి చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది.
తొందరపడ్డారు
ఖమ్మం జిల్లా చింతకాని మండలం నామవరం గ్రామానికి చెందిన ఓ రైతు రెండు లక్షలు అప్పుచేసి మిర్చి సాగు చేశాడు. అయితే మార్కెట్లో ధర రెండు నుంచి మూడు వేలకు మించి పలకకపోవడంతో.. ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి.. “కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బోనస్ బోగస్ అయింది. రైతుల పరిస్థితి ఇలా ఆగమయింది. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది” అంటూ కేటీఆర్ ప్రభుత్వం పై ఫైర్ అవుతూ ట్వీట్ చేశారు.. అయితే ఈ వీడియోను లోతుగా పరిశీలిస్తే.. అది 2018 నాటిదని.. నాడు అధికారంలో ఉన్నది భారత రాష్ట్ర సమితి ప్రభుత్వమేనని కాంగ్రెస్ పార్టీ పరిశీలనలో తేలింది. ఇంకేముంది కేటీఆర్ అడ్డంగా దొరికిపోవడంతో ఆడేసుకోవడం మొదలుపెట్టింది. ” మీ ప్రభుత్వ హయాంలోనే ఇలా జరిగింది. నాడు రైతుల పరిస్థితి ఎంత దీనంగా ఉందో మీ పోస్ట్ ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు క్వింటా మిర్చికి 14,000 దాకా పలుకుతోంది. దీనిని బట్టి ఎవరి పరిపాలన బాగుందో మీరే చెప్పాలంటూ” కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కేటీఆర్ ను ప్రశ్నించడం మొదలు పెట్టింది. అయితే ఈ వీడియో పాతది కావడంతో కేటీఆర్ తన ట్వీట్ డిలీట్ చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు తలవంచుకోక తప్పలేదు. ఇక కేటీఆర్ పై మరింత దుమ్మెత్తి పోస్తోంది కాంగ్రెస్ సోషల్ మీడియా.. ఆయన గతంలో చేసిన ప్రకటనలు.. ఇచ్చిన హామీలపై వీడియోలు రూపొందిస్తూ ఓ ఆట ఆడుకుంటున్నది.. మొత్తంగా కేటీఆర్ తొందరపడటం వల్ల కాంగ్రెస్ పార్టీకి దొరికిపోయారు.