KTR Kavitha : రాజకీయాలు రక్తసంబంధీకులను కూడా దూరం చేస్తాయి. చివరికి అన్నా చెల్లెలిని కూడా ప్రత్యర్థులుగా మారుస్తాయి. అయితే ఇటీవల కాలంలో రాజకీయాల తీరు మారింది కాబట్టి ప్రత్యర్థుల స్థానంలో శత్రుత్వం పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ జాడ్యం మరింత పెరిగిపోయింది. జగన్, షర్మిల మధ్య విభేదాలను మర్చిపోకముందే తెలంగాణలో కేటీఆర్, కవిత మధ్య విభేదాలు ఏర్పడి అవి తారాస్థాయికి చేరుకున్నాయి.. పరస్పరం విమర్శించుకునే దాకా వెళ్ళిపోయాయి..
పార్టీలో ఉన్న అంతర్గత విషయాలను కవిత బయటపెడుతున్న నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేశారు. ఇక అప్పటినుంచి ఆమె తన ప్రయాణాన్ని ఒంటరిగా చేస్తోంది. తాను ఏర్పాటు చేసిన జాగృతి సంస్థ ఆధ్వర్యంలో విస్తృతంగా తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రజల సమస్యలను ఆమె గుర్తిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో మమేకమవుతున్నారు. ఇదే సమయంలో గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన దారుణాలను కూడా ఆమె బయట పెడుతున్నారు. హరీష్ రావు, సంతోష్ రావు పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పనిలో పనిగా కేటీఆర్ పై కూడా ఆమె విమర్శలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా గులాబీ పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలను ప్రజల ముందు ఉంచుతున్నాయి. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓడిపోయిన తర్వాత కర్మ ఇస్ బ్యాక్ అంటూ కవిత చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది.
కవిత గులాబీ పార్టీకి వ్యతిరేకంగా మారిన నేపథ్యంలో.. ఇటీవల కాలంలో ఆ పార్టీ నాయకులు ఆమె మీద విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఓ నాయకుడైతే రాక్షసి అని సంబోధించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కవితకు, గులాబీ పార్టీకి మధ్య అంతరం అంతకంతకు పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కవిత, కేటీఆర్ ఒకే వేదికను పంచుకోబోతున్నారు. ఎదురుపడితే కనీసం పలకరించుకోవడానికి కూడా ఇష్టపడని వీరిద్దరూ ఒకే వేదికను పంచుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. ఈనెల 25న చెన్నైలోని ఏబిపి నెట్వర్క్ “సదరన్ రైజింగ్ సమ్మిట్” పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి తాను వస్తానని కేటీఆర్ ఇప్పటికే చెప్పినట్టు తెలుస్తోంది. కవిత కూడా ఆ కార్యక్రమానికి హాజరవ్వడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో వీరిద్దరికి సంబంధించిన కార్యక్రమాలకు టైమింగ్స్ ఖరారు కావాలని తెలుస్తోంది. ఒకవేళ వీరిద్దరూ ఒకే వేదిక మీద ఎదురుపడతారా? కనీసం పలకరించుకుంటారా? అనేవి ఆసక్తికరంగా మారాయి.
గులాబీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత ఏ సందర్భంలో కూడా కేటీఆర్ ను కలుసుకోలేదు. ఆ మధ్య రాఖీ పండుగ సందర్భంగా కవిత రాఖీ కట్టడానికి వస్తాను అన్న కూడా కేటీఆర్ వద్దన్నారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పెద్దగా మాటలు లేవు. ఇటీవల ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కేటీఆర్ ను విచారించడానికి గవర్నర్ అనుమతి కోరింది. దానికి గవర్నర్ ఒప్పుకోవడంతో ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ పరిణామాన్ని కవిత ఖండించారు..