KTR : రేవంత్‌కు బీజేపీతో ఎసరు పెడుతోన్న కేటీఆర్

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ కొనసాగుతోంది. ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేందుకు నిర్ణయించారు. ఇంటింటికీ నీరు అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అయితే.. తెలంగాణ రాష్ట్రం ఇందుకోసం టెండర్లు ఆహ్వానించింది. ఆ టెండర్లు సూదిని సృజన్ రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నాడని కేటీఆర్ ఆరోపించాడు.

Written By: Srinivas, Updated On : September 22, 2024 12:02 pm

KTR

Follow us on

KTR :  నీరు పల్లమెరుగు.. నిజము దేవుడెరుగు’.. అనేది సామెత. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు నేతల తీరు చర్చనీయాంశం అయింది. ప్రభుత్వాలతో వారు వారు పొట్లాడకుండా మధ్యలోకి మరో పార్టీని లాగుతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇరు రాష్ట్రాల్లోనూ ఇదే తరహా రాజకీయం నడుస్తుండడం వెనుక కారణాలు ఏమై ఉండొచ్చు అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. వారు ఆరోపిస్తున్న వాటిలో నిజమెంతో తెలియదు కానీ.. మధ్యలోకి కేంద్రాన్ని లాగుతుండడం గమనార్హం.

ఏపీలో ఏ చిన్నపాటి ఇష్యూ జరిగినా మాజీముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మధ్యలోకి బీజేపీని లాగుతున్నాడు. చంద్రబాబుపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నిస్తున్నాడు. ఆయనను ఎందుకు ప్రశ్నించడం లేదని అంటున్నాడు. ప్రతీ అంశంలోనూ ఆయన దీనినే ఫాలో అవుతున్నాడు. ఒకవిధంగా ఆయన బీజేపీని రాజకీయంగా బ్లాక్ మెయిల్ చేస్తూ వస్తున్నాడు. అయితే.. నిన్నటికి నిన్న కేటీఆర్ చేసిన రాజకీయం కూడా అలానే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ కొనసాగుతోంది. ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేందుకు నిర్ణయించారు. ఇంటింటికీ నీరు అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అయితే.. తెలంగాణ రాష్ట్రం ఇందుకోసం టెండర్లు ఆహ్వానించింది. ఆ టెండర్లు సూదిని సృజన్ రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నాడని కేటీఆర్ ఆరోపించాడు. అయితే.. ఆ సృజన్ రెడ్డి స్వయానా సీఎం రేవంత్ రెడ్డి బావమరిది అని ఆరోపించాడు. రేవంత్ నేతృత్వంలో వేల కోట్ల అవినీతికి తెరతీశాడని సంచలన ఆరోపణలు చేశాడు.

అంతేకాదు.. మరో అడుగు ముందుకేసి టెండర్లను వెంటనే రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశాడు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపేయాలని కోరాడు. ఆయనను సీఎం పదవి నుంచి దింపడానికి ఈ ఒక్క అవినీతి చాలంటూ చెప్పుకొచ్చాడు. దీనిపై వెంటనే బీజేపీ నేతలు కూడా స్పందించాలని, కేంద్రం ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు. అయితే.. కేటీఆర్ వ్యాఖ్యలను విన్న బీజేపీ నేతలు ఏం మాట్లాడాలో తెలియక సతమతంలో పడ్డారు.

వాస్తవానికి.. సృజన్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ సతీమణి తమ్ముడు అయితే ఆయన హయాంలో జరిగిన అవినీతిని కేటీఆర్ బయటపెట్టాలి. ఆధారాలతో సహా నిరూపించాలి. అలా కాకుండా ఎంతసేపూ ముఖ్యమంత్రి బావమరిదికి కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపిస్తూ వచ్చాడు. ఆయనకు కాంట్రాక్ట్ ఇచ్చారు కాబట్టి అందులో అవినీతి జరిగిందంటూ ఆరోపించాడు. దీంతో కేటీఆర్ రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆధారాలతో సహా బయటపెడితే కేంద్రం ఆటోమెటిక్‌గా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటుంది కదా..! దానికి బీజేపీ నేతల వరకూ ఎందుకు..? అని ప్రశ్నలు వస్తున్నాయి. పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కు ఆ మాత్రం తెలియదా అని అంటున్నారు.

కేటీఆర్ ఆరోపిస్తున్నట్లు రేవంత్ బంధువుకు కాంట్రాక్టు దక్కిందే అని అనుకుంటే.. మరి పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారి వారి బంధువులకు ఎంత మందికి కాంట్రాక్టులు ఇవ్వలేదు..! కేసీఆర్, కేటీఆర్ బంధువులకు లెక్కలేనన్ని కాంట్రాక్టులు దక్కాయనేది చాలా వరకు ఉన్న ఆరోపణలు. అంటే.. ‘మందిది మంగళవారం మనది సోమవారం’ అన్నట్లుగా కేటీఆర్ వ్యవహారం నడుస్తోందన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. తమ హయాంలోనే రాష్ట్రవ్యాప్తంగా మిషన్ భగీరథ అమలు చేసి ఇంటింటికీ నల్లాలు పెట్టామని బీఆర్ఎస్ గంభీరంగా ప్రకటిస్తూ వచ్చింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ కూడా కేసీఆర్ అదే ప్రచారం చేశారు. మరి ఇప్పుడు కేటీఆర్ ఆరోపణలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ నల్లాలు పెట్టామని బీఆర్ఎస్ భావించినప్పుడు.. మళ్లీ పనులు మిగిలిపోయాయని రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు నిర్వహిస్తోందంటే దేనికి అర్థం..!