India vs Bangladesh : తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 144/6 వద్ద ఉన్నప్పుడు మరో ఆటగాడు రవీంద్ర జడేజా (86) తో కలిసి అశ్విన్ టీమిండియా ఇన్నింగ్స్ భారాన్ని భుజాలకు ఎత్తుకున్నాడు. వీరిద్దరూ కలిసి ఏడో వికెట్ కు ఏకంగా 199 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇదే క్రమంలో 113 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అంతేకాదు రెండవ ఇన్నింగ్స్ లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ ఆటగాడు ఇయాన్ బోథాం రికార్డుకు సమానంగా వచ్చాడు. ప్రస్తుతం బోథాం మొదటి స్థానంలో ఉండగా.. అశ్విన్ రెండవ స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో మరో భారతీయ ఆటగాడు రవీంద్ర జడేజా కూడా ఉండడం విశేషం. అయితే ఈ సాంప్రదాయానికి సౌత్ ఆఫ్రికా ఆటగాడు సింక్లైర్ నాంది పలికాడు. 1899 ఏప్రిల్ 1న జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ పై కేప్ టౌన్ వేదికగా అతడు ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్లో అతడు 106 పరుగులు చేసి, 6/26 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ ఆటగాడు బోథాం మొదటి స్థానంలో ఉన్నాడు.. 1978లో న్యూజిలాండ్ జట్టుపై జరిగిన మ్యాచ్లో 103 పరుగులు చేసి ఐదు వికెట్లు సొంతం చేసుకున్నాడు. 1978 లార్డ్స్ వేదికగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 108 పరుగులు చేసి 8 వికెట్లు పడగొట్టాడు. 1980 లో ముంబైలో ఇండియా జట్టుపై జరిగిన మ్యాచ్లో 114 పరుగులు చేసి, తొలి ఇన్నింగ్స్ లో ఆరు, రెండవ ఇన్నింగ్స్ లో 7 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. 1981లో లీడ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 149* పరుగులు చేసి, ఆరు వికెట్లు నేలకూల్చాడు.
రెండవ స్థానంలో అశ్విన్
బోథాం తర్వాత స్థానంలో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కొనసాగుతున్నాడు.. 2011లో ముంబై వేదికగా వెస్టిండీస్ పై జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్లో అశ్విన్ 103 రన్స్ చేశాడు. 5 వికెట్లు పడగొట్టాడు. 2016లో నార్త్ సౌండ్ వేదికగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో అశ్విన్ 113 పరుగులు చేశాడు. 7 వికెట్లు పడగొట్టాడు. 2021 చెన్నై వేదికగా ఇంగ్లాండ్ జట్టుపై జరిగిన మ్యాచ్లో అశ్విన్ 106 రన్స్ చేశాడు.. ఐదు వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఇక తాజాగా బంగ్లాదేశ్ జట్టుతో చెన్నై వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో అశ్విన్ 113 పరుగులు చేశాడు. ఆరు వికెట్లు సొంతం చేసుకున్నాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అశ్విన్ తర్వాత రవీంద్ర జడేజా కొనసాగుతున్నాడు. సెంచరీ తో పాటు ఐదు వికెట్ల ఘనతను జడేజా రెండుసార్లు సొంతం చేసుకున్నాడు. 2022 మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో జడేజా 175* రన్స్ చేశాడు. ఐదు వికెట్లు సొంతం చేసుకున్నాడు. 2024 ఫిబ్రవరిలో రాజ్కోట్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో రవీంద్ర జడేజా 112 పరుగులు చేశాడు. ఐదు వికెట్లను పడగొట్టాడు.
తొలి ఘనత మన్కడ్ దే
భారత్ తరఫున తొలిసారిగా ఈ ఘనత అందుకున్న రికార్డు మాత్రం మన్కడ్ కు దక్కుతుంది. అతడు 1952లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 184 రన్స్ చేశాడు.. ఐదు వికెట్లను పడగొట్టాడు. ఆ తర్వాత ఉమ్రిగర్ 1962 లో వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 172* పరుగులు చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత మరే భారతీయ బౌలర్ ఈ ఘనత సాధించలేకపోయాడు. 2011లో అశ్విన్ ఈ రికార్డుకు పునరావిష్కరణ చేశాడు.