CM Chandrababu : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారు చేయడానికి ఆవు నెయ్యి ఉపయోగిస్తారు. ఈ ఆవు నెయ్యిని ఏఆర్ అనే కంపెనీ సరఫరా చేస్తోంది. గత జూలైలో ఈ కంపెనీ సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్ లో కల్తీ జరిగిందని నివేదిక ద్వారా తెలిసింది. దీంతో ఈ విషయం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఫలితంగా తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ జరిగిందని వార్తలు బయటికి రావడం మొదలయింది. వాస్తవానికి ఇలాంటి విషయాలు టిటిడి ఈఓ చెబుతారు. అయితే ఒక అధికారి గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పలేడు.. అందులో ఉన్న విషయాలను స్పష్టంగా వివరించలేడు. ఈ నేపథ్యంలో ఆ బాధ్యతను చంద్రబాబు తీసుకున్నారు. శ్రీవారి లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని.. దీనంతటికీ జగన్ ప్రభుత్వం హయాంలో ఏఆర్ అనే కంపెనీ తో కుదుర్చుకున్న ఒప్పందమే కారణమని చంద్రబాబు స్పష్టం చేశాడు.. అంతే ఏపీలో రాజకీయ మంటలు చెలరేగాయి. అంతకుముందు ఆ నివేదికలో ఉన్న విషయాలను టిటిడి ఈవో కు బదులుగా టిడిపి నేత ఆనం వెంకట రమణారెడ్డి మీడియా ముందు వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా జగన్ ఇరుకున పడాల్సి వచ్చింది. వాస్తవానికి ఆ నివేదికలో వెజిటబుల్ ఫ్యాట్ అంటే వనస్పతి ఉందని ఈవో చెప్పగా.. అందులో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు వ్యాఖ్యానించడంతో దుమారం చెలరేగింది.
ఎందుకు జగన్ కు ఇబ్బందంటే..
నాడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతిని పెద్దగా పట్టించుకోలేదు. పైగా జగన్ క్రైస్తవుడు కావడంతో.. తిరుమల సంబంధించి ఏదైనా వివాదాలు వచ్చినప్పుడు గట్టిగా స్పందించలేదు. తిరుమలలో పెద్ద పెద్ద పోస్టులలో వివాద రహితులను నియమించకుండా.. ఆరోపణలు ఉన్న వ్యక్తులను నియమించాడు. దీంతో తిరుమలలో ఏవైనా వివాదాలు చోటు చేసుకున్నప్పుడు వారు పెద్దగా పరిష్కరించింది లేదు. ఇదే సమయంలో అన్యమత ప్రచారం.. తిరుమలలో ఫోటో షూట్.. ఆలయ ప్రధాన గోపురంపై డ్రోన్ చక్కర్లు కొట్టడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు నెయ్యి కల్తీ వ్యవహారం తెరపైకి రావడంతో.. గతంలో చోటు చేసుకున్న సంఘటనలను కూడా ప్రస్తుత ప్రభుత్వం చర్చకు పెడుతోంది. తనకు అనుకూల మీడియాలో రాయిస్తోంది. దీంతో జగన్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వాస్తవానికి నెయ్యి కల్తీ వ్యవహారానికంటే తిరుమల లడ్డు తయారీలో అపచారం చోటుచేసుకుందనే భావన దేశవ్యాప్తంగా జగన్ పై ఆగ్రహానికి కారణమవుతోంది. ఈ ఆగ్రహం మంటల్లో టిడిపి అనుకూల మీడియా మరింత నెయ్యి చల్లుతోంది. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డిని ఆ దేవుడే కాపాడాలి. నాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక పోస్టులలో కొనసాగిన వారు జగన్ కు అనుకూలంగా మాట్లాడలేకపోతున్నారు. పైగా వారు చెప్పే వివరాలు అస్పష్టంగా ఉంటున్నాయి. ఇవి అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఇదే క్రమంలో చంద్రబాబు తన రాజకీయ చాణక్యానికి మరింత పదును పెడుతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్లడంతో.. లడ్డు వ్యవహారం మరింత జటిలమయ్యేలాగా కనిపిస్తోంది.