HomeతెలంగాణKK - KCR : కేసీఆర్‌ను మెచ్చుకుంటూ కాంగ్రెస్‌లోకి.. కేకే ఇదేం అవకాశవాదం?

KK – KCR : కేసీఆర్‌ను మెచ్చుకుంటూ కాంగ్రెస్‌లోకి.. కేకే ఇదేం అవకాశవాదం?

KK – KCR : రాజకీయాల్లో ఆయారామ్ గయారామ్‌లు కాదు.. పవర్‌ కోసం పాకులాడే నాయకులే ఎక్కువయ్యారు. అధికారం లేని పార్టీలో ఉండలేకపోతున్నారు. బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పయిన వంద రోజులకే పదేళ్లు పార్టీలో పదవులు అనుభవించిన నాయకులు ఆ పార్టీని వీడడం చూసి నీతి, విలువలు లేని నేతల తీరు చూసి ప్రజలే సిగ్గుపడుతున్నారు. నాయకులకు మాత్రం నవ్విపోదురుగాని నాకేటి సిగ్గు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కే.కేశవరావు, ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మి, స్టేషన్‌ ఘణపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆమె కూతురు కడియం కావ్య బీఆర్‌ఎస్‌ను వీడిన తీరు తెలంగాణ అంతటా చర్చనీయాంశమైంది. ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందేమో అనిపిస్తుంది. కేవలం అధికారం కోసం, తామ ఆస్తులను కాపాడుకోవడం కోసమే అధికార పార్టీలోకి మారుతున్నార్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

కేసీఆర్‌ను పొగుడుతూ..
ఇక బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెపి‍్పన కేశవరావు శుక్రవారం(మార్చి 29న) ప్రెస్‌మీట్‌ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ కారణంగానే తెలంగాణ వచ్చిందన్నారు. పదేళ్లు కేసీఆర్‌ ఉద్యమంతోనే తెలంగాణ వచ్చిందని చెప్పారు. ఇక తెలంగాణ పునర్నిర్మాణం కోసమే తాను ఇన్నాళ్లూ బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారని చెప్పారు. అంటే తెలంగాణ పునర్నిర్మాణ కాంగ్రెస్‌కు చేతకాదు అని చెప‍్పకనే చెప్పారు. ఇక తన వయసు 85 అని.. 55 ఏళ్లు తాను కాంగ్రెస్‌లో పని చేశానని తెలిపారు. సీడబ్లూ‍్యసీ మెంబర్‌గా, నాలుగు రాష్ట్రాల ఇన్‌చార్జిగా కాంగ్రెస్ తనకు చాలా ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఇంత ప్రాధాన్యం ఇచ్చిన కాంగ్రెస్‌ను కాదని అధికారం కోసం పదేళ్ల క్రితం కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. దానికి తెలంగాణ పునర్నిర్మాణం అనే ఒక సాకు వెతుకున్నారు.

బాధతో పార్టీని వీడానని..
ఇక నాడు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌ను వీడిన కేకే.. దానిని సమర్థించుకోవడానికి చాలా బాధతో తాను ఆనాడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చానని వెల‍్లడించారు. పాటలు, ధర్నాలతో తెలంగాణ రాలేదన్నారు. పార్లమెంట్‌లో ఫైట్ చేయడం వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. ఇక బీఆర్‌ఎస్‌ తనకు మంచి గుర్తింపు ఇచ్చిందన్నారు. కేసీఆర్‌ తన మాటకు విలువ ఇచ్చారని తెలిపారు. అన్ని రకాలుగా బీఆర్‌ఎస్‌లో తనకు గౌరవం దక్కిందని వెల్లడించారు. అయినా.. ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి.. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో చేరాని నిర్ణయించుకున్నారు. దీనికి కేసీఆర్‌నే బాధ్యుడిని చేశారు కేకే. కేసీఆర్‌ కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయిందని తెలిపారు. ఆయన కుటుంబం పార్టీని నడుపుతుందన్న మెసేజ్ ప్రజల్లోకి బలంగా వెళ్లడం పార్టీ ఓటమికి ప్రధాన కారణమన్నారు. ఒక కీలక సూచన కూడా చేశారు కేకే. బీఆర్‌ఎస్‌ బలోపేత కావాలంటే యువకులను ముందు పెట్టి నడిపించాలన్నారు.

కాంగ్రెస్‌లో ఎందుకు విలీనం చయలేదు..
ఇదిలా ఉండగా, తాను అవకాశవాదంతో తాను పార్టీ మారట్లేదన్నారు. తెలంగాణ ఇస్తే బీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ నాడు చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్‌ మాటమీద ఎందుకు నిలబడలేదని ప్రశ్నించారు. విలీనం చేయకపోవడం కూడా పార్టీ మారాలన్న నిర్ణయానికి ఓ కారణమని చెప్పారు. కేసీఆర్‌ను ఇండియా కూటమిలో చేరమని సలహా ఇచ్చానని తెలిపారు. బీఆర్ఎస్ విషయంలో తాను తప్పు చేస్తే మన్నించాలని కోరారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version