Telangana BJP : బండి సంజయ్‌ను రిప్లేస్‌ చేయబోతున్న ఆ కీలక నేత.. భారీ మార్పుల దిశగా తెలంగాణ బీజేపీ!

తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్‌గా కిషన్‌రెడ్డిని నియమిస్తారని తెలుస్తోంది. ఈమేరకు ఇప్పటికే అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడితోపాటు కీలక నేతలుగా ఉన్న ఈటల రాజేందర్, రాజగోపాల్‌రెడ్డికి కూడా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం.

Written By: NARESH, Updated On : June 27, 2023 2:32 pm
Follow us on

Telangana BJP : ‘రెడ్డీలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను మార్చేస్తున్నారు. బలమైన నేతలంతా ఒక్కచోటుకు చేరడంతో ప్రత్యర్థి పార్టీలు అలెర్ట్ అవుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో ఈ పరిణామం జోష్ నింపుతుండగా.. తెలంగాణలో ఎదుగుతున్న బీజేపీని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అందుకే బీజేపీ ఇప్పుడు నష్టనివారణ చర్యలు చేపడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీలో అధ్యక్షుడి మార్పుపై కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రచారానికి అధిష్టానం తెర దించబోతోందా..? బండి సంజయ్‌ స్థానంలో మరొకరిని రీప్లేస్‌ చేయబోతోందా..? బండిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది బీజేపీ జాతీయ నేతల నుంచి.. కాంగ్రెస్ లోకి పొంగులేటి.. జూపల్లి సహా కీలక రెడ్డి నేతలు, ఇతరులు బీజేపీని కాదని వెళుతుండడంతోనే రెడ్డిలను ఆకర్షించేందుకు తెలంగాణ బీజేపీ చీఫ్ ను మార్చబోతున్నట్టు సమాచారం. రెడ్డిలను ఓన్ చేసుకునేందుకే బీజేపీ ఈ స్టెప్ వేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

బీజేపీ హైకమాండ్‌ కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌ను 2020, మార్చి 11న పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమించింది. మూడేళ్ల పదవీ కాలంలో బండి సంజయ్‌ పార్టీకి గతంలో ఎన్నడూ లేనంత ఊపు తెచ్చారు. గతంలో పనిచేసిన ఏ అధ్యక్షులు చేయని విధంగా అగ్రెసివ్‌ రాజకీయాలతో దూకుడు ప్రదర్శిస్తూ క్యాడర్‌లోనూ దూకుడు పెంచారు. దీంతో తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అన్నట్లుగా పార్టీకి హైప్‌ తెచ్చారు. బండి సంజయ్‌ అధ్యక్షుడి అయ్యాక పార్టీ రెండు ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 47 కార్పొరేటర్లను గెలిపించి అధికార బీఆర్‌ఎస్‌కు ఓటమి భయం పుట్టించారు.

-అధ్యక్షుడిని మార్చాలని ఒత్తిడి..
బండి సంజయ్‌ మూడేళ్ల పదవీకాలం పూర్తయింది. అయితే ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో సంజయ్‌ సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. కానీ ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఆయన వ్యతిరేక వర్గం మళ్లీ తెరపైకి వచ్చింది. పదవీ కాలం పూర్తయినందున సంజయ్‌ను మార్చాలని అధిష్టానంపై ఒత్తిడి పెంచింది. సంజయ్‌ సారథ్యంలో ఎన్నికలకు వెళ్తే పార్టీ గెలవదన్న ప్రతిపాదనను అధిష్టానం ముందు ఉంచింది. విజయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని కొన్ని ఉదాహరణలు పేపర్, వీడియో క్లిప్స్‌ అధిష్టానం ముందు పెట్టారు.

– పార్టీ వీడతామని అల్టిమేటం..
అయినా బండి సంజయ్‌ను కొనసాగించేందుకే అధిష్టానం మొగ్గు చూపింది. సంజయ్‌ సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లాలని భావించింది. దీంతో వ్యతిరేక వర్గం నేతలతోపాటు కొత్తగా పార్టీలో చేరిన కొంతమంది నేతలు అధ్యక్షుడిని మార్చకపోతే తాము పార్టీ వీడతామని లీకులు ఇస్తున్నారు. తాజాగా అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది.. దీంతో అధిష్టానం దిగి వచ్చినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడి మార్పునకు అంగీకరించినట్లు సమాచారం.

-అధిష్టానం పిలుపు..
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు అధిష్టానం నుంచి ఆదివారం పిలుపు వచ్చింది. దీంతో సంజయ్‌ సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ఉన్న సంజయ్‌ వ్యతిరేకవర్గం ఫిర్యాదుతో సంజయ్‌ను ఢిల్లీకి పిలిచినట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా తెలంగాణకు వచ్చినా ఆ ఇద్దరు నేతలు ఢిల్లీలోనే ఉండిపోయారు. ఈ పరిణామాలతో ఏదో జరుగబోతోంది అన్న సంకేతాలు వెలువడ్డాయి.

-నడ్డాతో భేటీ తర్వాత..
ఢిల్లీ వెళ్లిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఇతర మంత్రులు, జాతీయ నేతలనూ కలవనున్నారు. నడ్డాతో తెలంగాణ బీజేపీ నేతల భేటి తర్వాత పెను మార్పులు వస్తాయన్న సమాచారం అందుతోంది. అధ్యక్షుడి మార్పుపై ఈ భేటీలో చర్చ ఉంటుందని తెలుస్తోంది. బండిని ఓప్పించి అధ్యక్షుడిని మారుస్తారని సమాచారం.

kishan reddy

-కొత్త అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి..
తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్‌గా కిషన్‌రెడ్డిని నియమిస్తారని తెలుస్తోంది. ఈమేరకు ఇప్పటికే అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడితోపాటు కీలక నేతలుగా ఉన్న ఈటల రాజేందర్, రాజగోపాల్‌రెడ్డికి కూడా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఈటలను ఎలక్షన్‌ కమిటీ కన్వీనర్‌గా నియమిస్తారని తెలిసింది. రాజగోపాల్‌రెడ్డికి కూడా కీలక పదవి ఇస్తారని అంటున్నారు. ఎన్నికలకు మరో నాలుగు నెలలు మాత్రమే గడువు ఉన్నందున అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని పదవులు అప్పగిస్తారని తెలుస్తోంది.

-కేంద్ర మంత్రివర్గంలోకి బండి సంజయ్‌..
ఇక అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. కిషన్‌రెడ్డికి పార్టీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించి ఆయన స్థానంలో బండిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం. కిషన్‌రెడ్డిని కేంద్రమంత్రిగా కూడా కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

-బీసీల్లో వ్యతిరేకత..
కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీలో చేరికలు ఆగిపోయాయి. చిన్నా చితక నేతలు చేరుతున్నా పెద్ద నాయకుల చేరికలు లేవు. బీజేపీలో చేరుతారని భావించిన సీనియర్ నేతలు పొంగులేటి, జూపల్లి సైతం పార్టీ తీరు నచ్చక కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. రెడ్డిలందరూ కూడా కాంగ్రెస్ పంచున చేరుతున్నారు. కాంగ్రెస్ నే రెడ్డిల స్వర్గధామంగా మార్చుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుతో ఫలితం ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతను అధ్యక్షుడిని చేస్తే అగ్రవర్ణ నేతలు పార్టీలో చేరతారని అధిష్టానం భావిస్తోంది. అందుకే కిషన్‌రెడ్డిని అధ్యక్షుడిని చేయాలని చూస్తోంది. అయితే ఇదే సమయంలో బీసీల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్‌కు రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌కు కేసీఆర్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇద్దరూ అగ్రవర్ణ నేతలే. తాజాగా కిషన్‌రెడ్డి కూడా అగ్రవర్ణ నేత కావడంతో బీసీలు దూరమయ్యే అవవాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకే బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి ఇస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బలమైన రెడ్డి సామాజికి వర్గాన్ని అధ్యక్షుడిని చేయడం ద్వారా ఆ సామాజికవర్గ నేతలు పార్టీలోకి వస్తారని అధిష్టానం భావిస్తోంది.