Lok Sabha Election 2024: ఇడ్లీ, సాంబార్ గో బ్యాక్ అంటూ నినదించి.. అన్నాబత్తుల రవీంద్రనాథ్, జైన్ వంటి వారి ప్రాణత్యాగంతో.. తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం జిల్లా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఈ జిల్లాలోని పది నియోజకవర్గాలు ఉండగా… భద్రాచలం, పినపాక, ఇల్లెందు మినహా.. మిగతా ఖమ్మం, అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా, పాలేరు, మధిర, కొత్తగూడెం నియోజకవర్గాలతో ఖమ్మం పార్లమెంటు స్థానం ఏర్పడింది. ఈ స్థానంలో ఎక్కువసార్లు కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత కమ్యూనిస్టు, టిడిపి, భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారు.. అయితే ఖమ్మం పార్లమెంటు స్థానం గడిచిన రెండు ఎన్నికల్లో ఒక్కోసారి ఒక్కొక్కరిని ఎన్నుకుంటూ వస్తోంది.
పోటాపోటీ
ఖమ్మం పార్లమెంటు స్థానంలో ఈసారి పోటీ రసవత్తరంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు దక్కించుకోకపోయినప్పటికీ.. భారీగా ఓట్లు సాధించకపోయినప్పటికీ.. ఈసారి ఫలితం తనకు అనుకూలంగా ఉంటుందని భారతీయ జనతా పార్టీ నాయకులు భావిస్తున్నారు..”కేంద్రం చేపట్టిన పనులు ప్రజల్లోకి వెళ్లాయి. ప్రజలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేసిందో అర్థమవుతోంది. స్మశాన వాటిక నుంచి మొదలు పెడితే సిసి రోడ్ల వరకు కేంద్రం ఇచ్చిన నిధులతోనే నిర్మించారని ప్రజలకు తెలిసి పోయింది. పైగా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది. అటు భారత రాష్ట్ర సమితి కూడా తెలంగాణ ప్రజలను నట్టేట ముంచింది. ఫలితంగా నా విజయం ఖాయం అయిపోయిందని” భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్ అంటున్నారు. ఇక ఖమ్మం పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. అయినప్పటికీ గుండెలపై చేయి వేసుకొని గెలుస్తామని చెప్పే ధీమా వారిలో కనిపించడం లేదని తాండ్ర వినోద్ చెబుతున్నారు.
ముగ్గురు ముగ్గురే
ఖమ్మం పార్లమెంటు స్థానంలో ఈసారి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి పోటీలో ఉన్నారు.. కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రామ సహాయం రఘురామిరెడ్డి బరిలో ఉన్నారు.. భారత రాష్ట్ర సమితి నుంచి నామ నాగేశ్వరరావు సై అంటున్నారు.. రామ సహాయం సురేందర్ రెడ్డి, తాండ్ర వినోద్ రావు తొలిసారి ఖమ్మం పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తుండగా.. సిట్టింగ్ ఎంపిగా నామ నాగేశ్వరరావు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ” నేను చేసిన పనులే గెలిపిస్తాయి. నాకు ప్రజల ఆశీర్వాద బలం ఉంది. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉన్నాను. కచ్చితంగా నాకు 2019 నాటి ఫలితమే ఎదురవుతుందని” నామ నాగేశ్వరరావు అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురామిరెడ్డి కూడా ధైర్యంతో ఉన్నారు. ” నాది కూసుమంచి మండలం. మా నాన్న రామ సహాయం సురేందర్ రెడ్డి ఇక్కడ వారికి పరిచయమే. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మరింత అభివృద్ధి జరగాలంటే కచ్చితంగా నన్ను ఎంపీగా గెలిపించాలి. అప్పుడే ప్రజలకు ప్రభుత్వ పథకాలు మరింత చేరువవుతాయని” కాంగ్రెస్ అభ్యర్థి రామ సహాయం సురేందర్ రెడ్డి అంటున్నారు.
తాండ్ర వినోద్ కు కేంద్రమంత్రి పదవి?!
ఎన్నికల్లో గెలిస్తే తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని వినోద్ కుమార్ చెబుతున్నారు. ఇప్పటికే ఆయన ఏకలవ్య ఫౌండేషన్ ఏర్పాటు చేసి లక్షలాది మంది రైతులకు పలు రకాలుగా సహాయ సహకారాలు అందించారు.. ఇప్పటికి తన ఫౌండేషన్ ద్వారా వివిధ రకాలైన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు.. పార్టీకి సంబంధించి రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, బిఎల్ సంతోష్ వంటి వారి అండదండలు ఉండడంతో.. గెలుస్తానన్న ధీమా తాండ్ర వినోద్ లో కనిపిస్తోంది. ఇటీవల ఆయన నిర్వహించిన ఎన్నికల సభలకు విపరీతమైన స్పందన లభించిందని బిజెపి నాయకులు చెబుతున్నారు. ఈసారి ఖమ్మం కోటలో కాషాయ జెండా రెపరెపలాడుతుందని స్పష్టం చేస్తున్నారు… ఇప్పటికే తన సొంత విజన్ ను బుక్ లెట్ రూపంలో ముద్రించి ఇంటింటికి పంచుతున్నారు. ముఖ్యంగా యువతను, రైతులను ఎక్కువగా తన వైపు తిప్పుకునేందుకు తాండ్ర వినోద్ ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి.. 6 గ్యారంటీల హామీల అమలను ప్రధానంగా ప్రస్తావిస్తూ.. ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోను కరపత్రాల రూపంలో ముద్రించి పంపిణీ చేస్తున్నారు. ఇక భారత రాష్ట్ర సమితి అభ్యర్థి నామా నాగేశ్వరరావు తన హయాంలో చేసిన అభివృద్ధి పనులను చెప్పుకుంటూ.. తాను గెలిస్తే ప్రజల గొంతుకు అవుతానని ప్రకటిస్తున్నారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More