Farmer assurance: కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలను ప్రకటించింది. అందులో భాగంగా ఒక్కో రంగాన్ని టార్గెట్ చేస్తూ ఈ పథకాలకు రూపకల్పన చేసింది. ఆరు గ్యారంటీలతోనే అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ వస్తోంది. ఇప్పటికే చాలా వరకు పథకాలను అమలు చేసి ప్రజల మనసులు గెలుచుకుంది. ఇక త్వరలోనే రైతులకు మరో గుడ్‌న్యూస్ అందించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం.
రైతుల కోసం ఇప్పటికే ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేసింది. సుమారుగా 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లను జమ చేసినట్లు ప్రభుత్వం చెప్తోంది. ఇప్పటికే రైతు రుణమాఫీ అమలు చేయడంతో ఇక ఇప్పుడు ప్రభుత్వం రైతుభరోసాపై దృష్టి సారించింది. అయితే.. ఇంకొంత మందికి రుణమాఫీ కావాల్సి ఉండడంతో వారికి కూడా త్వరలోనే రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. రుణమాఫీ పూర్తిచేయడంతోపాటు రైతుభోరోసాను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు త్వరలోనే తీపి కబురు చెప్పేందుకు సీఎం సిద్ధం అయ్యారు. అంతేగాకుండా ఈ నెలాఖరు నుంచే ఈ స్కీమ్‌ను అమలు చేసేందుకు ప్రభుత్వం రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు అవసరమైన నిధులను సర్దుబాటు చేయాలని సీఎం ఆర్థిఖ శాఖను ఆదేశించినట్లు సమాచారం. మొదటి విడతలో ఎకరం నుంచి మొదలు పెట్టి.. డిసెంబర్ నెలాఖరు నాటికి అందరికీ పూర్తిచేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు సమాచారం.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కింద ఏటా ఎకరాకు రూ.10వేలు అందించింది. ఇదే పథకాన్ని కొనసాగింపుగా.. రేవంత్ పంట సాయాన్ని రూ.15వేలు ఎకరాకు అందిస్తామని ప్రకటించారు. రెండు విడతల్లో ఈ సాయాన్ని అందించనున్నారు. రెండు సీజన్లకు గాను రూ.7,500 చొప్పున అందించనున్నట్లు ఎన్నికలకు ముందు రేవంత్ చెప్పారు. ప్రభుత్వం కొలువుదీరి ఏడాది సమయం దగ్గరకు వస్తుండడం.. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల గడువు ముంచుకొస్తుండడంతో వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే.. గత ప్రభుత్వంలో కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములకు సైతం రైతుబంధు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది వందలాది ఎకరాలు ఉన్నవారికి కూడా సాయం అందించారన్న అపవాదు ఉంది. చాలా మంది చిన్నకారు రైతులకంటే పెద్ద రైతులకే మేలు జరిగిందన్న ప్రచారం ఉంది. దీంతో ఆ తప్పిదం చేయకూడదని సర్కార్ పకడ్బందీగా ప్లాన్ చేస్తోంది. ఈసారి అర్హులైన వారికే సాయం అందేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. సాగులో ఉన్న భూములకే రైతుభరోసా పంట పెట్టుబడి సాయం అందిస్తామని ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం ప్రకటించారు. ఈ క్రమంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పథకాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈనెలాఖరు నుంచి ప్రారంభించి ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. జనవరిలోనే ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అంతకంటే ముందే ఈ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేసి తీరాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. మొత్తంగా కొత్త సంవత్సరం లోపే ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పేందుకు సిద్ధమైందని అర్థం చేసుకోవచ్చు.