HomeతెలంగాణKodandaram: కొత్త ప్రభుత్వంలో కోదండరామ్‌కు కీలక పదవి.. రేవంత్‌ ఉత్తర్వులే ఆలస్యం!

Kodandaram: కొత్త ప్రభుత్వంలో కోదండరామ్‌కు కీలక పదవి.. రేవంత్‌ ఉత్తర్వులే ఆలస్యం!

Kodandaram: తెలంగాణలో రేవంత్‌ ప్రభుత్వం కొలువు తీరింది. మంత్రివర్గంలో అనుభవానికి పట్టం కట్టారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక.. ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషించే నియామకాలపై రేవంత్‌ కసరత్తు చేస్తున్నారు. ఇంటలిజెన్స్‌ చీఫ్‌గా శివధర్‌ రెడ్డిని నియమించారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శి నియామకం పూర్తయింది. ఇక.. ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు కొత్త ప్రభుత్వంలో కీలక పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

సొంత టీం ఏర్పాటు…
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ తన టీంను సిద్దం చేసుకుంటున్నారు. అందులో భాగంగా.. టీజేఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు కొత్త ప్రభుత్వంలో కీలక పదవి దక్కనున్నట్లు తెలిసింది. ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. పాలనలో ఆయన సహకారం తీసుకోవాలన్న ఉద్దేశంతో రేవంత్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం. నిజానికి ఎన్నికలకు ముందు నుంచే కోదండరామ్‌తో రేవంత్‌ రెడ్డి పలుమార్లు కలుస్తూ వచ్చారు. కాంగ్రెస్‌తో టీజేఎస్‌ పొత్తు పెట్టుకునేలా చేశారు. రాష్ట్ర వనరులు, విద్య, తెలంగాణకు అనుకూలమైన పరిపాలన వంటి రంగాల్లో కోదండరామ్‌కు అపారమైన పరిజ్ఞానం ఉంది. అలాంటి వ్యక్తిని సలహాదారుగా నియమిస్తే సీఎంగా తాను సక్సెస్‌ కావడానికి దోహదపడుతుందని రేవంత్‌ భావిస్తున్నట్లు తెలిసింది.

వారధిగా ఉంటానని..
సచివాలయం వద్ద జరిగిన ఉద్యోగుల సంబురాల్లో కోదండరామ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. ఉద్యోగ సంఘాలను అణగదొక్కిందని, వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వలేదని ఆరోపించారు. అదే సందర్భంలో కొత్త ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారధిగా పని చేస్తామని ప్రకటించారు. దీంతో ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందన్న వార్తలు బయటకు వచ్చాయి. రేవంత్‌రెడ్డి కూడా కొంత మంది మేధావులను పరిగణనలోకి తీసుకుని, కీలక పాత్రలు అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే కోదండరామ్‌కు ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవి ఇవ్వనున్నారని సమాచారం.

రాజీవ్‌శర్మపై వేటు..
సీఎస్‌ గా రిటైర్‌ అయిన తర్వాత రాజీవ్‌శర్మను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించారు కేసీఆర్‌. ఇప్పటికీ ఆయన అదే పోస్టులో ఉన్నారు. ఆయన ఆ పోస్టు నుంచి తప్పుకుంటారని చర్చ జరుగుతోంది. ఒకవేళ తప్పుకోకపోయినా ప్రభుత్వమే పంపించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆ పోస్టులో కోదండరామ్‌ను నియమిస్తారని సమాచారం.

పబ్లిక్‌ కమిషన్‌ చైర్మన్‌గా?
మరోవైపు ఉద్యోగ నియామకాల్లో కీలకమైన టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా కూడా కోదండరామ్‌ను నియమించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీపై విమర్శలు వస్తున్నాయి. పేపర్‌ లీకేజీలతో కమిషన్‌ ప్రతిష్ట దిగజారింది. ఈ నేపథ్యంలో దానిని చక్కదిద్దే బాధ్యతను కోదండరామ్‌కు అప్పగిచే అవకాశం కూడా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. సలహాదారు లేదా టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular