KCR – Congress Party : కర్ణాటక ఎన్నికల్లో ఘనవిజయంతో ఊపుమీదున్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలోనూ ఆ ఊపును కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘ఆపరేషన్ ఆకర్ష్’కు కాంగ్రెస్ తెరలేపినట్లు తెలుస్తోంది. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలకు హస్తం పార్టీ గాలం వేస్తోందని, దీనిని నేరుగా అధిష్ఠానమే ఆపరేట్ చేస్తోందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. వాస్తవానికి క్షేత్రస్థాయిలో బలమైన నిర్మాణం ఉన్నా.. ఉప ఎన్నికల్లో వరుస ఓటముల కారణంగా డీలా పడిన తెలంగాణ కాంగ్రె్‌సకు కర్ణాటక ఎన్నికల ఫలితం ఊపిరి పోసింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రేసులో గట్టి పోటీ ఇస్తూ వచ్చిన బీజేపీ ఒక్కసారిగా వెనుకబాట పట్టింది. దీంతో.. రాష్ట్రంలో బీఆర్‌ఎ్‌సను ఓడించే శక్తి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే ఉందన్న అంచనాతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఆ పార్టీలో చేరిన నాయకులకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుందని అంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ హవా తగ్గడంతోపాటు లిక్కర్ స్కామ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టు ఉండకపోవచ్చునన్న వార్తలూ వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయని చెబుతున్నారు. ఈ పరిణామం బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య అవగాహన ఉందన్న ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుందన్న భావనలో వారు ఉన్నట్లు చెబుతున్నారు. లిక్కర్ కేసులో కవిత అరెస్టు కాకపోతే ఇదే రకమైన ప్రచారం ప్రజల్లోకి వెళుతుందన్న అభిప్రాయాన్ని ఇప్పటికే కొందరు తాజా బీజేపీ నేతలు వ్యక్తం చేశారు కూడా. మరికొందరు నేతలు పార్టీలో తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. అధికార బీఆర్‌ఎ్‌సలోనూ పలువురు నేతలు టికెట్ గ్యారెంటీ లేకపోవడం, ఇతర కారణాలతో అసంతృప్తితో ఉన్నారు. ఇదే అదనుగా బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల్లో అసంతృప్తులను పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు అధిష్ఠానం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ నేతలతో అధిష్ఠానం దూతలే నేరుగా టచ్‌లోకి వెళ్తున్నట్లు, వారితో చర్చలు జరిపి చేరికలకు మార్గం సుగమం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఆపరేషన్‌లో అవసరాన్ని బట్టి కర్ణాటక నాయకులను కూడా భాగస్వాములను చేస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు నేతల చేరికలకు సంబంధించి చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తిరిగి వచ్చాక ఈ చేరికలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ బృందంలో అమెరికాకు రేవంత్ వెళ్లిన విషయం తెలిసిందే. కాగా, రాహల్ ఢిల్లీకి వచ్చాక తెలంగాణ సహా ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం జరగనుంది. ఈ సమావేశాల్లో రాహుల్‌తోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ప్రియాంక కూడా పాల్గొంటారు. ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు జరుగుతున్న ఈ సమావేశంలో చేరికలు సహా అన్ని అంశాలపైనా సమీక్షించనున్నట్లు చెబుతున్నారు.
ఖమ్మం సభకు ప్రియాంక..!
పీపుల్స్ మార్చ్ పేరుతో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క చేపట్టిన పాదయాత్ర ముగింపుగా ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాం క గాంధీ హాజరు కానున్నారు. ప్రియాంకతోపాటు పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులను రప్పించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని భావిస్తున్నారు. ఈ సభ 25న జరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నా.. ప్రియాంకగాంధీ ఇచ్చే తేదీ మేరకు అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ సభలోనే ప్రియాంకగాంధీ సమక్షంలో బీజేపీ, బీఆర్‌ఎస్ సహా ఇతర పార్టీలకు చెందిన పలువురు ముఖ్యనాయకులు కాంగ్రె్‌సలో చేరనున్నట్లు సమాచారం. మరోవైపు బీఆర్‌ఎస్ నుంచి బహిష్కరణకు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రె్‌సలో చేరడం దాదాపు ఖరారైందన్న వార్తలు వస్తున్నాయి. అయితే తొలుత ఖమ్మం సభలో ప్రియాంక సమక్షంలోనే చేరాలని వీరు కూడా భావించినా.. తమ బలాన్ని చాటాలంటే ప్రత్యేకంగా సభ నిర్వహించాలని వీరు యోచిస్తున్నారు. ఖమ్మంలో కాకుండా హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తే.. ఇటు ఖమ్మం, అటు మహబూబ్‌నగర్‌తోపాటు పలు జిల్లాల నుంచి భారీగా జనసమీకరణ చేయొచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి అమెరికా నుంచి వచ్చాక పొంగులేటి, జూపల్లితో చర్చ లు జరుపుతారని, ఆ తర్వాత రాహుల్‌తో మాట్లాడి ఓ ముహూర్తం ఖరారు చేస్తారని అంటున్నారు.
కాంగ్రెస్ లోకి నందీశ్వర్‌గౌడ్, పట్నం మహేందర్ రెడ్డి
పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత నందీశ్వర్‌గౌడ్.. కాంగ్రె్‌సలో చేరతారని ప్రచారం జరుగుతోంది. బీజేపీలో బీఆర్‌ఎస్ కోవర్టులున్నారని, వారిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశామని చెప్పడమే కాకుండా.. బీసీ నేతను సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటించాలని నందీశ్వర్‌గౌడ్ డిమాండ్ చేయడమే ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. 15 రోజుల్లో కోవర్టుల పేర్లను బయటపెడతానని ఆయన చెప్పడంతో ఆ లోగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని నందీశ్వర్‌గౌడ్ ఖండించారు. తాను బీజేపీలోనే కొనసాగుతానన్నారు. మరోవైపు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన తన అనుచరులతో రహస్యంగా సమావేశం నిర్వహించారు. తమకు భారత రాష్ట్ర సమితిలో ఉంటే ఆదరణ దక్కడం లేదని, కాంగ్రెస్ లోకి వెళ్లడమే ఉత్తమమని కార్యకర్తలు చెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది.