KCR: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన గులాబీ పార్టీ.. పార్లమెంటు ఎన్నికల్లో సత్తాచాటాలనుకుంటోంది. పార్టీ నిలబడాలంటే.. సిట్టింగ్ స్థానాలను గెలవాలని భావిస్తోంది. ఈమేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కోవాలని వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలో మార్చి 12న తనకు బాగా అచ్చివచ్చిన కరీంనగర్ నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు గులాబీ బాస్ కేసీఆర్. ఈమేరకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. మంగళవారం బీఆర్‌ఎస్ కదన భేరీ పేరుతో నిర్వహించే ఈ సభకు కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల అభ్యర్థుల తరఫున ప్రచారం చేయబోతున్నారు.
సెంటిమెంటు జిల్లా నుంచే..
కేసీఆర్ సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. ఎన్నికల వేళ మరీ ఎక్కువ సెంటిమెంటు ఉంటుంది. అందుకే తనకు బాగా అచ్చివచ్చిన కరీంనగర్ నుంచి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం ప్రారంభిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో 2014, 2018, 2023 ఉమ్మడి కరీనంగర్ జిల్లా పరిధిలోని హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. 2014, 2018లో సక్సెస్ అయ్యారు. 2023లో వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. ఇక లోక్‌సభ ఎన్నికల ప్రచారం కరీంనగర్ నుంచే ప్రారంభిస్తున్నారు. 2014, 2019లో ఇక్కడి నుంచి ప్రచారం మొదలు పెట్టడంతో కలిసి వచ్చింది. అందుకే 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారం కూడా ఇక్కడి నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. మరి ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.
అభ్యర్థులు కరువు..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్‌ఎస్ తరఫున ఎంపీలుగా పోటీ చేసేందుకు నేతలు వెనుకాడుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఓవర్ లోడ్ అయిన కారు ఇప్పుడు ఖాళీ అవుతోంది. నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఇక ఎన్నికల్లో పోటీ అంటే వద్దుబాబోయ్ అంటున్నారు. దీంతో కేసీఆర్ పలిచి మరీ టికెట్ ఇచ్చినా పోటీకి ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం నాలుగు స్థానాలకు కేసీఆర్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్‌రావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవితకు టికెట్ ఇచ్చారు. ఒక్క వినోద్‌కుమార్ మినహా మిగతా ముగ్గురు అయిష్టంగానే టికెట్ తీసుకున్నారు. అందుకే కేసీఆర్ ఎన్నికల ప్రచారం కరీంనగర్ నుంచే మొదలు పెట్టాలని భావిస్తున్నారు.
సెంటిమెంటు కలిసొస్తుందని..
సెంటిమెంటును నమ్ముకేనే కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ సెంటిమెంటును నమ్ముకున్నారు. తెలంగాణ ఉద్యమం ఇక్కడి నుంచే మొదలు పెట్టడం, ఆమరణ దీక్ష ఇక్కడే ప్రారంభించడం, గతంలో తాను రెండుసార్లు ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన నేపథ్యం ఉండంతో ప్రస్తుత గడ్డు పరిస్థితిలో పార్టీకి ఊపు తీసుకురావడానికి మళ్లీ సెంటిమెంటు జిల్లానే నమ్ముకున్నారు. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో కాస్తో కూస్తో బలం ఉన్న జిల్లాగా ఉమ్మడి కరీంనగర్ నిలిచింది. ఇక్కడి 13 అసెంబ్లీ స్థానాల్లో 5 చోట్ల బీఆర్‌ఎస్ గెలిచింది. దీంతో తొలి సభ ఇక్కడ నిర్వహిస్తే జన సమీకరణకు కూడా ఇబ్బంది ఉండదని కేసీఆర్ భావించారు. అందుకే కరీంనగర్‌ను లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వేదికగా చేసుకున్నారు.
బలంగా బీజేపీ, కాంగ్రెస్..
ఇదిలా ఉంటే.. కరీంనగర్‌లో అధికార కాంగ్రెస్, బీజేపీ కూడా బలంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాగ్రెస్ ఉమ్మడి జిల్లాలో 8 స్థానాలు గెలిచింది. ఇక బీజేపీకి ఇక్కడ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కరీంనగర్‌లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో బరిలో దిగుతున్న తన బంధువు అయిన వినోద్‌కుమార్‌ను ఇక్కడి నుంచి ఎలాగైనా గెలిపించాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడి సభ సక్సెస్ అయితే రాష్ట్రమంతా పార్టీకి ఊపు వస్తుందని గులాబీ బాస్ భావిస్తున్నారు.
అవినీతికి కేరాఫ్
ఇదిలా ఉంటే.. కేసీఆర్ సెంటిమెంటు జిల్లా కరీనంగర్‌లోనే బీఆర్‌ఎస్ పాలనతో అవినీతి అక్రమాలు ఎక్కువగా జరిగాయి. తన కొడుకు నియోజకవర్గం సిరిసిల్లలో ఇసుక మాఫీయా ఆగడాలకు అంతులేదు. కరీంనగర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నేతల భూకబ్జాలు, సామాన్యుల ఆస్తుల ఆక్రమణలు వేలాదిగా జరిగాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్పొరేటర్లపై కేసులు అయ్యాయి. పోలీసులపైనా వేటు పడుతోంది. కొందరు జైలుకు కూడా వెళ్లారు. మంథనిలో హత్యా రాజకీయాలు పెరిగాయి. ఆలాయర్ దంపతులను పట్టపగలు నడిరోడ్డుపై నరికినా ఇప్పటికీ చర్యలు లేదు. నాడు అధికార పార్టీగా నేతలను వెనుకేసుకొచ్చారు కేసీఆర్. ఇక కాళేశ్వరం పేరుతో ఉమ్మడి కరీనంనగర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అడ్డు అదుపు లేకుండా సాగింది.
భయపెడుతున్న సర్వేలు..
ఇదిలా ఉంటే.. బీఆర్‌ఎస్‌ను ప్రీపోల్ సర్వేలు భయపెడుతున్నాయి. ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలు పార్లమెంటు ఎన్నికలపై సర్వే ఫలితాలను ప్రకటించాయి. దాదాపు అన్ని సర్వేలు బీఆర్‌ఎస్‌కు 2 నుంచి 3 స్థానాలే వస్తాయని వెల్లడించాయి. ఈ క్రమంలో కేసీఆర్ తన సొంత మీడియా సంస్థలోనూ సర్వే చేయించారు. అందులోనూ షాకింగ్ ఫలితాలే వచ్చాయి. ముఖ్యంగా కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ మూడో స్థానానికి పరిమితమవుతుందని సొంత మీడియా సర్వేలో తేలడం గులాబీ పార్టీకి మింగుడు పడడం లేదు. అందుకే కేసీఆర్ ప్రచారాన్ని ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఉద్యమ కాలంలో తనకు అండగా నిలిచిన కరీంనగర్ జిల్లానే ప్రస్తుత గడ్డు పరిస్థితిలో పార్టీని గట్టెక్కిస్తుందని భావిస్తున్నారు. మరి గులాబీ సెంటిమెంట్ ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.