తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ హైదరాబాద్ వాసులకు శుభవార్త చెప్పింది. రోజురోజుకు ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఉల్లి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది కిలో 160 రూపాయలకు చేరిన ఉల్లి ఈ సంవత్సరం కూడా రిటైల్ మార్కెట్ లో 100 రూపాయలకు పైగా పలుకుతుండటం గమనార్హం. దీంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా సబ్సిడీ ఉల్లి విక్రయాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
హైదరాబాద్ లోని ఎర్రగడ్డ మార్కెట్ లో కిలో 40 రూపాయల చొప్పున ఉల్లి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. రాయితీ ఉల్లి విక్రయాలు ఉదయం 11 గంటల నుంచి మొదలు కానుండగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. బహిరంగ మార్కెట్ ధరలతో పోలిస్తే సగం కంటే తక్కువ ధరకే ప్రభుత్వం ఉల్లి అమ్మకాలు చేపడుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉండనుంది.
దసరా, బతుకమ్మ పండగల నేపథ్యంలో ఉల్లికి డిమాండ్ పెరిగింది. తెలంగాణ సర్కార్ భవిష్యత్తులో ఇతర మార్కెట్లలో కూడా సబ్సిడీ ఉల్లి విక్రయాలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. వర్షాలు, వరదల వల్ల ఉల్లి పంట దిగుబడి తగ్గడంతో రేట్లు పెరిగాయి. నెల రోజుల క్రితం వరకు 100 రూపాయలకు 5 కిలోల చొప్పున అమ్మిన వ్యాపారులు ప్రస్తుతం కిలో ఉల్లి 100 రూపాయలు చెబుతున్నారు.
మరోవైపు ఏపీలో ఇప్పటికే సబ్సిడీ ఉల్లిపాయల విక్రయాలు జరుగుతున్నాయి. మార్కెట్ లో 40 రూపాయలకే ప్రభుత్వం ఉల్లిని విక్రయిస్తోంది. తక్కువ ధరకే జగన్ సర్కార్ ఉల్లిని ఇస్తుండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.