HomeతెలంగాణParliament Election 2024: సోనియాకు పోటీగా కేసీఆర్.. బిజెపి నుంచి కిషన్ రెడ్డి!

Parliament Election 2024: సోనియాకు పోటీగా కేసీఆర్.. బిజెపి నుంచి కిషన్ రెడ్డి!

Parliament Election 2024: రాజకీయాలు ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటాయో ఎవరూ ఊహించరు. ఎందుకంటే అంతిమ లక్ష్యం అధికారం కాబట్టి రాజకీయ నాయకులు ఎలాంటి ఎత్తులనైనా, ఎలాంటి చిత్తులనైనా చేయగలరు. కాబట్టి రాజకీయాలంటే ఇలానే ఉండాలని లేదు. ఇలా ఉంటేనే బాగుంటాయని చెప్పడానికీ లేదు. మొదటిదాకా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం నెలకొంది. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు.. దేశమంతా పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. దీని అంతటికి కారణం కాంగ్రెస్ తెలంగాణ పొలిటికల్ విభాగం చేసిన తీర్మానం. ఇంతకీ ఈ విభాగం ఏం తీర్మానం చేసిందయ్యా అంటే..

హైదరాబాద్ కు కూత వేటు దూరంలో ఉన్న మెదక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీని పోటీ చేయాలని కాంగ్రెస్ తెలంగాణ రాజకీయ విభాగం తీర్మానం చేసింది. సరే రాజకీయ విభాగం అన్నాక ఎన్నో తీర్మానాలు చేస్తూ ఉంటుంది. అందులో ఇది ఒకటి. అలాగని దీనిని తేలిగ్గా తీసి పారేయడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో అది వేసే ప్రతి అడుగు కూడా ఎంతో కొంత విజిబుల్ ఉంటుంది. అలాంటప్పుడు సోనియాగాంధీని మెదక్ నుంచి పోటీ చేయాలని తీర్మానం చేయడం ఒకింత ఆసక్తికరమే. అయితే దీనికి సోనియా గాంధీ ఒప్పుకుంటారా లేదా అనేది తర్వాత విషయం. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థానాలు రాలేదు. ఇది కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని జిల్లా. హరీష్ రావు కూడా ఈ జిల్లా వాసి కావడంతో ప్రెస్ జోరుకు ఈ జిల్లా బ్రేక్ వేసిందనే చెప్పాలి. అయితే ఈ మెదక్ నియోజకవర్గం నుంచి గతంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పోటీ చేశారు కూడా. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. ఇంతటి ట్రాక్ రికార్డు ఉంది కనుక మెదక్ నుంచి సోనియాగాంధీ పోటీ చేస్తే బాగుంటుందని అభిప్రాయానికి కాంగ్రెస్ పార్టీ రాజకీయ విభాగం వచ్చింది. ఇక సోనియా గాంధీకి భారత రాష్ట్ర సమితి తరపున ప్రత్యర్థిగా ఎవరు పోటీ చేస్తారని చర్చ మొదలైనప్పుడు.. కెసిఆర్ పేరు వినిపించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన సొంత నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. కామారెడ్డి నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు.. వాస్తవానికి గజ్వేల్ లో ఈటల రాజేందర్ ఇంకా కొంచెం ఎఫర్ట్ పెట్టి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికీ అంటూ ఉంటారు. అయితే మెదక్ సిట్టింగ్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో.. ఆ స్థానం నుంచి పోటీ చేయాలని కేసిఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం లో ఉప ఎన్నిక రావడం ఖాయం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారా? ఒకవేళ ఆయన ఎంపీ అయితే చేసేది ఏముంటుంది? ఢిల్లీలో చక్రాలు తిప్పేంత సీన్ లేదు.. అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ కూడా లేదు. అలాంటప్పుడు కెసిఆర్ ఎలాంటి సందేశం తో పోటీ చేస్తారు అనేది పొలిటికల్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ప్రశ్న.. గతంలో అంటే సారు, కారు, 16 అనే నినాదంతో ప్రచారం చేశారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు అనేది ఒకింత ఆసక్తికరమే.

ఇక అటు కాంగ్రెస్, ఇటు భారత రాష్ట్ర సమితి అభ్యర్థులపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వారికి పోటీగా ఎవరు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది.. అయితే బిజెపి నుంచి కిషన్ రెడ్డి బరిలో ఉంటారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇదే సమయంలో గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. చివరికి తన సొంత నియోజకవర్గ అంబర్పేట నుంచి బిజెపి అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు. 2018 ఎన్నికల్లో అంబర్పేట నియోజకవర్గం నుంచి ఓడిపోయిన కిషన్ రెడ్డి తర్వాత సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించారు. కేంద్ర సహాయక మంత్రి పదవి పొందారు. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల ముందు బోనస్గా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. అయితే దూకుడుగా ప్రచారం చేయడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. చాలామంది కూడా సంజయ్ నాయకత్వాన్ని, కిషన్ రెడ్డి నాయకత్వాన్ని బేరీజు వేయడం ప్రారంభించారు. అంతేకాదు ఎన్నికలకు ముందు ప్రారంభమైన అంతర్గత కుమ్ములాటలు చివరి వరకు కొనసాగడంతో సంజయ్ నుంచి మొదలు పెడితే రఘునందన్ రావు వరకు ఓటమిపాలయ్యారు.. అయితే ఇప్పుడు వీరి మధ్య సయోధ్య కుదురుతుందా లేదా అనేది ఒక ప్రశ్న. ఇక కిషన్ రెడ్డి వంటి వారు ఒకవేళ మెదక్ నుంచి పోటీ చేస్తే.. బిజెపికి జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువ అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పైగా అక్కడ రఘునందన్ రావు మెదక్ నుంచి పోటీ చేయాలని ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. దుబ్బాక నుంచి ఓడిపోయారు కాబట్టి ఆ సింపతి తనకు కలిసి వస్తుందని ఆయన నమ్ముతున్నారు. మరోవైపు ఈటల రాజేందర్ కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే డీకే అరుణ ను మెదక్ నుంచి బరిలోకి దింపితే ఎలా ఉంటుందని చర్చ కూడా నడుస్తోంది. అయితే తర్వాతి కేటాయింపులు ఎలా ఉంటాయో తెలియదు కానీ.. ప్రస్తుతం మెదక్ పార్లమెంటు స్థానంపై మాత్రం భలే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న అనారోగ్య పరిస్థితులు దృష్ట్యా సోనియా గాంధీ మెదక్ నుంచి పోటీ చేస్తారా అనేది ఒకింత అనుమానమే. ఇక కేసీఆర్ కూడా ఇంకా కోలుకోలేదు.. బిజెపిలో చర్చలు తప్ప అభ్యర్థి ఎవరో తెలియదు.. మీడియా ఊరుకోదు కదా.. రకరకాల కథనాలను వండి వారుస్తుంది. మెదక్ పార్లమెంట్ స్థానంపై జరుగుతున్న చర్చ కూడా అలాంటిదే.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version