KCR- National Politics: కొడితే పీఎం అయిపోవాలి.. మోడీని గద్దెదించేయాలి.. దేశ్ కీ నేతగా కేసీఆర్ ఆవిర్భవించాలి. జాతీయ రాజకీయాల్లోకి రంగ ప్రవేశం కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలన్నీ అవే. అయితే ప్యాన్ ఇండియా లెవల్లో రాజకీయం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆశయాలు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నాయి. జాతీయ రాజకీయాలను కేసీఆర్ శాసిస్తారని, కేటీఆర్ కూడా తన తండ్రికి పూర్తి మద్దతు ఇస్తున్నారని టీఆర్‌ఎస్ నేతలు విశ్వసిస్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆశయాలను తెలుగు చిత్రాలైన ‘బాహుబలి,’ ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్’తో పోల్చుతూ టీఆర్ఎస్ అభిమానులు సందడి చేస్తున్నారు.

‘ది హిందూ’ ప్రింట్ ఎడిషన్ రీడిజైన్ సందర్భంగా జర్నలిస్టులతో కేటీఆర్ మాట్లాడుతూ.. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప లాంటివి పాన్ ఇండియాలో హిట్ అయినప్పుడు కేసీఆర్ ఎందుకు కాలేరని అన్నారు. కేటిఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తల క్లిప్పింగ్‌పై స్పందించిన బిజెపికి చెందిన అమిత్ మాల్వియా టిఆర్ఎస్ నాయకులపై విరుచుకుపడ్డారు. కెసిఆర్‌ను ‘లైగర్’ చిత్రంతో పోల్చారు. ఇది కూడా పాన్ ఇండియా చిత్రం అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యిందని చురకలు వేశారు.
“ఎందుకంటే “ఫామ్‌హౌస్ రిపబ్లిక్” కి చెందిన కేసీఆర్ లైగర్ లాంటివాడు. బాహుబలి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కమలం మాత్రమే భారతదేశాన్ని ఆకర్షించే ఏకైక ‘పుష్పం’, అతని నాయకత్వంలో భారతదేశం వేగంగా సంస్కరిస్తున్న రాష్ట్రం (RRR)”అని అమిత్ మాల్వియా ట్వీట్ చేసి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బిజెపి అభిప్రాయం ప్రకారం హీరో విజయ్ దేవరకొండను పరోక్షంగా ఎగతాళి చేసినట్టు అర్థమవుతోంది. తెలంగాణలో టీఆర్‌ఎస్ కు మద్దతుగా ఉంటున్న విజయ్ ను ఇలా దెప్పిపొడిచినట్టుగా తెలుస్తోంది.

అలాగే తన తండ్రి నుంచి తెలంగాణ సీఎం పీఠం తీసుకునే అవకాశం కోసం కేటీఆర్ ఎదురు చూస్తున్నారని మాలవ్య ఆరోపించారు. ఔరంగజేబులా కేసీఆర్‌ను అధికారం నుంచి దించాలని కేటీఆర్ ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అదే ట్వీట్‌లో బీజేపీ నేత విమర్శలు గుప్పించారు..
వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను ప్రకటించిన తర్వాత కేసీఆర్ జాతీయ దృష్టిని ఆకర్షించారు. అతని రాజకీయ ఎత్తుగడలను కూడా బిజెపి నిశితంగా పరిశీలిస్తోంది. జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు అన్ని కోణాల్లో కేసీఆర్, ఆయన కుటుంబంపై బీజేపీ విరుచుకుపడుతోంది. ఇటీవల ఈడీ దాడులు కూడా తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలోనే కేసీఆర్ జాతీయ రాజకీయాలు ఇప్పడుు ‘ఆర్ఆర్ఆర్’ అవుతుందా? లేక ‘లైగర్’లా ఫ్లాప్ అవుతుందా? అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.