Longevity Diet: తిండి తింటే కండ కలదోయ్. కండ కలవాడే మనిషోయ్. వెనుకటికి గురజాడ అప్పారావు రాశారు గాని.. ఏ తిండి తింటే కండ పెరుగుతుందో చెప్పలేదు.. ఏదో సరదాకి అన్నాం గానీ.. ప్రస్తుత తరం అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నది. కారం తింటే అల్సర్, చక్కెర తింటే షుగర్, ఉప్పు తింటే బిపి.. ఇది చాలదన్నట్టు ముందుకు వచ్చే పొట్ట.. అడుగు తీసి అడుగు వేయాలంటే ఆయాసం.. చిన్న వయసులోనే దీర్ఘ కాలిక వ్యాధులు.. ఇలాంటి తరుణంలో 120 ఏళ్ళు బతకడం సాధ్యమేనా? ఏంటి జోక్ చేస్తున్నారా అని అనుకోకండి. నిజంగానే ఈ డైట్ తీసుకుంటే మన సగటు ఆయుర్దాయాన్ని 120 ఏళ్ళ వరకు పొడిగించుకోవచ్చట!

ఇంతకీ ఏంటి ఆ డైట్
మనం తీసుకునే ఆహారం మీదనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఎంత మంచి పౌష్టికాహారం తీసుకుంటే మన ఆయుషు అంత పెరుగుతుంది. ఇప్పటివరకు రకరకాల డైట్లు వెలుగులోకి వచ్చాయి. కీటో డైట్, క్రాస్ డైట్, మెడి టెర్రేనియన్ డైట్ వంటివి అందులో ముఖ్యమైనవి. ఇప్పటికీ వీటిని చాలామంది పాటిస్తున్నారు. ముఖ్యంగా కీటో డైట్ అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలు బాగా పాటిస్తున్నారు. అయితే వీటన్నింటిని తలదన్నేలా లాంజివిటీ డైట్ అనే కొత్తది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. లాంజివిటి అంటే వైద్య పరిభాషలో దీర్ఘాయువు అని అర్థం. వాల్టర్ లాంగో అనే శాస్త్రవేత్త ఈ డైట్ ను అభివృద్ధి చేశారు. మనిషి జీవన విధానం, దానిని ప్రభావితం చేసే పోషకాహార పదార్థాలు, జన్యువులపై అవి ఏవిధంగా ప్రభావం చూపిస్తాయి, ఉపవాసం శరీరానికి లభించే ప్రయోజనాలు ఏమిటి? ఈ అంశాల ఆధారంగా ఆయన రకరకాల ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాల ఫలితాల ఆధారంగానే లాంజీవిటీ డైట్ ను ఆయన తెరపైకి తీసుకొచ్చారు.
ఈ డైట్ లో ఏముంటాయి
లాంజివిటీ డైట్ లో ఆకుకూరలు, బీన్స్, ఫలాలు, బాదం గింజలు, ఆలీవ్ నూనె, పాదరసం పాళ్ళు తక్కువగా ఉండే సముద్ర సంబంధిత ఆహారం. సాధారణంగా మొక్కల నుంచి వచ్చే ఆహారంలో విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. వీటిల్లో సంతృప్త కొవ్వుల శాతం చాలా తక్కువ. మొక్కల నుంచి వచ్చిన ఆహారాన్ని ఈ డైట్లో ఎక్కువగా సిఫారసు చేశారు కాబట్టి ఇది మెడిటేరేనియన్ డైట్ కు దగ్గరగా ఉంటుంది.
ఇవి తినకూడదు
పాలు, పాల సంబంధిత ఉత్పత్తులు, మాంసం, సంతృప్త కొవ్వులు, చక్కెర వంటి పదార్థాలను తీసుకోకూడదు. పాల ఉత్పత్తులు తీసుకోకుండా ఉండలేని వారు ఆవు, గేదె, మేక పాలు తీసుకోవచ్చు.

ఈ డైట్లో నిర్దిష్ట సమయం పాటు మనం ఏం తీసుకుంటున్నామన్నదే ముఖ్యం. మనం తీసుకునే ఆహారం 12 గంటల వ్యవధిలోనే పూర్తవ్వాలి. అంటే ఉదయం ఆరు నుంచి సాయంత్రం 6 గంటల దాకా మాత్రమే ఆహారం తీసుకోవాలి. నిద్రించే సమయానికి మూడు- నాలుగు గంటల ముందు ఏమి తినకూడదు. వారంలో రెండు రోజులు రెండు నుంచి మూడు కిలో జౌళ్ళ కంటే ఎక్కువ ఆహారం తీసుకోకూడదు. మిగతా ఐదు రోజుల్లో సాధారణ ఆహారం తీసుకోవచ్చు. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పరిమితిగా ఉండి.. టైప్ 2 మధుమేహాన్ని రాకుండా నియంత్రిస్తుంది. ఇక ఈ విధానంలో ప్రోటీన్ల ఆరగింపు మన శరీర బరువుపై ఆధారపడి ఉంటుంది. ఒక కిలో బరువుకు .
0.68 నుంచి 0.80 కు మించి ప్రోటీన్లు తీసుకోకూడదు. ఒక వ్యక్తి 70 కిలోల బరువు ఉన్నాడు అనుకుంటే రోజుకు 56 గ్రాముల ప్రోటీన్లకు మించి తీసుకోకూడదు. ప్రతీ మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి విటమిన్ సప్లిమెంట్స్, మినరల్ సప్లిమెంట్స్ తీసుకోవాలని ఈ డైట్లో సూచిస్తున్నారు. అయితే ఈ సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకుంటే గుండెజబ్బులు, క్యాన్సర్ వంటివి శరీరం పై దాడి చేయొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎలాంటి వ్యాయామం చేస్తే శరీరం మరింత ఉత్తేజం అవుతుందో ఈ డైట్లో ప్రస్తావించలేదు.