HomeతెలంగాణKCR: కేసీఆర్ పై విలీనం జోస్యాలు.. ఎంతవరకు ఫలిస్తాయి?

KCR: కేసీఆర్ పై విలీనం జోస్యాలు.. ఎంతవరకు ఫలిస్తాయి?

KCR: కాంగ్రెస్ పార్టీలో భారత రాష్ట్ర సమితి విలీనం అవుతుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మీరు చూస్తూ ఉండండి ఇది త్వరలో నెరవేరుతుంది.. బండి సంజయ్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హోదాలో ఇటీవల చేసిన వ్యాఖ్యలు. ఆయన అలా మాట్లాడాడో లేదో.. వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.. కెసిఆర్ తన పార్టీని బిజెపిలో విలీనం చేస్తారని, ఆయన గవర్నర్ అయిపోతారని, కేటీఆర్ కు ఏదో ఒక పదవి వస్తుందని, హరీష్ రావు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడవుతారని అన్నారు. నిజానికి పై వ్యాఖ్యలు కింది స్థాయి నాయకులు చేస్తే పెద్దగా విలువ ఉండేది కాదు. వాటిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ వ్యాఖ్యలు చేసింది సాక్షాత్తు బండి సంజయ్, రేవంత్ రెడ్డి కాబట్టి పరిగణలోకి తీసుకోవలసిన అవసరం ఏర్పడింది. అయితే వారు చేసినట్టుగా భారత రాష్ట్ర సమితి విలీనం సాధ్యమవుతుందా.. అది అంత సులభమా.. అలా చేస్తే భారత రాష్ట్ర సమితికి ఎలాంటి లాభం చేకూరుతుంది.. అనేవి డిబేటబుల్ ప్రశ్నలు. భారత రాష్ట్ర సమితిని విలీనం చేస్తామని అంటున్న మాటలు ఇవాల్టివి కావు. గతంలో 2004 లో కాంగ్రెస్ పార్టీతో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి పొత్తు పెట్టుకుంది. అప్పట్లో హరీష్ రావు మంత్రి అయ్యారు. కెసిఆర్ కేంద్ర మంత్రి అయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి బయటికి వచ్చింది. 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితి విలీనం అవుతుందని వార్తలు వినిపించాయి. అయితే అవి వాస్తవరూపం దాల్చలేదు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. 2018 ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారాన్ని దక్కించుకుంది. ఈ రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో.. అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టింది. 2023 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఫినిక్స్ పక్షి లాగా దూసుకొచ్చింది. అధికారాన్ని దక్కించుకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

సాధ్యమవుతుందా?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కెసిఆర్ కుమార్తె కవిత అరెస్టు అయ్యారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో శిక్ష అనుభవిస్తున్నారు. గత ఐదు నెలలుగా జైల్లో ఉంటున్నారు. ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టులు సమ్మతం తెలపడం లేదు. ఈ దశలో కవితకు బెయిల్ రావాలంటే కచ్చితంగా కేసీఆర్ తన పార్టీని బిజెపిలో విలీనం చేస్తారని.. కెసిఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు మంత్రి పదవి, హరీష్ రావుకు తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పదవి లభిస్తుందని ఇటీవల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. కెసిఆర్ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని.. ఎందుకంటే ఆయన ప్రభుత్వ హయాంలో ఎన్నో అవకతవకలు జరిగాయని.. వాటిపై విచారణ నిలుపుదల చేయాలంటే కచ్చితంగా కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాల్సిందేనని పేర్కొన్నారు.

గత ఉదంతాలు ఏం చెబుతున్నాయి

భారత రాష్ట్ర సమితికి గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు వచ్చాయి. పార్లమెంటు ఎన్నికల్లో 0 స్థానాలు వచ్చాయి. ఇక ఆ పార్టీ కి భాస్ గా కెసిఆర్ ఉన్నారు. మనదేశంలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలలో భారత రాష్ట్ర సమితి కూడా ఒకటి. వ్యూహాత్మక పొత్తులు.. ఎన్నికల్లో సహకారం వంటి అంశాల ఆధారంగా ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలకు మద్దతు పలికాయి. ఇప్పటికీ ఆ సంస్కృతి కొనసాగుతూనే ఉంది. ఇలాంటి రాజకీయాలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో భారత రాష్ట్ర సమితి విలీనం అనేది దాదాపు అసాధ్యమని.. మీడియాలో ఎప్పటికీ ఫోకస్ మోడ్ లో ఉండాలి కాబట్టి రాజకీయ నాయకులు అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని.. రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జేడీయూ, డీఎంకే, అన్నా డీఎంకే, ఆర్జేడీ వంటి పార్టీలు జాతీయ పార్టీలలో విలీనం అవుతాయని గతంలో వార్తలు వచ్చాయి.. వాస్తవానికి అవేవీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం తెలంగాణలో భారత రాష్ట్ర సమితి కూడా జాతీయ పార్టీలలో విలీమవుతుందని వార్తలు వస్తున్నాయి. చివరికి అవి వార్తలు గానే మిగిలిపోతాయి. కాకపోతే రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యల వల్ల మీడియాకు ఒక మసాలా దొరుకుతుంది. ఆ వార్తలు చదివే వారికి కాస్త కాలక్షేపం లభిస్తుంది. అంతే అంతకుమించి ఏమీ లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular