KCR Assembly: తెలంగాణ రాజకీయాలు రంజుగా మారబోతున్నాయి. ఇప్పట్లో ఎన్నికలు లేవు.. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. ఇన్నిరోజులపాటు లోకల్ బాడీ ఎలక్షన్లో జనాలు ఎంటర్టైన్మెంట్ పొందారు. ఇంకా ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి తెలంగాణ ప్రజలకు కోలుకోలేదు. అయితే అంతకుమించిన డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి తెలంగాణ పొలిటికల్ లీడర్లు సిద్ధంగా ఉన్నారు..
ఈనెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమవుతుంది. ఈ సమావేశాలకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం ఎర్రవల్లి క్షేత్రంలో మాజీ మంత్రులతో కెసిఆర్ మాట్లాడారు. ఈ నేపథ్యంలో తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నట్టు వారితో చెప్పారు.. ఆ మాజీ మంత్రులు మీడియాకు లీకులు ఇవ్వడంతో ఈ వార్త తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో విపరీతమైన చర్చకు దారితీస్తోంది. అసెంబ్లీకి వచ్చి, తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కెసిఆర్ ప్రణాళిక రూపొందించారని తెలుస్తోంది.
కాలేశ్వరం దగ్గర నుంచి మొదలుపెడితే ఫోన్ ట్యాపింగ్ వరకు ప్రతి వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ను ఇరుకున పెట్టడానికి ప్రణాళికలు రూపొందించారు రేవంత్ రెడ్డి. అయితే ప్రతి కేసులోనూ ఆరంభ శూరత్వం మాత్రమే కనిపిస్తోంది. అయితే ఈసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కెసిఆర్ ను గట్టిగా ఫిక్స్ చేయాలని రేవంత్ రెడ్డి భావించారు. అందువల్లే ఈ కేసును సజ్జనార్ కు అప్పగించారు. దీంతో ఆయన ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ప్రభాకర్ రావు నుంచి మొదలు పెడితే తిరుపతన్న వరకు అందరిని విచారించింది. కెసిఆర్ కు నోటీసులు కూడా పంపింది.
ఇటీవల కేసీఆర్ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతేకాదు, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో నిర్మించే పాలమూరు, రంగారెడ్డి పథకంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం తోలు తీస్తానని హెచ్చరించారు. అవసరమైతే ఉద్యమం కూడా చేపడతానని స్పష్టం చేశారు. అటు రేవంత్ రెడ్డి కూడా ఈ విమర్శలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ముందు నీకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. దీంతో కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. వాస్తవానికి 2023లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత కెసిఆర్ రెండు పర్యాయాలు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. సుదీర్ఘకాలం ఆయన వ్యవసాయ క్షేత్రానికి పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీకి కేసీఆర్ రావడం చర్చకు దారితీస్తోంది. ఒకవేళ కెసిఆర్ గనక సభలో పూర్తిస్థాయిలో ఉంటే.. చర్చ అర్థవంతంగా సాగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.