KCR BRK Bhavan: కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో కమిషన్ కు తప్పు అనిపించిన విషయాలను ప్రశ్నల రూపంలో కేసీఆర్ ఎదుట సంధించింది. దానికి ఆయన సమాధానం చెప్పారు. కొన్ని దస్త్రాలు కూడా అందించారు. ఒక పుస్తకాన్ని కూడా కమిషన్ సభ్యులకు ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన విచారణ దాదాపు 50 నిమిషాల పాటు సాగింది. విచారణ పూర్తయిన తర్వాత ఎర్రవల్లి ప్రాంతంలోని తన వ్యవసాయ క్షేత్రానికి కేసీఆర్ వెళ్లిపోయారు. కాలేశ్వరం కమిషన్ లో జస్టిస్ ఘోష్, కమిషన్ సెక్రటరీ మురళీధర్ కెసిఆర్ ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.. విచారణ నేపథ్యంలో బిఆర్కె భవన్ మొత్తాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పకడ్బందీగా భద్రత ఏర్పాటు చేశారు. అక్కడికి మీడియా ప్రతినిధులను రాకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నారు. ఇక గులాబీ కార్యకర్తలను చాలా దూరం నుంచే పోలీసులు నిలువరించారు. గులాబీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు బీఆర్కే భవన్ వద్ద ఉన్నారు. కెసిఆర్ కాన్వాయ్ రాగానే భారీగా నినాదాలు చేశారు.
అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కూడా..
బి ఆర్ కే భవన్ లో విచారణకు హాజరైంది కేసీఆర్ మాత్రమే కాదు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ కూడా ఈ భవనంలో జరిగిన విచారణకు హాజరయ్యారు. మొత్తంగా ఈ భవనంలో అధికారులు నిర్వహించిన విచారణకు హాజరైన రెండవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో మల్లెల బాబ్జి పై హత్యాయత్నం జరిగినప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ కేసులో ఆయన విచారణకు హాజరు కావాల్సి వచ్చింది.. మాజీ ముఖ్యమంత్రి హోదాలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత బిఆర్కే భవన్లో విచారణ ఎదుర్కొన్న రెండవ మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గెలిచారు.. వాస్తవానికి ఓపెన్ కోర్టులో విచారణ జరుగుతుందని భావించారు. కమిషన్ కూడా మీడియాకు ఇదేవిధంగా లీకులు ఇచ్చింది. కానీ తనకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో కెసిఆర్ వన్ టు వన్ విచారణను కోరారు. ఆయన విజ్ఞప్తిని అంగీకారంలోకి తీసుకున్న ఘోష్.. లోపలికి 9 మందిని అనుమతించింది. అందులోకి వెళ్ళిన వారిలో హరీష్ రావు, పద్మారావు గౌడ్, బండారు లక్ష్మారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనా చారి, వద్దిరాజు రామచంద్రను లోపలికి అనుమతించారు. అయితే ఈలోగా బయట ఉన్న కేటీఆర్ మీడియా సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ పై బిజెపి, కాంగ్రెస్ సంయుక్తంగా కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కమిషన్ చేసిన విచారణలో నిజాలు మొత్తం బయటపడతాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బిజెపికి తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. ఇక ఇప్పటివరకు అధికారులు మొత్తం 114 మందిని విచారించింది. 115వ వ్యక్తిగా కేసీఆర్ ను విచారించింది. కేసీఆర్ ను విచారించడం ద్వారా.. కమిషన్ తుది ఘట్టాన్ని పూర్తి చేసింది.