Arogya sree card : ఎన్నికల వేళ కొత్త పథకాలతో ఓటర్లకు గాలం వేయడం కేసీఆర్‌కే బాగా తెలిసిన విద్య. ఓటరు నాడి పట్టుకునేందుకు 2014 డబుల బెడ్రూం, దళితులకు మూడెకరాల భూమి హామీతో ఎన్నికలకు వెళ్లారు. ఈ రెండు హామీలు బీఆర్‌ఎస్ అలియాస్ టీఆర్‌ఎస్‌ను గెలిపించాయి. ఇక 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన గులాబీనేత.. ఎన్నికలకు కొన్ని నేలల ముందు.. రైతుబంధు, రైతుబీమా స్కీంలు ప్రవేశపెట్టారు. వ్యసాయానికి పెట్టుబడి ఇవ్వడం ప్రారంభించారు. ఈ ఎత్తుగడ కూడా ముందస్తు ఎన్నికల్లో వర్కౌట్ అయింది. 2014 మించిన సీట్లతో టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగురవేసింది. మరో ఐదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన కేసీఆర్.. మరో పథకంలో ఓటర్లకు ఎరవేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈసారి ఆరోగ్యంపై గులాబీ బాస్ దృష్టిపెట్టినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు..
ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న లక్ష్యంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతోపాటు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు కాంగ్రెస్‌ను రెండోసారి అధికారంలోకి తేవడంలో కీలకపాత్ర పోషించాయి. తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటున్న సమయంలోనూ ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా ఓటర్లు కాంగ్రెస్‌కే పట్టం కట్టడంలో ఈ మూడు పథకాలు కీలకపాత్ర పోషించాయి. దీంతో ఇప్పుడు కే సీఆర్ కూడా వైఎస్సార్ ఎత్తుగడతో ముందుకు సాగాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరలో కొత్త కార్డులను అందించాలని భావిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొత్త కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.
ఆరోగ్యశ్రీ ట్రస్టు సమావేశంలో కీలక నిర్ణయాలు..
ఈ క్రమంలో మంగళవారం మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ బోర్డు సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం త్వరలో అందించనున్న ఆరోగ్యశ్రీ కార్డు ముందుభాగంలో లబ్ధిదారు పేరు, పుట్టిన తేదీ, లింగం, కార్డు నంబర్ వంటి ప్రాథమిక వివరాలు ఉండనున్నాయి. ప్రభుత్వ లోగో, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లోగో, సీఎం కేసీఆర్ ఫొటో ముద్రించనున్నారు. స్కాన్ చేస్తే సమగ్ర వివరాలు తెలిసేలా క్యూఆర్ కోడ్‌ను కూడా కార్డ్‌పై ముద్రిస్తారు. వెనుక భాగంలో ఆరోగ్యశ్రీ ఉపయోగాలు ఉంటాయి.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు
– లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేసేందుకు ఈ–కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు.
– నిమ్స్ స్పెషల్ డాక్టర్ల ద్వారా ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్ ఆడిట్ నిర్వహించాలి.
– బయోమెట్రిక్ విధానంలో ఆరోగ్యశ్రీ రోగుల ఇబ్బందుల రీత్యా ఫేస్ రికగ్నైజేషన్‌ను అందుబాటులోకి తేవాలి.
– ఆన్‌లైన్ పర్యవేక్షణతో మరింత నాణ్యమైన డయాలసిస్ సేవలను అందించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించేందుకు అనుమతి.
– కరోనా సమయంలో రికార్డు స్థాయిలో 856 బ్లాక్ ఫంగస్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించిన కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి రూ.1.30 కోట్ల అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలి.
– మూగ, చెవిటి పిల్లలకు హైదరాబాద్ కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో ఉచితంగా నిర్వహిస్తున్న కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలను వరంగల్ ఎంజీ ఎంలోనూ అందుబాటులోకి తేవాలని బోర్డు నిర్ణయించింది.
ప్రభావం చూపుతుందా..
వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్ వేసిన ఆరోగ్యశ్రీ కొత్తకార్డుల ఎత్తుగడ ఏమేరకు ప్రభావం చూపుతుందో ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఈ పథకం వైఎస్సార్ తెచ్చిందే అని అందరికీ తెలుసు. దీంతో కోట్ల మంది లబ్ధిపొందారు. పరిమితి పెంచినా.. ఉచిత వైద్యం అందించడం పాత విషయమే కాబట్టి ఎన్నికల్లో పెద్దగా ప్రభావం ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్‌ఎస్ నేతలు మాత్రం ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అయితే సమయం తక్కువ ఉన్నందున ఈసారి గులాబీ బాస్ పాచిక ఏమేరకు పారుతుందో చూడాలి.