Hyderabad Outer Ring Road : బేస్ ప్రైస్ పై గోప్యత; ఔటర్ రింగ్ రోడ్డు లీజు పై కేసీఆర్ దాస్తున్న నిజాలు ఎన్నో?

. మూడు నాలుగు రోజుల క్రితం ఔటర్ రింగ్ రోడ్డు లీజు విషయంలో వివరణ ఇచ్చేందుకు అరవింద్ కుమార్ నిర్వహించిన మీడియా సమావేశానికి ఒక్క వీడియో కెమెరాను కూడా లోపలికి పంపించకపోవడం గమనార్హం.

Written By: Bhaskar, Updated On : May 7, 2023 10:24 pm
Follow us on

ఔటర్ రింగ్ రోడ్డు ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టే విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో నిజాలు దాస్తోంది. ఇంతవరకు దీనికి సంబంధించిన ఒక జీవో కాపీ కూడా వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకురాలేదు. పైగా దీనిపై మంత్రివర్గ సమావేశం జరిగిందంటూ బుకాయిస్తోంది. కనీసం విలేకరుల సమావేశం నిర్వహించకుండా ప్రభుత్వం ఇలా వ్యవహరించడం పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఓ సంస్థ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ప్రభుత్వానికి దరఖాస్తు చేయగా.. కీలక విషయాలు వెల్లడయ్యాయి.

ఏటా పెరుగుతున్నాయి

ఔటర్ రింగ్ రోడ్డు మీదకు వచ్చే వాహనాల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2021_22 కాలంలో రోజుకు సగటున 1.40 లక్షల కార్లు ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కితే.. 2022_23 కాలంలో ఆ సంఖ్య 1.60 లక్షలకు చేరుకుంది. అంటే 14% పెరుగుదల నమోదయింది. ఒక అంచనా ప్రకారం ఈ పెరుగుదల భవిష్యత్తులో మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగింది. రింగ్ రోడ్డు 158 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 19 ఎగ్జిట్ ల చుట్టూ జనావాసాల కేంద్రీకరణ విపరీతంగా జరుగుతున్నది. ఉదాహరణకు ఒక్క బాచుపల్లి ప్రాంతంలోనే రాబోయే మూడు సంవత్సరాలలో కనీసం 25 వేల ప్లాట్లు వస్తున్నాయి. ఇక గచ్చిబౌలి, కోకాపేట లాంటి ప్రాంతాల్లో ఈ సంఖ్య లక్ష వరకు ఉండవచ్చు. కూకట్పల్లి, నిజాంపేట, కెపిహెచ్బి, కొల్లూరు, తెల్లాపూర్ నుంచి పఠాన్ చెరువు వరకు తీసుకుంటే ఈ సంఖ్య ఐదు లక్షలు తేలిగ్గా దాటేస్తుంది. ఆయా ప్రాంతాల్లో స్థిరపడేవారు, ఐటీ ఉద్యోగుల్లో కనీసం 30 శాతం మంది కార్లు కొని రింగురోడ్డు ఎక్కుతారని భావించినా.. ఇప్పుడు ఉన్న వాహన ట్రాఫిక్ నాలుగు సంవత్సరాలలో దాదాపు రెట్టింపు అవుతుందని ఒక అంచనా. ఇలా పెరిగే వాహనాలు, ఏటా పెరిగే టోల్ చార్జీల తో ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా ఆదాయం పెరగడం తప్ప తగ్గే పరిస్థితి లేదు. చెప్పాలంటే కోవిడ్ లాంటి అసాధారణ సందర్భాలు తప్ప ఇలా ఏటా లాభాలు వచ్చే ప్రాజెక్టు ఏదీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేదు.

పైన పటారం లోన లొటారం

డిస్కంలు,జెన్ కో, ట్రాన్స్ కో, సింగరేణి.. ఇలా ఏ సంస్థను తీసుకున్నప్పటికీ మేడిపండు చందమే. ఔటర్ రింగ్ రోడ్డు మాత్రమే ప్రభుత్వానికి కామధేనువు. ఏటా టోల్ నిర్వహణ చార్జీలు, రోడ్ల మరమ్మతుల ఖర్చులు, సిబ్బంది జీతాలు తప్ప దీనిపై ప్రభుత్వం కొత్తగా, పెద్దగా చేయాల్సిన ఖర్చులు కూడా ఏమీ ఉండవు. వచ్చే ఆదాయంతో పోలిస్తే ఆ ఖర్చులు చాలా తక్కువ. రోడ్డు నిర్వహణకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి లాంటి భారాలు కూడా ప్రభుత్వంపై ఉండవు. గత రెండు సంవత్సరాలుగా ఔటర్ రింగ్ రోడ్డుపై వస్తున్న ఆదాయం పెరుగుతున్న తీరు భవిష్యత్తులోనూ అలా కొనసాగుతుందని భావిస్తే ఇది ప్రభుత్వానికి అత్యంత లాభసాటి ప్రాజెక్టు. ఇప్పుడు పెరిగిన నిష్పత్తిలో కాకుండా కొంత తగ్గుతుందని లెక్కించినప్పటికీ కనక వర్షమే కురుస్తుంది. ఉదాహరణకు కనిష్టంగా ఏట పదిహేను శాతం ఆదాయం పెరుగుతుంది అనుకుంటే.. వచ్చే 30 సంవత్సరాలలో రింగ్ రోడ్డు మీద వచ్చే ఆదాయం 2.7 లక్షల కోట్ల దాకా ఉంటుంది.

వచ్చే 30 సంవత్సరాలలో..

వచ్చే 30 సంవత్సరాలలో ఆపరేషన్, మెయింటెనెన్స్ కోసం 14,500 కోట్లు ఖర్చు అవుతుందని ఔటర్ కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ ప్రకటించింది. దీని ప్రకారం నిర్వహణ ఖర్చు సగటున 10 సంవత్సరాలలో 4,833.3 కోట్లు. ఆ ఖర్చులు తీసివేసినప్పటికీ మొదటి 10 సంవత్సరాలలోనే లీధి సంస్థకు అసలు వచ్చేస్తుంది. అప్పటికి ట్రాఫిక్ స్థాయి గరిష్ట సామర్థ్యానికి చేరుకుంటుందని భావించి.. ఆ తర్వాత ఆదాయ వృద్ధి ఏటా 7.5 శాతానికి పరిమితం అవుతుందని అనుకున్నా కూడా 30 సంవత్సరాలకు వచ్చే ఆదాయం 1,14, 730 కోట్ల దాకా ఉంటుంది. అంటే 30 ఏళ్ల కాలానికి ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పడిపోవడం, వడ్డీ చెల్లింపులు, ట్రాఫిక్ గరిష్ట స్థాయికి చేరుకోవడం వంటి పరిణామాలను పరిగణనలోకి తీసుకున్నా కూడా ఆదాయం బాగానే ఉండే ప్రాజెక్టు ఇది. ఎలాంటి పోటీ లేని వ్యవహారం ఉన్నది ఒక్కటే ఓఆర్ఆర్. అంటే గుత్తాధిపత్యమే. అలాంటి దాన్ని సొంతంగా నిర్వహించుకోకుండా మూడు దశాబ్దాల పాటు లీజుకు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించడంపై ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎందుకు ఈ గోప్యత

ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదాయ, వ్యయాన్ని అంచనాలు రూపొందించడానికి ట్రాన్స్ యాక్షన్ అడ్వైజర్ గా కేంద్ర ఆర్థిక వ్యవహారాల ఎం ప్యానల్ లోని సంస్థని నియమించారు. బేస్ ప్రైస్ విషయంలో ఆ సంస్థ వేసిన అంచనాలు ఎంత అనేది ఇప్పటివరకు బయట పెట్టలేదు. ఏప్రిల్ ఒకటి నుంచి పెరిగిన టోల్ చార్జీలను బేస్ ప్రైస్ నిర్ధారణలో పరిగణనలోకి తీసుకోలేదు. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్, వచ్చే ఆదాయం తదితరాలు 30ఏళ్ళకు ఎంత పెరుగుతాయని అంశంపై ప్రభుత్వం అధ్యయనాలు కూడా చేయించింది. అయితే ఆ వివరాలు కూడా వెల్లడించడం లేదు. ఇక ఇక్కడ నవ్వొచ్చే విషయం ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డును 30 ఏళ్లపాటు లీజుకు ఇవ్వాలనే నిర్ణయాన్ని గత ఏడాది ఆగస్టు 11న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నట్టు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ చెబుతున్నారు. కానీ ఆ విషయాన్ని ఇప్పటిదాకా అధికారికంగా వెల్లడించలేదు. ఆ తర్వాత రోజు ఏ దినపత్రికలోనూ ఈ విషయం ప్రచురితం కాలేదు. క్యాబినెట్ నిర్ణయాలను ప్రజలకు వెల్లడించాల్సిన ప్రభుత్వం దీనిని మాత్రం ఎందుకు రహస్యంగా ఉంచింది అనే ప్రశ్నకు సమాధానం లేదు. అంతేకాదు బేస్ ప్రైస్ నిర్ణయం, ఔటర్ రింగ్ రోడ్డు లీజు విషయంలో అన్నీ కూడా బహిరంగంగా జరుగుతుండడం విశేషం. మూడు నాలుగు రోజుల క్రితం ఔటర్ రింగ్ రోడ్డు లీజు విషయంలో వివరణ ఇచ్చేందుకు అరవింద్ కుమార్ నిర్వహించిన మీడియా సమావేశానికి ఒక్క వీడియో కెమెరాను కూడా లోపలికి పంపించకపోవడం గమనార్హం.