KCR: పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ దూకుడు పెంచుతుండగా, పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్‌ఎస్ మాత్రం పార్టీ టికెట్‌పై పోటీ చేసే అభ్యర్థుల కోసం వెతుక్కుంటోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఓవర్‌లోడ్ అయిన బీఆర్‌ఎస్‌కు ఇప్పుడు అభ్యర్థులు కరువయ్యారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఒక్కోఅసెంబ్లీ సీటుకు పది మంది పోటీ పడ్డారు. అయినా కేసీఆర్ సిట్టింగులకే ఛాన్స్ ఇచ్చారు. ఇక ఇప్పుడు లోక్‌సభ టికెట్ ఇస్తామన్నా పోటీ చేసేందుకు నేతలు ముఖం చాటేస్తున్నారు.
ఆరూరి విషయంలో..
తాజాగా వరంగల్ ఎంపీ టికెట్ విషయంలో కేసీఆర్ వేసిన స్టెప్పు బూమరాంగ్ అయింది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఇటీవలే బీజేపీలో చేరతానన్న సంకేతాలు ఇస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు వాళ్లతో ఆరూరితో మంతనాలు జరిపారు. అయితే కొంత సైలెంట్ అయిన రమేశ్, రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన హోం మంత్రి అమిత్‌షాను కలవడానికి ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ ఎర్రబెల్లిని రంగంలోకి దింపారు. ఆయన హుటాహుటిన ఆరూరిని కలిసి అమిత్‌షాను కలవకుండా ఆపారు. తర్వాత ఆయనను తీసుకుని నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ కేసీఆర్‌తో మాట్లాడారు.
టికెట్ ఇస్తామన్నా..
ఇక ఆరూరిని బుజ్జగించిన కేసీఆర్ వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. స్వయంగా అధ్యక్షుడు టికెట్ ఇస్తామని ప్రకటించినా ఆరూరి వద్దు అని నిరాకరించి షాక్ ఇచ్చాడు. ఇది బీఆర్‌ఎస్ పరస్థితికి అద్దం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. టికెట్ ఇచ్చినా వద్దుబాబోయ్ అనడం అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతుందంటున్నారు.
కడియం కూతురుకు..
ఇక ఆరూరి టికెట్ నిరాకరించడంతో కేసీఆర్ ప్రత్యామ్నాయం ఆలోచించారు. ఈ క్రమంల కడియ శ్రీహరి తనయ కావ్యను రంగంలోకి దించారు. ఇక్కడ కడియం కూడా కాంగ్రెస్‌లోకి వెళ్తారని ప్రచారం జరిగింది. దీంతో కడియంను అడ్డుకునేందుకు కేసీఆర్ ఆయన తనయకు ఎంపీ టికెట్ ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి దిగజారిందా లేక బీఆర్‌ఎస్ పరిస్థితి దిగజారిందా అన్న చర్చ జరుగుతోంది.