KCR : “దేశం మొత్తం ఆగమయితోంది. ఎన్నో విలువైన వనరులు ఉన్నాయి. వీటిని వినియోగించుకోవడంలోనే అసలు సమస్య ఎదురవుతున్నది. ఆ బిజెపి, కాంగ్రెస్ పార్టీల వల్ల దేశం బాగుపడింది లేదు. అందుకే ఈ దేశానికి గుణాత్మక మార్పు తీసుకురావాలని నేను భావిస్తున్నా. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ముందడుగు వేస్తున్నా” ఇదీ టిఆర్ఎస్ ను కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. అంతేకాదు అప్పట్లో ఆయన ప్రగతి భవన్ వేదికగా ఉత్తర ప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్, ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ వంటి వారితో వరుస భేటీలు జరిపారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వద్దకు వెళ్లారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో పర్యటించారు. గాల్వాన్ లోయలో చనిపోయిన జవాన్ల కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్రం నుంచి చెక్కులు అందించారు. దానిని బీ ఆర్ ఎస్ కార్యక్రమంగా మలచుకున్నారు. సొంత మీడియాలో తృతీయ కూటమి వైపు అడుగులు వేస్తున్నట్టు రాయించుకున్నారు.
ఎవరూ కలిసి రావడం లేదు
బీహార్ వెళ్లి నితీష్ కుమార్ తో అప్పట్లో కేసీఆర్ సమావేశం నిర్వహించినప్పటికీ వర్క్ అవుట్ అవ్వ లేదు .పైగా నితీష్ ఇండియా కూటమికి తెర వెనుక నేతృత్వం వహిస్తున్నారు. అఖిలేష్ యాదవ్ అందులోనే కొనసాగుతున్నారు. ఆ మధ్య ఖమ్మం సభకు తీసుకువచ్చిన కేరళ ముఖ్యమంత్రి విజయన్, వామపక్ష జాతీయ నాయకుడు రాజా వంటి వారు ఇండియా కూటమికే జై కొట్టారు.. చివరికి కుమారస్వామి వంటి వారు కూడా న్యూట్రల్ గా ఉన్నారు. అంతే తప్ప కెసిఆర్ కు జీ హుజూర్ అనడం లేదు.
ఆహ్వానం అందలేదు
దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి బెంగళూరులో సమావేశం ఏర్పాటు చేస్తే భారత రాష్ట్ర సమితికి కనీసం ఆహ్వానం అందలేదు. ఈ కూటమిలో కాంగ్రెస్ బలంగా ఉన్న నేపథ్యంలో భారత రాష్ట్ర సమితికి ఆ అవకాశం ఇవ్వలేదు. మొన్న ఖమ్మంలో జరిగిన సభలో భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీకి బీ టీం గా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. అందువల్లే ఈ కూటమి భేటీకి భారత రాష్ట్ర సమితికి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. పైగా భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన కొన్ని కీలక బిల్లులకు భారత రాష్ట్ర సమితి మద్దతు ప్రకటించింది. లోక్ సభ లో కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఇరకాటంలో పెట్టాలని చేసిన ప్రయత్నాలకు భారత రాష్ట్ర సమితి సహకరించలేదు. ఇవన్నీ పరిణామాలు దృష్టిలో పెట్టుకొనే భారత రాష్ట్ర సమితికి ఆహ్వానం లెక్క లోకి తీసుకోలేదని తెలుస్తోంది. మిగతా పార్టీల నాయకులు కూడా కెసిఆర్ నాయకత్వంపై అంత ఆశావాహ దృక్పథంతో లేరు. ముఖ్యంగా నితీష్ కుమార్ కెసిఆర్ తీరు పట్ల విముఖత ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది.
గాలికి కొట్టుకుపోయిన పేల పిండి
ఇక విపక్షాల భేటీ నేపథ్యంలో కెసిఆర్ మూడవ ఫ్రంట్ గాలికి కొట్టుకుపోయిన పేలపిండి అయిపోయింది.. అటు ఆర్థిక సహాయం చేసిన కుమారస్వామి కెసిఆర్ మూడవ ఫ్రంటును దేకడం లేదు. చెక్కులు ఇచ్చిన నితీష్ కుమార్ దూరం పెట్టాడు. అరవింద్ కేజ్రివాల్, భగవంత్ సింగ్ మాన్ ఇండియాలోనే మేముంటామని సంకేతాలు ఇచ్చారు.. ఫలితంగా కెసిఆర్ పరిస్థితి “నాకెవరూ లేరు నాతో ఎవరూ రారు” అనే పాటతీరుగా అయిపోయింది.