KCR: కేసీఆర్ ఫైర్.. ముచ్చటగా మూడోసారి!

మొన్నటికి మొన్న కరీంనగర్ సభలోనూ కెసిఆర్ ఇదే విధంగా విమర్శలు చేశారు. ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని శాపనార్ధాలు పెట్టారు. ఇదే అదునుగా రేవంత్ గేట్లు తెరిచారు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 1, 2024 8:17 am

KCR

Follow us on

KCR: “అధికారాంతమున చూడాలి అయ్యవారి చిత్రాలు” ఈ సామెతను భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నిజం చేసి చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు 2014, 2018 సంవత్సరాలలో ప్రతిపక్షాలను ఏ విధంగా తన పార్టీలో చేర్చుకున్నది, ఏ విధంగా వ్యవస్థలతో ఆడుకున్నది, ఏ విధంగా ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేసింది.. పూర్తిగా మర్చిపోయారు. తన పాలన మొత్తం ప్రజాస్వామ్య విధంగా జరిగినట్టు.. తెలంగాణలో అన్ని రకాల వ్యవస్థలు సక్రమంగా పనిచేసినట్టు.. అసలు నిమిషం కూడా కరెంటు పోనట్టు మాట్లాడుతున్నారు. విద్యుత్ శాఖ పనితీరుపై ప్రస్తుత ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేస్తే ఎన్నో లోపాలు కనిపించాయి. మరెన్నో అవకతవకలు వెలుగు చూశాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతే.. సాగునీటి రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయలేదు గాని.. ఒకవేళ విడుదల చేసి ఉంటే ఎలాంటి సంచలన విషయాలు వెలుగు చూసేవో..” ఇవీ ఆదివారం కేసీఆర్ దేవరుప్పుల, సూర్యాపేట పర్యటన అనంతరం సోషల్ మీడియాలో కనిపించిన విమర్శలు. ఈ విమర్శలకు యాదృచ్ఛికంగా భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం నుంచి ఎటువంటి కౌంటర్ లేదు.

సరే ఇక అసలు విషయానికి వస్తే.. కెసిఆర్ పేరుకు రైతుల పరామర్శ అని చెప్పారు కానీ.. అసలు ఉద్దేశం పార్లమెంట్ ఎన్నికలు.. వరుస పెట్టి వలస వెళ్లిపోతున్న నాయకులు.. ఇలాంటి సమయంలో శ్రేణుల్లో ఎంతో కొంత ధైర్యం నింపాలి. పార్టీని కాపాడుకోవాలి.. గుడ్.. కెసిఆర్ నిర్ణయం సరైనదే.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలే అయింది. అంతకుముందు పదేళ్లపాటు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వమే పరిపాలించింది. ఆ పరిపాలనకు సంబంధించిన నగిషీ లు అలానే కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు కెసిఆర్ బయటికి వచ్చి ఏం ప్రయోజనం? నల్లగొండ సభ ద్వారా కెసిఆర్ తొలిసారిగా బయటికి వచ్చారు. రేవంత్ మీద నిప్పులు చెరిగారు. తర్వాత ఏమైంది కీలకమైన నాయకులు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. కెసిఆర్ తో ఆ సభకు హాజరైన దానం నాగేందర్ వంటి వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చివరికి కేశవరావు వంటి నమ్మిన బంటు కూడా కేసీఆర్ తో ఉండలేక వెళ్లిపోయారు. మరి దీనిని కేసీఆర్ ఏ విధంగా సమర్ధించుకుంటారు? రాజకీయ నేతలు అటు వాళ్లు ఇటు, ఇటు వాళ్ళు అటు వెళ్తుంటారు.. కానీ సుదీర్ఘకాలం పార్టీలో అన్ని పదవులు అనుభవించిన వారు కూడా వెళ్తుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..

మొన్నటికి మొన్న కరీంనగర్ సభలోనూ కెసిఆర్ ఇదే విధంగా విమర్శలు చేశారు. ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని శాపనార్ధాలు పెట్టారు. ఇదే అదునుగా రేవంత్ గేట్లు తెరిచారు. ఇంకేముంది భారత రాష్ట్ర సమితి నాయకులు దొరికిందిరా అవకాశం అనుకుంటూ కండువాలు కప్పేసుకుంటున్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య.. పోటీ చేయబోనని చెప్పడమే కాదు.. ఏకంగా లేఖ కూడా రాసింది. తన తండ్రితో కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంది.

ఆదివారం దేవరప్పుల, సూర్యాపేట ప్రాంతాల్లో కెసిఆర్ పర్యటించారు. తన పరిపాలన కాలంలో వరి వేస్తే ఉరి అని చెప్పిన ఆయనే.. ఎండిపోయిన వరి పొలంలో రైతులతో మాట్లాడారు.. గత ఏడాది ఇదే సమయానికి ఈదురు గాలుల వల్ల పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించిన కేసీఆర్.. ఆ తర్వాత పరిహారాన్ని విడుదల చేయడంలో తీవ్రమైన జాప్యం చేశారు. కొందరి రైతులకైతే వంద రూపాయల పరిహారం మంజూరయింది. కొన్నిచోట్ల అది కూడా కాలేదు. అయితే ఆ విషయాన్ని మర్చిపోయిన కెసిఆర్.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం నిజంగా డిబేటబుల్ క్వశ్చన్. ప్రస్తుత ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకంలో చేరింది. గత ప్రభుత్వం ఆ పని చేసిందా? పోనీ ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు రైతులకు భరోసా ఇచ్చేలాగా ఏదైనా పథకానికి శ్రీకారం చుట్టిందా? పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చిందా? ఇలాంటి విషయాలు మర్చిపోయి.. వంద రోజుల క్రితం ఏర్పడిన ప్రభుత్వం మీద కేసీఆర్ విమర్శలు చేయడం గమనార్హం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడుసార్లు కేసీఆర్ విలేకరుల ఎదుట మాట్లాడారు. అన్నిసార్లు తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రతి సందర్భంలోనూ గుర్తుకొచ్చేది ఒకటే.. అధికారాంతమున చూడాలి అయ్యవారి చిత్రాలు అనే సామెత.