https://oktelugu.com/

AP Volunteers: వైసీపీ రాజీనామా మంత్రం పనిచేస్తుందా?

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే 2019 అక్టోబర్ 2న వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రారంభించారు. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు 15, 004 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఇవి మాత్రమే కాకుండా రాష్ట్రంలో 16 కార్పొరేషన్లు, 77 పురపాలకాలు, 32 నగర పంచాయతీలు ఉన్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 1, 2024 / 08:22 AM IST

    AP Volunteers

    Follow us on

    AP Volunteers: ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. అక్కడి రాజకీయాలు వేడివేడిగా మారిపోయాయి. అధికార పక్షం మీద ప్రతిపక్షం, ప్రతిపక్షం మీద అధికార పక్షం విమర్శలు చేసుకుంటూనే ఉన్నాయి. పోటాపోటీగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాయి. ఇలా ఇటీవల తెలుగుదేశం కూటమి చేసిన ఫిర్యాదు వల్ల ఎన్నికల సంఘం వాలంటీర్లపై చర్యలు తీసుకుంది. ఎన్నికలన్ని రోజులు వారు ఎటువంటి పింఛన్లు, ఇతరత్రాలు పంపిణీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో వీరిని దూరంగా ఉంచాలనే నిర్ణయం దాకా ఎన్నికల సంఘం వెళ్ళింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ప్రభుత్వం వారికి ఇచ్చిన ఫోన్ లు, ట్యాబ్ లను కూడా తిరిగి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడంతో వైసిపి నాయకులు సరికొత్త ఆలోచన చేశారు. వలంటీర్లను ఎన్నికల కోసం ఉపయోగించుకోవడంలో అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు వారితో రాజీనామా చేయిస్తున్నారు. కొన్నిచోట్ల ఒత్తిళ్లకు తట్టుకోలేక వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. విధంగా రాజీనామాల వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది.

    జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే 2019 అక్టోబర్ 2న వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రారంభించారు. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు 15, 004 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఇవి మాత్రమే కాకుండా రాష్ట్రంలో 16 కార్పొరేషన్లు, 77 పురపాలకాలు, 32 నగర పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రజల ముంగిటికే పరిపాలనను జగన్ తీసుకొచ్చారు. అన్ని విభాగాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 1,26,649 మంది నిరుద్యోగులకు వాలంటీర్ల ఉద్యోగం కల్పించారు. రాష్ట్రంలోని 3.2 కోట్ల మందికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు.. 50 ఇళ్లకు ఒకరిని కేటాయిస్తూ ఐదువేల గౌరవ వేతనంతో పని చేసేందుకు వలంటీర్లను నియమించారు. జగన్ తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థతో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. అయితే అక్కడక్కడ కొందరు వాలంటీర్లు చేతివాటం లేదా ఇతర అనైతిక పనులకు పాల్పడటం వల్ల ఈ వ్యవస్థ సరైంది కాదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇచ్చుకుంటూ.. వారితో పార్టీ కార్యక్రమాలు చేయిస్తున్నారని ఆమధ్య చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అంతేకాదు అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగించం. వారిని పార్టీ అనుకూల పనులకు ఉపయోగించం. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి నెలకు 50,000 సంపాదించుకునే రీతిలో తీర్చి దిద్దుతామని” చంద్రబాబు అప్పట్లో ప్రకటించారు.

    ఎన్నికల సంఘం ఆంక్షలతో వైసిపి నాయకులు వలంటీర్లతో రాజీనామా చేయిస్తున్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని.. ఆ భరోసాతోనే వలంటీర్లతో రాజీనామాలు చేయిస్తున్నట్టు తెలుస్తోంది. వారిని వార్డు ఏజెంట్లుగా ఉపయోగించుకుంటారని ప్రచారం జరుగుతున్నది. కొన్నిచోట్ల వలంటీర్లు రాజీనామా చేసేందుకు వెనుకాడితే.. బలవంతంగా వారితో ఆ పని చేయిస్తున్నారు. వాస్తవానికి ఒక్కసారి రాజీనామా చేస్తే మరోసారి వలంటీర్ అయ్యేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ ప్రభుత్వం మారితే అంతే సంగతులు. వైసీపీ కోసం పనిచేసిన వారిని టిడిపి ప్రభుత్వం పట్టించుకునే అవకాశం ఉండదు. అంతేకాదు చేసిన తప్పులకు కేసులు నమోదు చేస్తుంది. పాపం వలంటీర్లు… ఎన్నికల ముందు వారికెన్ని కష్టాలు..