HomeతెలంగాణKCR : మౌనంగా ఉన్నా.. నేను కొడితే మామూలుగా ఉండదు.. కేసీఆర్ సంచలన కామెంట్స్

KCR : మౌనంగా ఉన్నా.. నేను కొడితే మామూలుగా ఉండదు.. కేసీఆర్ సంచలన కామెంట్స్

KCR : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత కొంతకాలంగా మౌనం పాటిస్తున్నానని, అయితే ఇక మౌనంగా ఉండేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ శక్తి ఏంటో త్వరలోనే కాంగ్రెస్ నేతలకు తెలిసేలా చేస్తామని హెచ్చరించారు. “ఇన్ని రోజులుగా నేను మోనంగా, గంభీరంగా చూస్తున్నా.. నేను కొడితే మాములుగా ఉండదు. ప్రజలు కాంగ్రెస్ పాలనలో సంతోషంగా లేరు. వీళ్ల పాలన చూసి ప్రజలు నిరాశకు గురయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేట్టుగా ఉన్నారు” అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

పోలింగ్‌లో మా ఓటింగ్ ఎక్కువ – కేసీఆర్
నిన్న కాంగ్రెస్ వాళ్లు పోలింగ్ పెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. “కాంగ్రెస్ వాళ్లు ఎంత ప్రయత్నించినా ప్రజలు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు. ఓటింగ్ పెరిగిన కొద్దీ మాకు అనుకూలంగా మారింది. కానీ కొంత మంది అత్యాశకు పోయి కాంగ్రెస్‌కి ఓటేశారని ఇప్పుడు అర్థమవుతోంది” అని వ్యాఖ్యానించారు. రైతు బంధు, దళిత బంధు వంటి పథకాలను కాంగ్రెస్ పక్కన పెట్టిందని ఆరోపించారు. “రైతు బంధుకి రాంరాం, దళిత బంధుకి జైభీం చెప్పే రోజులు వస్తాయి అని ఆనాడే చెప్పాను” అని కేసీఆర్ విమర్శించారు.

ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధంగా ఉండాలి
తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసం తాను ప్రత్యక్ష పోరాటాలకు సిద్దమవుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. “తెలంగాణ భూముల ధరలు అమాంతం పడిపోయాయి. ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల పనులు ఏడాది కాలంగా  నిలిచిపోయాయి. ఇది తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగించేది. తెలంగాణ ఇక ఇతరుల చేతుల్లో చిక్కకుండా రక్షించాల్సిన బాధ్యత మనదే” అని పిలుపునిచ్చారు.

ఫామ్ హౌస్ విమర్శలపై స్పందన
తనపై వస్తున్న ఫామ్ హౌస్ ఆరోపణలపై కేసీఆర్ స్పందించారు. “ఫామ్ హౌస్‌లో పంటలు తప్ప ఇంకేముంటాయి? నేను మాట్లాడితే ఫామ్ హౌస్ అంటూ బద్నాం చేస్తున్నారు. ప్రజలకు ఏది మంచిది… ఏది చెడు స్పష్టంగా తెలుస్తోంది. త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయి” అని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సన్నాహం
కేసీఆర్ త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. “తెలంగాణ ప్రజల గుండెల్లో ఇప్పటికీ బీఆర్ఎస్ బ్రాండ్ నేమ్ మారలేదు. త్వరలోనే మళ్లీ గట్టిగా లేచే సమయం వచ్చింది. మా పోరాటం మళ్లీ ప్రారంభమవుతోంది” అని చెప్పారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాలు వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు, ప్రజల ఆగ్రహం, కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తితో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మరో మలుపు తిరిగే అవకాశముంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular