Seethamma Vakitlo Sirimalle Chettu : టాలీవుడ్ లో మళ్ళీ రీ రిలీజ్ ట్రెండ్ పునః ప్రారంభం అవ్వబోతుంది. గత ఏడాది ఈ ట్రెండ్ మురారి, ఇంద్ర, గబ్బర్ సింగ్ సినిమాలతో తారా స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి నెల నుండి వరుసగా పాన్ ఇండియన్ సినిమాలు విడుదల ఉండడంతో ఫిబ్రవరి నెలలో కొన్ని ఆల్ టైం క్లాసిక్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ ‘ఆరెంజ్’, మహేష్ బాబు ‘అతిథి’ చిత్రాలు ఫిబ్రవరి 14న విడుదల కాబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసారు. ఇదే ఫిబ్రవరి నెలలో సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కెరీర్స్ లో ఆల్ టైం కల్ట్ క్లాసిక్ గా నిల్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం కూడా విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయబోతున్నాడు ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు.
ఈ ఏడాది సంక్రాంతికి ‘గేమ్ చేంజర్’,’సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలను ఆయన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ రెండు చిత్రాల ఫలితాలు ఏమిటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘గేమ్ చేంజర్’ లో పోగొట్టుకున్న డబ్బులు మొత్తం ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో తిరిగి వచ్చేసాయి. ఇప్పుడు ఆయన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాన్ని కూడా గ్రాండ్ గా విడుదల చేసి భారీ వసూళ్లను తన ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నాడు. 2013 వ సంవత్సరం, సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఒక సెన్సేషన్. ఈ చిత్రానికి పోటీగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నాయక్ చిత్రం వచ్చింది. ఈ సినిమా కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో నాయక్ చిత్రానికి అత్యధిక ఓపెనింగ్స్, ఫుల్ రన్ వసూళ్లు వస్తే, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఓవర్సీస్ మరియు ఇతర ప్రాంతాల్లో పై చేయి సాధించింది.
కుటుంబ సంబంధాలను ఎంతో అందంగా వెండితెర మీద చూపించిన ఈ సినిమాకి కాలక్రమేణా కల్ట్ క్లాసిక్ స్టేటస్ దక్కింది. మహేష్ బాబు, వెంకటేష్ ఈ చిత్రంలో నటించలేదు, జీవించారు. వీళ్ళ కుటుంబాన్ని వెండితెర పై చూస్తున్నంతసేపు మన కుటుంబం గుర్తుకొస్తుంది. అలాగే అంత పెద్ద కుటుంబం లేని వారికి, మనకి కూడా ఇలాంటి ఉమ్మడి కుటుంబం ఉండుంటే ఎంత బాగుండేది అనే అసూయ కూడా కలుగుతుంది. అంత అందంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. టీవీ టెలికాస్ట్ లో కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం రీ రిలీజ్ లో కచ్చితంగా ‘మురారి’ రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంటుంది బలమైన నమ్మకంతో చెపుతున్నారు అభిమానులు. ఈ రీ రిలీజ్ కి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారట. ఈ ఈవెంట్ కి మహేష్ బాబు వస్తాడో లేదో తెలియదు కానీ, విక్టరీ వెంకటేష్ మాత్రం కచ్చితంగా వస్తున్నట్టు సమాచారం.