Kavitha vs KTR press meet: గడచిన దశాబ్దంగా తెలంగాణ రాజకీయాలలో భారత రాష్ట్ర సమితికి విశిష్టమైన స్థానం ఉంది. 10 సంవత్సరాలుగా ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. వాస్తవానికి హ్యాట్రిక్ సాధిస్తామని.. మూడోసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని కేసీఆర్ నుంచి మొదలుపెడితే హరీష్ రావు వరకు అందరు గొప్ప గొప్ప ప్రకటనలు చేశారు. కానీ వాస్తవ రూపంలో అందుకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి. దీంతో రెండు పర్యాయాలు అధికారాన్ని దక్కించుకున్న గులాబీ పార్టీ ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది.
ప్రతిపక్ష పార్టీ అధికారం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంది. ప్రజా ఉద్యమాలను నిర్మిస్తుంది. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొస్తుంది. ప్రభుత్వం చేయలేని పనులను ప్రశ్నిస్తుంది. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తుంది. అయితే ప్రతిపక్షంగా భారత రాష్ట్ర సమితి ఇవన్నీ చేస్తున్నప్పటికీ.. ఆ పార్టీలో కీలకమైన శక్తులుగా ఉన్న కల్వకుంట్ల తారకరామారావు, కల్వకుంట్ల కవిత ఎవరిదారి వారు చూసుకుంటున్నట్టు కనిపిస్తోంది. కల్వకుంట్ల తారక రామారావు గులాబీ పార్టీకి కార్య నిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కల్వకుంట్ల కవిత ఆ పార్టీకి శాసనమండలి సభ్యురాలిగా ఉన్నారు. ఇటీవల కాలంలో అన్నా చెల్లి మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. ముఖ్యంగా వీరిద్దరూ ఎవరికి వారుగా కార్యక్రమాలు చేపట్టడం.. రాజకీయాలు చేస్తూ ఉండడం శ్రేణులకు నచ్చడం లేదు. ఒకే గొడుగు కింద ఉన్నప్పటికీ ఎవరికి వారే అన్నట్టుగా కేటీఆర్, కవిత వ్యవహరిస్తుండడంతో పార్టీలో విభేదాలకు కారణమవుతుందని తెలుస్తోంది.
Also Read: బీఆర్‌ఎస్ పరువు తీస్తున్న ఆర్‌ఎస్.ప్రవీణ్.. నువ్వు ఐపీఎస్ ఎలా అయ్యావు!
ఇటీవల కాలంలో కేటీఆర్, కవిత వేరువేరుగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు. తన తండ్రిని కాలేశ్వరం కమిషన్ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ కవిత జాగృతి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు కేటీఆర్ కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వచ్చారు. ముఖ్యమంత్రితో చర్చకు సిద్ధమని ప్రకటించారు.. సరిగ్గా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన సమయంలో ఆయన ప్రెస్ క్లబ్ రావడం విశేషం.. అయితే ఈ రెండు కార్యక్రమాలు కూడా ఎవరికి వారుగా చేసుకున్నారు. చూడబోతే మీకు మీరే.. మాకు మేమే అన్నట్టుగా కేటీఆర్, కవిత వ్యవహార శైలి ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కవిత ఇటీవల రైల్ రోకో ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ ఉద్యమానికి గులాబీ పార్టీలోని కేటీఆర్ వర్గం దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. కెసిఆర్ పక్షంగా ఉన్న నాయకులు కూడా అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా రైల్ రోకో ఉద్యమాన్ని మొత్తం కవితనే ముందుండి నిర్వహిస్తున్నారు. ఇలా వారిద్దరు ఎవరికి వారిగా ఉండిపోవడం కార్యకర్తలకు మిగుడు పడటం లేదు. ఇక కేటీఆర్ వైపు హరీష్ రావు చేరిపోయారు. మాజీ మంత్రులు కూడా ఆయన వైపే ఉన్నారు. కీలకమైన నాయకులు లేకపోయినప్పటికీ కవిత ఉద్యమాలు సాగిస్తున్నారు.. ఇలా ఎవరికి వారుగా బల నిరూపణ చేపట్టే కార్యక్రమాలు నిర్వహిస్తే అంతిమంగా పార్టీలో ఉన్న లుకలుకలు బయటపడతాయని.. ఎన్నికల సమయం వరకు అవన్నీ ఆగాధం లాగా మారిపోతాయని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.