Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ మరొకసారి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చింది. గతంలో రెండు మార్లు విచారించిన ఈడీ.. కవిత సుప్రీంకోర్టుకు వెళ్లడంతో తదుపరి చర్యలు తీసుకోకుండా సైలెంట్ అయిపోయింది. తెలంగాణ ఎన్నికల సమయంలో కవితను మళ్ళీ పిలుస్తారని అందరూ అనుకున్నారు. అయితే కవిత చాలా తెలివిగా సుప్రీంకోర్టు మెట్లు తట్టింది. ఒక మహిళను రాత్రిపూట విచారించాల్సిన అవసరం ఏముందని తన ఫిర్యాదులో పేర్కొంది. కవిత ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు తాము తదుపరి ఆదేశాలు జారీ చేసేంతవరకు కవితను ఎట్టి పరిస్థితిలో విచారించకూడదని వీడికి ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం కొంత గడువు కూడా విధించింది. ఆ గడువు ప్రస్తుతం తీరిపోవడం.. అక్రమాలకు సంబంధించిన విషయంలో జాప్యం చేయకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈడీ లిక్కర్ కేసును మళ్లీ తవ్వడం ప్రారంభించింది.
అయితే ఈసారి ఈడీ మళ్లీ కవితకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని మద్యం షాపుల కేటాయింపునకు సంబంధించి జరిగిన అక్రమాలపై విచారించాలని ఆ నోటీసులో పేర్కొంది. ఈ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవిత తాను విచారణకు హాజరు కాలేనని.. తాను ముందస్తుగా అనుకున్న కార్యక్రమాలు చాలా ఉన్నాయని.. పైగా తాను వేసిన కేసుకు సంబంధించిన విచారణ సుప్రీంకోర్టులో కొనసాగుతోందని.. ఆ కేసు కు సంబంధించి సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువరించేంతవరకు తాను విచారణకు హాజరు కాలేనని కవిత ఈ డి అధికారులకు మెయిల్ ద్వారా వర్తమానం పంపారు. దీంతో ఒకసారిగా జాతీయ రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఇప్పటికే లిక్కర్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కవితకు గతంలో ఆడిటర్ గా పనిచేసిన బుచ్చిబాబు, వ్యక్తిగత కార్యదర్శి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు కుమారుడు.. వీరంతా కూడా జైలు శిక్ష అనుభవించారు. కొంతమంది అప్రూవర్లు మారడంతో బయటికి వచ్చారు. అయితే ఈ కేసులో ఇంతవరకు కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే ఎటువంటి జైలు శిక్ష అనుభవించలేదు.
ఈడి అధికారులకు తాను విచారణకు హాజరు కాలేనని కవిత చెప్పడం ద్వారా తిరుగుబాటు సంకేతాలు ప్రదర్శిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె నిజామాబాద్ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారని.. ఈడి అధికారులకు విచారణకు హాజరు కాలేనని మొహమాటం లేకుండా సమాధానం ఇస్తే.. తదుపరి పరిణామాల అనంతరం ఒకవేళ ఆమె అరెస్టుకు గురైతే.. పార్లమెంట్ ఎన్నికల్లో అది ఆమెకు సానుభూతిగా పనిచేస్తుందని.. అందువల్లే కవిత ఈడి అధికారుల పై తిరుగుబాటు స్వరాన్ని ఎంచుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే కవిత గతంలో విచారణకు హాజరేటప్పుడు తాను వాడిన ఐఫోన్లను చూపించారని.. కొంతమంది న్యాయ నిపుణుల సలహాల మేరకు నడుచుకున్నారని.. ఈడి విచారణ నుంచి ఆమెకు ఊరట లభించిందని.. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆమె పెద్దగా ఇబ్బంది పడలేదని.. ఇప్పుడు సానుకూల వాతావరణం లేని నేపథ్యంలో కవిత తిరుగుబాటు స్వరాన్ని వినిపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అప్పట్లో ఆమె కేసు విచారిస్తున్న ఈ డి అధికారుల్లో ఒకరు లంచం తీసుకున్నారని ఆరోపణలు రావడంతో కొంతకాలం పాటు ఢిల్లీ లిక్కర్ కేసు కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళింది. ఆ తర్వాత ఎన్నికలు రావడం.. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ డి కొంతకాలం వెనకడుగు వేసింది. ఇప్పుడు మళ్లీ లిక్కర్ స్కాం ను తవ్వడం మొదలుపెట్టింది. మరి ఇప్పుడు కవిత భావిస్తున్నట్టుగా ఈడి అరెస్టు చేస్తుందా.. లేక విచారణ పేరుతో కాలయాపన చేస్తుందా.. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేంతవరకు దానిని సాకుగా చూపుతోందా అనేవి తేలాల్సి ఉంది.