HomeతెలంగాణKavitha Sensational Comments: కేసీఆర్ కాదు.. కాలేశ్వరం అసలు సూత్రధారులు వాళ్ళు ముగ్గురే.. బాంబు పేల్చిన...

Kavitha Sensational Comments: కేసీఆర్ కాదు.. కాలేశ్వరం అసలు సూత్రధారులు వాళ్ళు ముగ్గురే.. బాంబు పేల్చిన కవిత!

Kavitha Sensational Comments: కాలేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆదివారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మేడిగడ్డ ప్రాంతంలో నిర్మించిన బ్యారేజ్ కుంగుబాటు.. ఇతర పరిణామాలకు కారణం కేసీఆర్ అని.. శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సుదీర్ఘ సమయం ఆయన ప్రసంగించి కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో చోటుచేసుకున్న తప్పులను వెల్లడించారు..ఘోష్ కమిషన్ నివేదించిన అంశాలను సభ ముందు ప్రకటించారు. కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో చోటు చేసుకున్న తప్పులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర దర్యాప్తు బృందానికి ముఖ్యమంత్రి ప్రతిపాదించిన నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది.

ముఖ్యమంత్రి ప్రసంగంపై.. కేంద్ర దర్యాప్తు బృందానికి ఈ కేసును ఇవ్వడం పట్ల భారత రాష్ట్ర సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర దర్యాప్తు బృందానికి ఈ కేసును ఇవ్వడం పట్ల మండిపడింది. మరోవైపు బిజెపి నుంచి ఈటెల రాజేందర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ శైలిని తప్పు పట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థకు ఏ కేసును ఇస్తే పెద్దగా అయ్యేది ఉండదని.. కెసిఆర్ కు ఏమీ కాదని పేర్కొన్నారు. ఇది ఇలా సాగుతుండగానే మధ్యలోకి భారత రాష్ట్ర సమితి శాసనమండలి సభ్యురాలు జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రవేశించారు. కొద్దిరోజులుగా అమెరికాలో ఉన్న ఆమె సోమవారం స్వదేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత కొంతమేర విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత తన జాగృతి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు..

కవిత తన తండ్రి కెసిఆర్ ను వెనకేసుకొచ్చారు. మరో 200 సంవత్సరాలైనా సరే కాలేశ్వరం అలాగే ఉంటుందని.. కాలేశ్వరం గురించి.. దానిని నిర్మించిన కేసీఆర్ గురించి చెప్పుకుంటారని కవిత పేర్కొన్నారు. కాలేశ్వరం నిర్మాణంలో నెలలపాటు కేసీఆర్ శ్రమించారని.. తన కార్యాలయంలో భారీ కంప్యూటర్ ఏర్పాటు చేసుకొని నిత్యం దాని గురించి శోధించేవారని కవిత అన్నారు. తెలంగాణ గడ్డకు నీరు ఎక్కడి నుంచి తీసుకురావాలి.. తెలంగాణ పంట పొలాలకు నీరు ఎలా అందించాలనే దాని గురించి చర్చించే వారిని కవిత అన్నారు. కొంతమంది చేసిన పని వల్ల కెసిఆర్ కు చిక్కులు వచ్చి పడ్డాయని జాగృతి వ్యవస్థాపకురాలు పేర్కొన్నారు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్ వల్ల తన తండ్రికి మరక ఏర్పడిందని.. వీరు తమ సొంత ఆస్తులను పెంచుకోవడానికి చేసిన పని వల్ల కెసిఆర్ మాటలు పడుతున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఒకానొక సందర్భంలో తన తండ్రి గురించి చెబుతూ కవిత భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి తెలంగాణ గురించి మాత్రమే తపిస్తారని.. ఆయనకు తెలంగాణ సోయి తప్ప మరొకటి ఉండదని కవిత పేర్కొన్నారు. అనవసరంగా ఆయనపై రేవంత్ విమర్శలు చేస్తున్నారని కవిత పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బీసీలను స్థానిక ఎన్నికల్లో మోసం చేస్తే కచ్చితంగా బీహార్ వెళ్లి కాంగ్రెస్ అసలు స్వరూపాన్ని బయటపెడతామని కవిత పేర్కొన్నారు. ఇక్కడ రిజర్వేషన్లు ఇవ్వకున్నా సరే.. బీహార్లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేతచెప్పిస్తారని కవిత ఎద్దేవా చేశారు. ఎన్ని కేసులు పెట్టుకున్న ఏం కాదని.. కెసిఆర్ కడిగిన ముత్యం లాగా బయటికి వస్తారని కవిత ధీమా వ్యక్తం చేశారు. ఇన్ని రోజులపాటు నర్మగర్భంగా మాట్లాడిన జాగృతి అధినేత్రి ఒక్కసారిగా హరీష్ పేరు, సంతోష్ రావు పేరు, మెగా కృష్ణారెడ్డి పేరు తెరపైకి తీసుకురావడం పట్ల తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా సంచలనం నమోదయింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version