MLC Kavitha: రాజకీయాలలో ఉన్న వారు ఎవరైనా సరే ఎదుగుదల కోరుకుంటారు. ఉన్నత స్థానాల్లో ఉండాలని భావిస్తుంటారు.. దానికి ఎవరూ మినహాయింపు కాదు. సహజంగా మనిషి లక్షణమే అలా ఉంటుంది. ఎదగాలని ఆరాటపడుతూ ఉంటుంది.. ఈ జాబితాలో ఇప్పుడు పార్లమెంట్ మాజీ సభ్యురాలు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు. తన రాజకీయ ఎదుగుదలకు సంబంధించి ఆమె ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ లో మాట్లాడారు.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: వందలో 8 మందికి కిడ్నీ సమస్యలు.. ఆ సింగరేణి ప్రాంతానికి ఏమైంది?
MLC Kavitha మద్యం కుంభకోణంలో అరెస్టయి.. కొద్ది నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత కల్వకుంట్ల కవిత విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆమె రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గత పది సంవత్సరాలుగా జాగృతిని అంతగా పట్టించుకోని ఆమె.. ఇప్పుడు దానిని చైతన్యవంతం చేసే పనిలో పడ్డారు.. తెలంగాణలోని అన్ని జిల్లాలకు కార్యవర్గాలను నియమించారు. అంతేకాకుండా జాగృతి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇటీవల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాలేశ్వరం కమిషన్ విచారణకు పిలవడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాదులో నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జాగృతి నాయకులు భారీగా పాల్గొన్నారు. ఇక ఇటీవల జాగృతి ఆధ్వర్యంలో కవులకు సన్మానం కూడా చేశారు.
ఇక ఆ మధ్య కవిత పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. కొంతమంది నాయకులను ఉద్దేశించి ఆమె దయ్యాలు అని కూడా వ్యాఖ్యానించారు. తెలంగాణ రాజకీయాలలో ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత తన తండ్రి చుట్టూ చేరి ఇబ్బందులు పెడుతున్నారని కూడా గులాబీ పార్టీ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు. పార్టీలో పరిస్థితి పై రాసిన లేఖలు బయటికి రావడాన్ని ఆమె తప్పు పట్టారు. అప్పుడు కూడా తెలంగాణలో మీడియా ఆమె కేంద్రంగా వార్తలను ప్రసారం చేసింది.
పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్న కవిత తాజాగా ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రయాణానికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారా అని వ్యాఖ్యాత ప్రశ్నించినప్పుడు కవిత ఆసక్తికర సమాధానం చెప్పారు.”మరో 10 సంవత్సరాలకు లేదా 15 సంవత్సరాలకు ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి అవుతాను. ఎవరైనా సరే రాజకీయాలలో వ్యక్తిగతంగా ఎదగాలని కోరుకుంటారని” కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు..” భారత రాష్ట్ర సమితి హయాంలో నేను ప్రాతినిధ్యం వహించే నిజామాబాద్ నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఇవ్వమని అడిగితే మా నాన్న ఇవ్వలేదు. అప్పుడు ఫండ్స్ ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కాలేదు. కానీ ఈసారి భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే నా నియోజకవర్గాన్ని కచ్చితంగా అభివృద్ధి చేస్తానని” కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. కేటీఆర్ ను భావి తెలంగాణ ముఖ్యమంత్రిగా భావిస్తున్న నేపథ్యంలో.. అనూహ్యంగా కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ఇప్పటికే భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడితో గ్యాప్ ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రకరకాల చర్చలకు ఊతమిస్తున్నాయి.