Kavitha Political Statements: భారత రాష్ట్ర సమితికి ఆ పార్టీ శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత దూరంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో కల్వకుంట్ల కవిత భారత రాష్ట్ర సమితిలోని కొంతమంది నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా లేఖలు లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని ఆమె నేరుగా కోరారు. అధిష్టానం చర్యలు తీసుకునేంతవరకు తాను పార్టీకి దూరంగా ఉంటానని ఓపెన్ గానే చెప్పేశారు. 2023 శాసనసభ ఎన్నికలు, 2024 పార్లమెంటు ఎన్నికలలో ఎదురైన ఓటమితో పోల్చి చూస్తే.. కల్వకుంట్ల కవిత చేస్తున్న వ్యాఖ్యలే ఆ పార్టీకి ఎక్కువ నష్టం చేకూర్చుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. కవిత ఈ స్థాయిలో రెచ్చిపోతున్నప్పటికీ.. తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నప్పటికీ గులాబీ బాస్ సైలెంట్ గా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Also Read: Revanth Reddy: ఆ ఒక్క మాటతో సంఘ్ పరివార్ ను షేక్ చేసిన రేవంత్ రెడ్డి
ఇటీవల కల్వకుంట్ల కవిత పై ఓ ఇంటర్వ్యూలో భారత రాష్ట్ర సమితికి చెందిన ఓ నాయకుడు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాష్ట్ర సమితి అధినాయకత్వం కవిత విషయంలో నిశ్శబ్దంగా ఉంటున్నది. కానీ ఆ నాయకుడు మాత్రం ఒక్కసారిగా బ్లో అవుట్ అయ్యారు. ఇది సహజంగానే భారత రాష్ట్ర సమితి నాయకత్వానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ తర్వాత మరొక నాయకుడు కూడా కల్వకుంట్ల కవితపై విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారాలు మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా ఏకపక్షంగా సాగిపోతున్న నేపథ్యంలో.. కవిత ఒక్కసారిగా రెస్పాండ్ అయ్యారు. మరో మాటకు తావు లేకుండా ఆమె ఆదివారం విలేకరుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనపై విమర్శలు చేస్తున్న ఓ నాయకుడిని లిల్లీపుట్ అని సంబోధించారు. అంతేకాదు నల్గొండ జిల్లాలో చావుతప్పి కన్ను లొట్టబోయినట్టు గెలిచారని.. నల్గొండ జిల్లాలో పార్టీని సర్వనాశనం చేశారని.. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని ఆ వ్యక్తి తనను విమర్శించడం సరికాదని కవిత వ్యాఖ్యానించారు. ఆడబిడ్డనని తనను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోనని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుందని.. దేవుడు ఎప్పుడు ఎవరికీ ఏది చేయాలో అది చేస్తాడని కవిత పేర్కొన్నారు. లిల్లీపుట్ వ్యాఖ్యల తో పాటు.. మరో నాయకుడిని చిన్న పిల్లాడని కవిత సంబోధించారు. పెద్దల విషయంలో జోక్యం చేసుకోవద్దని.. భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు అనుభవించిన వారు ఇప్పుడు తనను తిట్టడం ఏంటని కవిత మండిపడ్డారు..
Also Read: KCR’s strategy: అప్పుడు బాబు.. ఇప్పుడు లోకేష్..బిఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రం!
కవిత విమర్శలు చేసింది ఎవరిపై అని చర్చ జరుగుతుండగా.. కాంగ్రెస్ నాయకులు దానికి సమాధానం చెప్పారు. కవిత విమర్శించిన ఆ లిల్లీపుట్ నాయకుడు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అని.. ఆ చిన్న పిల్లగాడు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి అని.. వారు ఈ మధ్యన గులాబీ పార్టీలోని కీలక నాయకుడి అండ చూసుకొని కవితపై విమర్శలు చేస్తున్నారని.. అందువల్లే ఆమె విలేకరుల సమావేశంలో వారిని టార్గెట్ చేసి నేరుగా విమర్శలు చేశారని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు.