Kavitha on KTR Arrest: కల్వకుంట్ల తారక రామారావును ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారించడం ఇది రెండవసారి. గతంలోనే కల్వకుంట్ల తారకరామారావు తనపై నమోదు చేసిన ఏసీబీ కేసు విషయంలో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కోరారు. అయితే ఆయన అనుకున్నట్టుగా సర్వోన్నత న్యాయస్థానం అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో ఆ వ్యవహారంలో ఏదో ఉందనే ప్రచారం మొదలైంది.. క్వాష్ కు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం పొరపాటు అనే భావన ఉన్నప్పటికీ.. కల్వకుంట తారకరామారావు వెనక్కి తగ్గలేదు. అయితే ఈ కేసులో ప్రైమరీ ఆధారాలు ఉన్నాయని.. సర్వోన్నత న్యాయస్థానం గతంలో వెల్లడించిన తీర్పులో ప్రకటించింది. దీంతో కల్వకుంట్ల తారకరామారావు పై కేసు నమోదు చేయడానికి రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఈ ప్రకారం చూసుకుంటే కల్వకుంట్ల తారక రామారావును అరెస్ట్ చేయడానికి ఏసీబీకి పూర్తి అధికారాలు ఉన్నాయి. వారిని అడ్డుకునే అవకాశం లేదు..
Also Read: Rapido Driver Attack: డబ్బులు ఇవ్వనన్న యువతిపై రాపిడో డ్రైవర్ దాడి.. వైరల్ వీడియో
కల్వకుంట్ల కవిత ఏమన్నారంటే..
కల్వకుంట్ల తారక రామారావు అవినీతి నిరోధక శాఖ అధికారులకు హాజరవుతున్న క్రమంలో తెలంగాణ పోలీసులు హైదరాబాద్లో ఉన్న తెలంగాణ భవన్ కార్యాలయానికి తాళాలు వేశారు. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు.. విచారణకు హాజరవుతామని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు చెప్పినప్పటికీ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పోలీసులు తాళాలు వేయడాన్ని కల్వకుంట్ల కవిత ఖండించారు.. ఇది సరైన విధానం కాదని.. పోలీసులు తెలంగాణ ప్రజల తరఫున కాకుండా.. కాంగ్రెస్ పార్టీ తరపున పని చేస్తున్నట్టు అనిపిస్తోందని ఆమె ఆరోపించారు. ఏ పార్టీలో అయిన లోపాలు ఉంటాయని.. వాటిని అధినేతకు చెప్పుకోవడం సహజమని కల్వకుంట్ల కవిత అన్నారు. మా పార్టీలో కూడా లోపాలు ఉన్నాయని.. వాటిని సవరించుకునే ప్రయత్నం చేస్తామని.. అంతే తప్ప మా మీద దాడి చేస్తే ఊరుకోమని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.. మొత్తానికి తన సోదరుడిని అరెస్టు చేస్తారని వదంతులు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఇటీవల కాలంలో తన సోదరుడికి, కల్వకుంట్ల కవితకి గ్యాప్ ఏర్పడిందని రకరకాల వదంతులు వినిపించాయి. దీనికి తోడు ఆ మధ్య కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఇటీవల తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు కల్వకుంట్ల తారక రామారావుకు రెండోసారి నోటీసులు ఇవ్వడం పట్ల కల్వకుంట్ల కవిత స్పందించారు. ఆ నోటీసులు ఇవ్వడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. మళ్లీ ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు అరెస్టుపై ఈ స్థాయిలో స్పందించారు.