Kavitha: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కూతురు కవిత రెండు నెలల క్రితం తండ్రికి రాసిన లేఖ సంచలనంగా మారింది. అప్పటి నుంచి గులాబీ నేతలు కవితను అంటరానట్లు చూస్తున్నారు. ఆమెను ఒంటరిని చేశారు. దీంతో తాజాగా కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్ కుమార్) కల్వకుంట్ల కవితపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినా… ఇటు తండ్రిగానీ, అటు అన్నగానీ స్పందించలేదు. దీంతో బీఆర్‌ఎస్‌లో కవిత ఒంటరి అయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: ఏపీకి కొత్త నేషనల్ హైవే.. ఆ జిల్లాలకు మహర్దశ!
తెలంగాణలో బీసీ రిజర్వేషన్‌ను 42%కి పెంచిన క్యాబినెట్ నిర్ణయాన్ని కవిత స్వాగతించడంపై మల్లన్న ఆమె గుర్తింపును ప్రశ్నిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కవిత ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే బీఆర్‌ఎస్ నాయకత్వం నుంచి, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ నుంచి స్పష్టమైన మద్దతు లేదా ఖండన రాకపోవడం గమనార్హం. ఈ మౌనం పార్టీలో కవిత స్థానం బలహీనంగా ఉందనే సంకేతాలను ఇస్తోంది, ఇది ఆమె రాజకీయ ఒంటరితనాన్ని సూచిస్తుంది.
తెలంగాణ జాగృతి దాడితో ఉద్రిక్తత
మల్లన్న వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా, కవిత నాయకత్వంలోని తెలంగాణ జాగృతి సభ్యులు మల్లన్న కార్యాలయంపై దాడి చేసి, ఆస్తులను ధ్వంసం చేశారు. ఒక ఉద్యోగిని గాయపరిచారు. ఈ ఘటనలో మల్లన్న గన్‌మన్ గాలిలో కాల్పులు జరపడం వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. కవిత ఈ చర్యను ‘ప్రజాస్వామ్య నిరసన‘గా సమర్థించినప్పటికీ, మల్లన్న ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన బీఆర్‌ఎస్‌లో ఆమెకు తగిన మద్దతు లేని పరిస్థితిని బహిర్గతం చేస్తుంది, అదే సమయంలో రాజకీయ హింసపై చర్చను రేకెత్తించింది.
మహిళా నేతల మౌనం..
మల్లన్న వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉన్నప్పటికీ, బీఆర్‌ఎస్ మహిళా నేతలు ఈ అంశంపై బహిరంగంగా స్పందించకపోవడం ఆశ్చర్యకరం. పార్టీ నేతలుగా కాకపోయినా సాటి మహిళగా కూడా ఖండించడం లేదు. ఈ మౌనం కవిత ఒంటరిగా ఉన్నారనే అభిప్రాయాన్ని బలపరుస్తుంది. గతంలో, 2023లో బీజేపీ నాయకుడు బండి సంజయ్ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేసి, ఆయనపై చర్యలు డిమాండ్ చేశారు. అయితే, ప్రస్తుత సందర్భంలో పార్టీ నుంచి అలాంటి స్పందన లేకపోవడం ఆమెపై అంతర్గత అసంతృప్తిని సూచిస్తోంది.
బీసీ రిజర్వేషన్ అంశంతో విభేదాలు..
కవిత బీసీ రిజర్వేషన్‌కు మద్దతు ఇవ్వడం, దానిని స్వాగతించడం బీఆర్‌ఎస్‌లో బీసీ అంశాన్ని వివాదాస్పదం చేసింది. ఆమె బీసీ సమాజం కోసం కృషి, 42% రిజర్వేషన్ డిమాండ్ ఆమె రాజకీయ ఆకాంక్షలను సూచిస్తున్నాయి. అయితే, ఈ అంశంపై కేసీఆర్, కేటీఆర్ నుంచి స్పష్టమైన మద్దతు లేకపోవడం కుటుంబంలోనూ, పార్టీలోనూ చిచ్చును రేకెత్తించింది. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైలులో ఉన్నప్పుడు కూడా ఆమెకు తగిన మద్దతు లేకపోవడం కవిత, కేటీఆర్ మధ్య రాజకీయ, వ్యక్తిగత విభేదాలను స్పష్టం చేస్తోంది.