Karnataka Farmers: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ… ఆరోపణలు, ప్రత్యారోపణలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్‌కు అనుకూలంగా పరిస్థితులు మారుతున్నాయని తెలుసుకున్న అధికార బీఆర్‌ఎస్‌లో ఆందోళన మొదలైంది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థుల వరకు అందరూ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్నారు.
24 గంటల కరెంటుపై సవాళ్లు..
తెలంగాణలో 24 గంటల విద్యుత్‌పై ఇప్పటికే తెలంగాణలో సవాళ్లు, ప్రతిసవాళ్లు నడుస్తున్నాయి. తాము మాత్రమే దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్నామని బీఆర్‌ఎస్ నాయకులు చెబుతుంటే.. 24 గంటల కరెంటు వస్తే తాను రాజీనామా చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఛాలెంజ్ చేశారు. దీనికి కేటీఆర్ కరెంటు తీగలను పట్టుకుంటే తెలుస్తుందని ఎద్దేవా చేశారు.
తాజాగా కర్ణటక పథకాలపై..
ఇప్పుడు బీఆర్‌ఎస్ నాయకులు కర్ణాటకలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల తీరును ఎండగడుతున్నారు. ఆరు నెలల క్రితం ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ అలవికాని హామీలు ఇచ్చిందని, వాటిని నమ్మి ప్రజలు గెలిపిస్తే.. ఆరు నెలలు గడిచినా అమలు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ తెలంగాణలో కూడా అలాంటి హామీలే ఇస్తుందని ఆరోపిస్తున్నారు. నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే వ్యవసాయాని 3 గంటల కరెంటు కూడా రాదంటున్నారు.
రైతులు ఆందోళన చేస్తున్నారని…
కర్ణాటకలో కూడా కాంగ్రెస్ హామీలు అమలు కావడం లేదనడానికి అక్కడి రైతుల ఆందోళనలే నిదర్శనమని బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కానీ, అక్కడ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతోంది. రేషన్ ఇస్తున్నారు. కరెంటు సరఫరా జరుగుతోంది. ఒకవేళ ఇవి రాకపోతే అక్కడి రైతులు ప్రజలు ఇప్పటì కే ఉద్యమించేవారు. బస్సుల్లో ఉచిత ప్రయాణంపై అధికారంలోకి వచ్చిన పక్షం రోజులకే మహిళలు ఆందోళన చేశారు. 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌పైనా ఆందోళనలు చేశారు. తాజాగా రైతులు కూడా ఆందోళన చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ ఆరోపిస్తున్నారు.
ఆధారాలెందుకు చూపడం లేదు..
కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో 24 గంటల కరెంటుపై చేసిన ఛాలెంజ్‌ను బీఆర్‌ఎస్ నాయకులు స్వీకరించడం లేదు. గ్రామాల్లోకి రమ్మంటే వెళ్లడం లేదు. పైగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపణలు చేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ మోసం చేస్తే.. అక్కడి మీడియా ఉంది, అక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయి. బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలను పంపించి అక్కడి పరిస్థితులపై వీడియో తీసి చూపించే అవకాశం ఉంది. కానీ, బీఆర్‌ఎస్‌గానీ, బీజేపీ గానీ, అలాంటి పని చేయకుండా ఊరికే ఆరోపణలు చేస్తూ పబ్బం గడుతపుతోంది.
తాజాగా కర్ణాటక రైతులతో తెలంగాణలో ఆందోళనలు..
ఇక అసెంబ్లీ ఎన్నికల వేళ.. కర్ణాటక రైతులు తెలంగాణలో ఆందోళన చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొడంగల్, గద్వాలలో కర్ణాటక రైతులు తమకు కరెంటు రావడం లేదని నిరసన తెలిపారు. ఇక్కడ ఆందోళన ఏంటంటే.. కాంగ్రెస్‌ను గెలిపించాలని రేవంత్‌రెడ్డి, బీజేపీని గెలిపించాలని డీకే.అరుణ ప్రచారం చేశారని, అందుకే వారిని అడిగేందుకు ఆందోళన చేస్తున్నామంటున్నారు. కానీ, ఈ నిరసన పూర్తిగా బీఆర్‌ఎస్ చేయిస్తున్నదే అన్న ఆరోపణలు వస్తున్నాయి.
మొత్తంగా కర్ణాటకను చూపి, కాంగ్రెస్ హామీలు నమ్మొద్దనేలా బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేయిస్తున్నారు. మరి ముందు ముందు ఇలాంటి ప్రచారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.