Komatireddy Rajagopal Reddy: తెలంగాణలో వలసర రాజకీయం ఊపందుకుంది. 15 నెలల క్రితం బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అని మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అయితే ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయంగా యాక్టీవ్‌గా ఉండడం లేదు. ఈ క్రమంలో కర్ణాటక ఎన్నికలు జరగడం, అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా తెలంగాణలోనూ పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ పుంజుకుంది. బీజేపీ డీలా పడింది. బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తప్పించడం మరింత ప్రభావం చూపింది. ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి సొంత పార్టీకి రావాలని నిర్ణయించుకున్నారు.
ప్రజల కోసమే పార్టీల మార్పు అని..
బీజేపీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రత్యామ్నాయం అనుకున్నానని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగిందని పేర్కొన్నారు. కేసీఆర్ అవినీతిని అడ్డుకోవడంలో బీజేపీ విఫలమైందని ఆరోపించారు. తాను నాడు బీజేపీలోకి వెళ్లినా.. నేడు తిరిగా కాంగ్రెస్‌లోకి వస్తున్నా కారణం కేసీఆర్‌ను గద్దె దించడం ఒక్కటే అన్నారు. ప్రజలు మార్పు కోరుతున్నారని, ప్రజల కోసం తాను పార్టీ మారానని ప్రకటించారు.
నాటి లేఖ వైరల్..
పార్టీల మార్పుపై నీతులు చెబుతున్న కోమటిరెడ్డి.. గతంలో రాసిన ఓ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయాలను కోమటిరెడ్డి వ్యాపారం చేశారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. నాడు కాంట్రాక్టు కోసం బీజేపీలోకి వెళ్లాడని, నేడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మళ్లీ సొంత గూటికి వచ్చాడని ఆరోపిస్తున్నారు.
నాటి లేఖలో ఇలా..
‘‘నేను భారతీయ జనతా పార్టీ నుండి ఇతర పార్టీల్లోకి వెళుతున్నానంటూ కొన్ని పత్రికలు, మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను పూర్తిగా ఖండిస్తున్నాను. నేను వ్యక్తిగత స్వార్థం కోసం సిద్ధాంతాలను మార్చే వ్యక్తిని కాదు. నా చుట్టూరా ఉన్న సమాజానికి నా వంతు మంచి చేయాలన్న లక్ష్యంతోనే రాజకీయ మార్గాన్ని ఎంచుకున్న వ్యక్తిని. ఆ దిశగానే ఎంపీగా, ఎంఎల్సీగా, ఎంఎల్‌ఎగా ఎక్కడా అవినీతి, వ్యక్తిగత స్వార్ధం లేకుండా నీతి నిజాయితీగా పనిచేస్తూ వచ్చాను. ఆ దిశగానే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కోసం ఆనాడు నా ఎంపీ పదవికి రాజీనామా చేసి స్వరాష్ట్ర సాధనలో నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాను. కానీ పద్నాలుగు వందల మంది యువకుల బలిదానాలు, వేలాది యువజన, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో పాటు సబ్బండ వర్గాల ఒక్కటై తెచ్చుకున్న తెలంగాణాలో తర్వాత రాజకీయ పరిణామాలు నన్నెంతో కలిచివేశారు. ప్రజా తెలంగాణా బదులు ఒక్క కుటుంబం కోసమే తెలంగాణా అన్నట్లు పరిస్థితి తయారైంది.కేసీఆర్ ప్రజా పాలకుని వలా కాక, తెలంగాణాకు నిజాం రాజు వలే నియంతత్వ పోకడలుపోతున్నారు. తెలంగాణా ఆకలినైనా బరిస్తుంది.. కానీ అవమానాలను బరించదు..ఆత్మగౌరవం కోసం ఎందాకైనా జెండా ఎత్తిపడుతుందన్న విషయం ఇప్పటికే అనేక విషయాల్లో వెల్లడైంది. అందుకే తెలంగాణలో ప్రజారాజ్యం ఏర్పాటు దిశగానే నేను గడిచిన సంవత్సరం కాంగ్రెస్ పార్టీతో పాటు నా ఎంఎల్‌ఎ పదవికి సైతం రాజీనామా చేసి బీజేపీలో చేరాను. ఈ దేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు నడిపించే శక్తి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమితాలకు ఉందని విశ్వసించి దేశ సౌభాగ్యంలో నేను భాగస్వాములు కావాలని అడుగు వేశాను. మునుగోడులో కేసీఆర్ ఆయన 100 మంది ఎంఎల్‌ఎలు మునుగోడులో సంసారాలు పెట్టినా.. నా మీద, బీజేపీ మీద మునుగోడు ప్రజలు అచంచల విశ్వాసాన్నే చూపారు.కేసీఆర్ ఆయన అవినీతిని కక్కించి కుటుంబ తెలంగాణా బదులు ప్రజాస్వామిక, బహుజన తెలంగాణా ఏర్పాటు చేసే సత్తా ఒక్క బీజేపీకే ఉంది. నేనే కాదు ఇతర ముఖ్య నాయకులెవరూ బీజేపీని వీడరు. కేసీఆర్ కుటుంబ పాలనను అంతమైందించే దిశగా భారతీయ జనతా పార్టీ సైనికులై ముందుకు కదులుతున్నాము.
భారత్ మాతాకీ జై..! ’ అని లేఖలో కోమటిరెడ్డి పేర్కొన్నారు.
మొత్తంగా 15 రోజుల క్రితం తాను బీజేపీకే అంకితమై ఉంటానని చెప్పిన రాజగోపాల్‌రెడ్డి, ఇంతలోనే పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరడాన్ని ఇదికదా స్వార్థ రాజకీయం అంటూ కామెంట్ చేస్తున్నారు.