Karimnagar BJP: కరీంనగర్ ఉద్యమాల పురిటిగడ్డ. దశాబ్దాల చారిత్రక నేపథ్యం ఉన్న కరీనంగర్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలకంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించారు. అయినా కరీనంగర్ బలంగా నిలబడింది. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్‌పై కాషాయ జెండా ఎగురవేయడానికి బీజేపీ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సర్వశక్లు ఒడ్డుతున్నారు. మరో ఐదు రోజుల్లో(ఫిబ్రవరి 11న) పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రచారం జోరందుకుంది.
మారుతున్న రాజకీయాలు..
కరీంనగర్ కార్పొరేషన్‌లో బీఆర్‌ఎస్ పదేళ్లు అధికారంలో ఉంది. ఈ పదేళ్లు కాంగ్రెస్ కేవలం నామమాత్రపు పోటీకే పరిమితమైంది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కరీంనగర్ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్, బీజేపీ బలం పుంజుకోగా, బీఆర్‌ఎస్ మరింత బలహీనపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా గెలిచినా.. అధికారంలో లేకపోవడం ఆ పార్టీకి మైనస్‌గా మారింది. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కరీంనగర్‌లో అప్పడు మంత్రిగా ఉన్న గంగుల అండతో కార్పొరేటర్లు రెచ్చిపోయారు. దందాలు, సెటిలెంట్లు, భూకబ్జాలతో ప్రజలను పీడించారు. ఇప్పటికీ దాని ప్రభావం ప్రజల్లో ఉంది. దీంతో స్థానక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నా గులాబీ నాయకులు ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు కనిపించడం లేదు.
బీజేపీ దూకుడు..
బీజేపీ ఇక్కడ బలపడుతోంది. ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్పొరేషన్‌లో కాషాయ జెండాను ఎగురవేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నారు. అభ్యర్థులు ఎంపిక నుంచి ప్రచారాల వరకు అంతా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 60 డివిజన్లలో బీజేపీ 30 నుంచి 35 డివిజన్లలో గెలిచే అవకాశం ఉందని అంచనా.
కాంగ్రెస్‌లో అంతర్గత సమస్యలు
కరీంనగర్‌లో అధికార పార్టీ కాంగ్రెస్‌ను పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెలిచాల రాజేందర్‌రావు తీరు నష్టం కలిగిస్తోందన్న చర్చ జరుగుతోంది. జిల్లా అధ్యక్షుడి కంటే ఎక్కువగా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టికెట్ కేటాయింపులో అసంతృప్తి తీవ్రం – సీనియర్లను, గెలిచే అవకాశం ఉన్నవారిని పక్కనపెట్టి కొత్తవారికి అవకాశాలు ఇచ్చారు. అయినా రాష్ట్ర అధికార ప్రయోజనంతో 15 నుంచి 20 స్థానాల్లో హస్తం అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది.
బీఆర్‌ఎస్‌కు మూడో స్థానం..
గత అనుభవాలను గుర్తుంచుకన్న ప్రజలు ఈసారి బీఆర్‌ఎస్‌ను ఓడించాలనే లక్ష్యంతోనే ఉన్నారు. గులాబీ నేతలు సాగించిన అరాచకాలు అలా ఉన్నాయి మరి. రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం కూడా ఆ పార్టీకి మైనస్. దీంతో ఈసారి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు 5 నుంచి 10 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది.
కంచుకోటలో ఎంఐఎం పాగా..
ఇక ఎంఐఎం ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉన్న కశ్మీర్‌గడ్డ, నాకా చౌరస్తా, హౌసింగ్ బోర్డు ప్రాంతాల్లో బలంగా ఉంది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంతో సంబంధం లేకుండా కరీంనగర్‌లోని 5–6 డివిజన్లలో గెలుస్తుంది. ఈసారి కూడా ముస్లింలు ఎక్కువగా ఉండే స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది.
