Karimnagar Cyber Crime: ఆవు చేలో వేస్తుంటే.. దూడ గట్టున మేయదు. దూడ కూడా చేలోనే మేస్తుంది. అవసరమైతే చేను మొత్తాన్ని తినేస్తుంది. ఇదే సూత్రీకరణను ఆ పత్రిక విలేఖరి అమలు చేయడం మొదలు పెట్టాడు. ఏకంగా కోట్లకు ఎదిగాడు. ఇటీవల కరీంనగర్ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు కాబట్టి అతని ఆగడాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. లేకుంటేనా ఇప్పటికే అతడు పని చేస్తున్న జిల్లాను సగానికి అమ్మేవాడు. ఎందుకంటే అతడి మాయ తెలివితేటలు ఆ విధంగా ఉంటాయి మరి.
అసలుకు రెట్టింపు లాభాలు ఇస్తామని కొంతకాలంగా ఆ పత్రిక విలేకరి ఆ జిల్లాలో దందాలు చేశాడు. మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లో కూడా తన హవా కొనసాగించాడు. చివరికి కరీంనగర్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇతడి వ్యవహారాలపై దృష్టి సారించడంతో ఒక్కసారిగా దొరికిపోయాడు. వాస్తవానికి ఇతడి బాధితులు కేవలం ఖమ్మంలోనే కాదు.. కరీంనగర్ లో కూడా ఉన్నారు.. అందువల్లే కరీంనగర్లో కేసు నమోదు కావడంతో అక్కడ పోలీసులు ఖమ్మం వచ్చి ఆ పత్రిక విలేకరిని తీసుకెళ్లారు.. వాస్తవానికి ఆ విలేఖరికి ప్రధాన ఆయుధం ఆ పత్రికనే. ఎందుకంటే ఆ పత్రిక విలేకరి కాబట్టి దందాలు అత్యంత సులువుగా చేయగలిగాడు. ఆ పత్రికలో ఉన్న పెద్ద తలకాయలను సులువుగా మేనేజ్ చేయగలిగాడు. అన్నిటికంటే ముఖ్యంగా పత్రిక యాజమాన్యానికి యాడ్స్, సర్కులేషన్ చేసి నమ్మిన బంటుగా మారిపోయాడు.. అదే నమ్మకం మాటున ఇష్టానుసారంగా చెలరేగిపోయాడు.
Also Read: Genelia viral video: జెనీలియా కాళ్లకు మొక్కిన యంగ్ హీరో.. వీడియో వైరల్!
ఆ విలేఖరి కేవలం ఆర్థిక మోసాలు మాత్రమే కాదు.. చాలా నేరాలలో తెర వెనుక పాత్ర పోషించాడు. అతని నిర్వాకం వల్ల ఇటీవల ఖమ్మం జిల్లాలో ఒక ఏసీపీ స్థాయి అధికారి, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. ఏసీపీ స్థాయి అధికారి ఈ విలేకరి వలలో చిక్కిపోయాడంటే అతడి మాయమాటలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఏసిపి స్థాయి అధికారిని బురిడీ కొట్టించడం మాత్రమే కాదు.. అంతకుమించి మోసాలు అతడు చేశాడు. అతడు అరెస్టు అయిన తర్వాత అవి ఇప్పుడిప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.
ఆ పత్రికలో పని చేసే విలేకరి ఓ వ్యాపారితో ఐదు కోట్లకు ఐపీ పెట్టించాడు.. ఇది చేసినందుకుగాను 15 లక్షల వరకు తీసుకున్నాడు. తర్వాత ఆ వ్యాపారిని గుంటూరు పంపించాడు. అక్కడ మకాం వేసేలా చేశాడు. అనంతరం చాంబర్ ఆఫ్ కామర్స్ లో పనిచేసే ఒక వ్యక్తితో వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తితో ఒక ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేయించాడు. సమాజంలో మంచి పనులు చేస్తున్న వ్యక్తిగా ప్రమోట్ చేయించాడు. ఆ తర్వాత ఖమ్మం నగర శివారులో ఒక వెంచర్ కూడా వేయించాడు. ఇది పేరుకు వెంచర్ మాత్రమే.. ఇందులో జరిగేవి మొత్తం అసాంఘిక కార్యకలాపాలు.. కాసినో, జూదం, ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఆ సాంఘిక కార్య కలపాలు నిర్వహించడం.. వంటివి ఈ వెంచర్ లో జరిగేవి. అయితే ఆ విలేఖరి తన కరెన్సీ దందాలో పెట్టుబడి పెట్టిన వారిని ఇక్కడికి తీసుకొచ్చి.. వారికి విందు వినోదాలు ఏర్పాటు చేయించేవాడు.. అయితే ఇందులోకి పోలీసులకు మాత్రం ఉచితంగా ప్రవేశం లభించేది. అయితే అందరి పోలీసులకు కాదు.. ఏసిపి స్థాయికి మించిన అధికారులకే ఇందులో ఎంట్రీ ఉండేది. కరీంనగర్ పోలీసులు జాగ్రత్తగా ఈ ఆర్థిక మోసం కేసును డీల్ చేశారు కాబట్టి ఆ విలేకరి దొరికిపోయాడు. సొంత జిల్లా పోలీసులైతే అతడు కచ్చితంగా మేనేజ్ చేసేవాడు. ఏసిపి స్థాయి అధికారిని మోసం చేసిన అతడికి.. ఈ ప్రాంత పోలీసులు ఒక లెక్కనా..
Also Read: Naresh Pavithra bedroom: నరేష్, పవిత్ర బెడ్ రూమ్ లో మురళీ మోహన్..సంచలన వీడియో!
ఇప్పుడు ఆ విలేఖరిని విచారిస్తున్న పోలీసులకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అతడు ఆ పత్రికలో పనిచేసే కొంతమంది పెద్ద తలకాయల ఖాతాలలోకి డబ్బులు పంపించాడట. అవి కూడా లక్షల్లోనే ఉన్నాయట. ఈ విషయం తెలిసిన మేనేజ్మెంట్ వారిని హైదరాబాద్ రమ్మని ఆదేశాలు జారీ చేసిందట. ఒకవేళ పోలీసులు ఇచ్చే నివేదిక మేనేజ్మెంట్ అంచనా వేసిన విధంగా ఉంటే మాత్రం.. ఆ జిల్లాలోని పత్రిక పెద్ద తలకాయలకు మూడినట్టే. ఇప్పటికే ఆ పత్రికను వారు ఆ జిల్లాలో తమ సామంత రాజ్యంగా మార్చుకున్నారు. కోట్లకు కోట్లు దండుకున్నారు. చూడాలి మరి పోలీసులు ఇచ్చే నివేదికతో మేనేజ్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో..