Karimnagar Cable Bridge: ప్రారంభించిన ఏడాదికే దారుణస్థితి.. కరీంనగర్‌ కేబుల్‌ బ్రిడ్జి నాణ్యత డొల్ల.. హడావుడి పనులు.. ఆతృతగా ప్రారంభం!

తెలంగాణలో హైదరాబాద్‌ తరువాత కరీంనగర్‌లో కేబుల్‌ బ్రిడ్జిని నిర్మించారు. కానీ ప్రారంభించిన ఏడాదికే కరీంనగర్‌ కేబుల్‌ బ్రిడ్జి రూపురేఖలు మారిపోయాయి. వాహనాలు నడవడానికి కూడా వీలు లేకుండా మారింది.

Written By: Raj Shekar, Updated On : August 8, 2024 9:42 am

Karimnagar Cable Bridge

Follow us on

Karimnagar Cable Bridge: కరీంనగర్‌: తెలంగాణలో హైదరాబాద్‌లో దుర్గం చెరువుపై గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీగల వంతెన నిర్మించింది. కేసీఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక తనకు ఇష్టమైన కరీనంగర్‌ అభివృద్ధిపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలో కరీంనగర్‌లో మానేరుపై తీగల వంతెన నిర్మాణం చేపట్టారు. మానేరు రివర్‌ఫ్రంట్‌ పనులు ప్రారంభించారు. ప్రతిష్టాత్మంగా ఈ పనులను కరీంనగర్‌ ఎమ్మెల్యే, అప్పటి బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ చేపట్టారు. పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తూ చేయించారు. మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులను కూడా తన అనుచర కాంట్రాక్టర్లకు అప్పటించి వేగంగా చేయించే ప్రయత్నం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి తీగల వంతెన, రివర్‌ ఫ్రంట్‌ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈమేరకు పనులను పరుగులు పెట్టించారు. ఈ హడావుడిలో తీగల వంతెన పనులు పూర్తి చేయించారు. లైటింగ్‌ కోసం అదనంగా నిధులు మంజూరు చేయించి ఏర్పాటు చేశారు. తర్వాత నాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను పిలిపించి అట్టహాసంగా ప్రారంభించారు. ప్రారంభించిన మూడు నెలలు మెరిసిపోయిన కేబుల్‌ బ్రిడ్జి తర్వాత కళా విహీనంగా మారింది. వందల కోట్ల రూపాయలతో మానేరుపై నిర్మించిన ఈ కట్టడం ఏడాది తిరిగేసరికి దారుణ స్థితికి వచ్చేసింది. సరిగ్గా ఏడాది కిందట అట్టహాసంగా ప్రారంభించిన కరీంనగర్‌ కేబుల్‌ బ్రిడ్జి అప్పుడే కళ కోల్పోయింది. కేబుల్‌ బ్రిడ్జి నాణ్యతపై స్థానికులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏడాది క్రితం అట్టహాసంగా ప్రారంభం..
సరిగా ఏడాది క్రితం(2023 జూన్‌ 21న) కరీంనగర్‌ తీగల వంతెనను నాటి ఐటీ శాఖ మంత్రి కేటీ.రామారావు ప్రారంభించారు. ప్రారంభోత్సవాలను మూడు రోజులు నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే, బీసీ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌. దీంతో అందరూ కరీంనగర్‌ టూరిజంకు తీగల వంతెన బెంచ్‌ మార్క్‌ అవుతుందని చాలా మంది భావించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో అత్యంత అద్భుత కట్టడంగా.. హైదరాబాద్‌ తర్వాత కేబుల్‌ బ్రిడ్జి ఉన్న ప్రాంతంగా కరీంనగర్‌ నిలుస్తుందని బీఆర్‌ఎస్‌ నేతలు చెప్పారు. సుమారు 234 కోట్లు రూపాయలు ఖర్చు చేసి కట్టిన కరీంనగర్‌ కేబుల్‌ బ్రిడ్జిని ఓ ప్రముఖ కంపెనీకి కాంట్రాక్ట్‌ ఇచ్చి నిర్మాణం చేపట్టారు. కానీ కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభించి ఏడాది అలా అయిందో లేదో అప్పుడే శిథిలావస్థకు చేరుకోవడంపై జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎటు చూసినా రిపేర్లు చేయాల్సిన స్థితికి కేబుల్‌ బ్రిడ్జి చేరుకుంది.

విమర్శల వెల్లువ..
కరీంనగర్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్లేందుకు మరో మార్గంగా ఉపయోగపడుతున్న కేబుల్‌ బ్రిడ్జ్‌ ఏడాదికే రూపులేఖలు మారిపోయాయి. ఒకప్పుడు ఆహ్లాదాన్ని పంచిన అందమైన కేబుల్‌ బ్రిడ్జి నేడు ఓవైపు కంపుకొడుతూ, సరైన నిర్వహణ లేక కొంత సమయం కూడా దానిపై నిలబడలేని పరిస్థితి నెలకొంది. కేబుల్‌ బ్రిడ్జ్‌ ప్రారంభమై ఆరు నెలలకే మరమ్మతులు చేయాల్సి వచ్చిందంటే నాణ్యత పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అప్పటి ప్రభుత్వ నేతలకు చెందిన భూములు దీని చుట్టూ ఉన్నాయని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే కేబుల్‌ బ్రిడ్జ్‌ నిర్మించారని కరీంనగర్‌ ప్రజలు చెబుతున్నారు. రాష్ట్రంలో రెండో ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జి అయిన కరీంనగర్‌ కేబుల్‌ బ్రిడ్జి ఏడాదికే దారుణమైన స్థితికి రావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.