https://oktelugu.com/

Naga Panchami 2024: నాగపంచమి రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయకండి.. లేదంటే కష్టాలు తప్పవు..!

నాగపంచమి రోజున కొన్ని పనులు చేయొద్దని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు ఎక్కడా నేలను తవ్వకూడదు అంటారు. వాస్తవానికి పూర్వ కాలంలో కొందరు తెలియక పుట్టను తవ్వేవారు. నాగపంచమి రోజున పాములకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా ఆ దోషం కుటుంబానికి ఏళ్ల తరబడి ఉంటుందని చెబుతారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 8, 2024 / 09:37 AM IST

    Naga Panchami 2024

    Follow us on

    Naga Panchami 2024: హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసం తర్వాత వచ్చేది శ్రావణ మాసం. ఈ మాసంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. దాదాపు ఈ నెల మొత్తం ప్రజలు పూజలు, వ్రతాలు, పండుగలతో గడుపుతారు. శ్రావణ మాసంలో శుభ ముహూర్తాలు కూడా ఉంటాయి. దీంతో శుభకార్యాలు, పెళ్లిళ్లు జోరుగా సాగుతూ ఉంటాయి. అయితే ఈ నెలలో వచ్చే మొదటి పండుగ నాగపంచమి. శ్రావణమాస శుక్ల పక్ష పంచమి రోజున నాగేదేవతకు పూజలు చేస్తే అన్నీ కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సంతానం కోరుకునే వారు ఈరోజు పవిత్రంగా ఉంటూ నాగేంద్రుడిని పూజిస్తారు. రోజంతా నిష్టగా ఉపవాసం ఉంటారు. ఈ క్రమంలో ముందుగా ఉదయం నాగదేవతకు పాలు పోస్తారు. సమీపంలోని పుట్ట వద్దకు మహిళలు వెళ్లి పూజలు చేసిన అనంతరం పుట్టలో పాలు పోస్తారు. ఆ తరువాత పసుపు, కుంకుమ, పూలతో పుట్టను అలంకరిస్తారు. జాతక దోషం, కాలసర్ప దోషం ఉన్నవారు నాగపంచమి రోజున నాగ దేవతకు పూజలు చేయడం వల్ల ఎంతో ఫలితం ఉంటుందని కొందరు జ్యోతిష్యులు చెబుతారు. అందువల్ల కొందరు మగవారు సైతం నాగపంచమి రోజు నిష్ఠగా ఉంటూ పుట్టలో పాలు పోసి నాగేంద్ర స్వామి కి పూజలు చేస్తారు. అయితే నాగ పంచమి రోజున పుట్టలో పాలు పోయొద్దని కొందరు జంతు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పుట్టలో పాలు పోయడం వల్ల పాములను ఇబ్బంది పెట్టినట్లేనని అంటున్నారు. అంతేకాకుండా నాగ పంచమి రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయొద్దని పండితులు చెబుతున్నారు. అవేంటంటే?

    ఈ ఏడాదిలో నాగ పంచమి ఆగస్టు 9న శుక్రవారం రాబోతుంది. దీంతో ఈ రోజు వేడుకలు నిర్వహించుకునేందుకు మహిళలు రెడీ అవుతున్నారు. సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకొని ఆ తరువాత సమీపంలోని పుట్ట వద్దకు వెళ్లి పాలు పోస్తారు. అనంతరం ఇంటికి వచ్చి రోజంతా ఉపవాసం ఉంటారు. ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల నాగేంద్రుని ఆశీస్సులు పొందుతారని చెబుతారు. ఒక వ్యక్తికి ఎలాంటి కష్టాలు ఉన్నా.. నాగ పంచమి రోజున ఉపవాసం ఉంటే కాస్త పలితం ఉంటుందని కొందరు ఆధ్యాత్మిక వాదులు చెబుతున్నారు. అలాగే ఈరోజు శివుడిని పూజించినా ఫలితం ఉండనుందని చెబుతున్నారు.నాగ పంచమి రోజున నాగేంద్ర స్వామికి పూజలు చేయడమే కాకుండా కొన్ని దాన ధర్మాలు చేయడం మంచిది. ఈరోజు నిరుపేదలకు ఆహారం అందించాలి.

    నాగపంచమి రోజున కొన్ని పనులు చేయొద్దని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు ఎక్కడా నేలను తవ్వకూడదు అంటారు. వాస్తవానికి పూర్వ కాలంలో కొందరు తెలియక పుట్టను తవ్వేవారు. నాగపంచమి రోజున పాములకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా ఆ దోషం కుటుంబానికి ఏళ్ల తరబడి ఉంటుందని చెబుతారు. అలాగే ఈరోజు ఎక్కడ పాము కనిపించినా వదిలేయాలని, చంపడం వల్ల అరిష్టాలు ఉంటాయని చెబుతారు.

    నాగ పంచమి రోజున ఎలాంటి ఇనుప వస్తువులతో పనిచేయొద్దని అంటారు. అంటే కుట్లు, అల్లికలు చేయొద్దని చెబుతారు. అలాగే ఇనుప వస్తువుల్లో భోజనం చేయొద్దని అంటున్నారు. కొందరు భక్తులు నాగపంచమి రోజున ఇలాంటి పనులకు దూరంగా ఉంటారు. ఈరోజు చెట్లు కూడా నరికివేయొద్దని అంటారు.

    నాగపంచమి రోజున పుట్టలో పాలు పోయడం సాంప్రదాయం. కానీ కొందరు జంతు శాస్త్ర నిపుణుల ప్రకారం.. పుట్టలో పాలు పోయడం వల్ల పాములు అసౌకర్యాన్ని ఎదుర్కొంటారు. దీంతో వాటికి శ్వాస సమస్యలు ఏర్పడుతాయి. అందువల్ల పుట్టపై ఒక పాత్రను ఉంచి అందులో పాలు పోయడం మంచిది అని అంటున్నారు. లేదా సమీప నాగేంద్ర స్వామి విగ్రహానికి పాలతో అభిషేకం చేయాలని అంటున్నారు.