MLA Kalvakuntla Sanjay Kumar : సరే దాన్ని ఎలాగూ మనం మార్చలేం. పైగా మన వీరవిధేయ కేటీఆర్ నాగార్జున ఫామ్హౌస్ కూలగొడితే బోలెడంత బాధపడిపోయాడు. ఎంత అన్యాయం జరిగిందంటూ ఆవేదన చెందాడు. ఉదయం లేస్తే మాత్రం ట్విట్టర్లో, ఇతర సామాజిక మాధ్యమ వేదికల్లో తెలంగాణ గురించి అహో ఓహో అంటూ చెబుతుంటాడు. కానీ ఆయన పార్టీ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడో.. ఎందుకు అలా మాట్లాడాడో మాత్రం గుర్తించడు. కనీసం ఖండించడు. ఆయన పేరు కల్వకుంట్ల సంజయ్ అట. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడట. అతడు ఏమన్నాడు అంటే.. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో మాదకద్రవ్యాల పార్టీ జరిగిందని.. అందులో కొకైన్ తీసుకున్నారని.. విదేశీ మద్యాన్ని అక్రమంగా దిగుమతి చేసుకున్నారని.. పరిమితికి మించి మద్యాన్ని నిల్వ చేశారని.. డీజే సౌండ్ లతో హోరెత్తించారని నిన్నంతా వార్తలు వచ్చాయి. పైగా పోలీసుల వెళ్లిన సమయంలో రాజ్ అక్కడి నుంచి పారిపోయారని.. గోడ దూకి వెళ్లారని ఓ సెక్షన్ మీడియా రాస్కొచ్చింది. అయితే రాజ్ హైకోర్టుకు వెళ్లి తనను అరెస్టు చేయవద్దని ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఇదంతా జరుగుతుండగానే కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కి వీరావేశం పుట్టుకొచ్చింది. మీడియా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. ఓ మహిళ విలేఖరి సంధిస్తున్న సందేహాలను నివృత్తి చేయలేక మండిపడ్డాడు. నీది తెలంగాణ నేనా అంటూ చిందులేసాడు. తెలంగాణలో మద్యం తాగడం కామన్ అని.. తెలంగాణ కల్చర్ లోనే మద్యం ఉందని వీరలెవల్లో ఆగ్రహం వ్యక్తం చేశాడు..
తాత్కాలిక ఆనందాన్ని ఇవ్వవచ్చుగాక..
ఇలాంటి మాటలు భారత రాష్ట్ర సమితి నాయకులకు తాత్కాలిక ఆనందాన్ని కలిగించవచ్చు గాక.. ఆ పార్టీ సోషల్ మీడియాను మోస్తున్న హ్యాండ్లర్స్ కు సంతోషం కలిగించవచ్చు గాక.. కానీ తెలంగాణ అంటే నిలువెత్తు సంస్కృతికి ప్రతీక. ధిక్కారమైన స్వభావానికి పతాక.. సంప్రదాయానికి.. కొంగుబంగారమైన సమ్మక్క సారలమ్మ వారసత్వానికి.. ఇలపై ఇంద్రధనస్సు లాంటి బతుకమ్మకు తెలంగాణ వేదిక. అలాంటి సంస్కృతిని, అలాంటి సంప్రదాయాన్ని విమర్శిస్తూ “మీరు తెలంగాణ వాళ్లు కాదా? మీ ఇంట్లో అసలు మద్యం స్వీకరించరా” అంటూ ఎమ్మెల్యే ఏకంగా ఆ మహిళా జర్నలిస్టును ఎదుర్ ప్రశ్నిస్తున్నాడు. చివరికి జర్నలిస్టులు మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసేసరికి తన మాటలను వెనక్కి తీసుకున్నాడు. క్షమించమని కోరాడు.
ప్రజాప్రతినిధిగా జాగ్రత్తగా మాట్లాడాలి
ఒక ప్రజా ప్రతినిధి.. అందులోనూ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే బాధ్యతగా ఉండాలి. ప్రజల్లో మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అంటే తప్ప తెలంగాణ సంస్కృతి మీద తాగుడు మాత్రమే అని అతడు చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణం. అత్యంత హీనం. తెలంగాణ గురించి గొప్పగా చెప్పే భారత రాష్ట్ర సమితి ఇలాంటి ఎమ్మెల్యేలను చూసి గర్వపడుతోందా? తెలంగాణ అంటే తాగుడు మాత్రమే అని వ్యక్తీకరించిన అతడి సూత్రికరణకు ఉప్పొంగిపోతోందా? వాస్తవానికి ఇలాంటి రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. తెలంగాణ అంటే తాగుడు మాత్రమే కాదు. తెలంగాణ అంటే యాటకూర, కోడికూర మాత్రమే కాదు. ఇప్పటికీ తెలంగాణలో కొన్ని సెక్షన్స్ మందు ముట్టవు. మాంసాన్ని తినవు. నిష్టగా ఉంటాయి. బతుకమ్మ నాడు సింగిడి లాగా పూలను పేర్చి ఆటలాడుతాయి. దసరా నాడు అమ్మవారి అనుగ్రహం కోసం ఉపవాసాలు ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.. స్థూలంగా తెలంగాణ అంటే వేల సంవత్సరాల సంస్కృతి.. తెలంగాణ అంటే కాళోజి, జయశంకర్ ల ఆకృతి.
మహిళా రిపోర్టర్ అని కూడా చూడకుండా,ఈవిధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? #raveparty #janwadafarmhouse #ktr pic.twitter.com/q3AevGmNga
— D Arun Kumar (@D_Arun_Kumar_) October 27, 2024