Kalvakuntla Kavitha : 8 వరకు జైల్లోనే కవిత.. బెయిల్‌ పిటిషన్‌పై అనూహ్య నిర్ణయం

ఇరుపక్షాలన వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వుచేశారు. ఏప్రిల్‌ 8న తీర్పు వెల్లడిస్తామని పేర్కొన్నారు. దీంతో ఈనెల 8 వరకు కవిత తిహార్‌ జైల్లోనే ఉండనున్నారు. మధ్యంతర బెయిల్‌ వస్తుందని ఆశించిన కవితకు నిరాశే మిగిలింది.

Written By: NARESH, Updated On : April 4, 2024 10:26 pm

Kavitha

Follow us on

Kalvakuntla Kavitha : ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్ట్‌ అయిన తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏప్రిల్‌ 8 వరకు తిహార్‌ జైల్లోనే ఉండనున్నారు. కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులు గురువారం(ఏప్రిల్‌ 4న) వాదనలు ముగిశాయి. కవిత తరఫున సీనియర్‌ న్యాయవాధి అభిషేక్‌ సింగ్వీ వాదనలు వినిపించగా, ఈడీ తరఫున జోయబ్‌ హుసేన్‌ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. ఏప్రిల్‌ 8న ఉదయం 10:30 గంటలకు న్యాయమూర్తి కావేరి భవేజ బెయిల్‌పై తీర్పు వెల్లడించనున్నారు. ఇక కవిత రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలను ఏప్రిల్‌ 20వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

కొడుకు పరీక్షల కోసం..
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను మార్చి 16న ఈడీ అరెస్టు చేసింది. 10 రోజుల కస్టడీ అనంతరం తిహార్‌ జైలుకు తరలించింది. ఈ క్రమంలో తన కొడుకు పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని ఒక పిటిషన్, ఈడీ కస్టడీ ముగిసినందున రెగ్యులర్‌ బెయిల్‌ ఇవ్వాలని మరో పిటిషన్‌ను దాఖలు చేసింది. రెండు పిటిషన్లపై విచారణ గురువారం చేపట్టింది.

అభిషేక్‌ సింఘ్వీ మను వాదనలు ఇలా..
కవిత కుమారుడికి వార్షిక పరీక్షలు ఉన్నాయి. అతనికి పరీక్షల భయం ఉంది. అమ్మగా కొడుకు చదువును పర్యవేక్షించడం, ధైర్యం చెప్పడం కవిత విధి. పరీక్షల సమయంలో పిల్లలకు తల్లి మోరల్‌ సపోర్టు కావాలి. ప్రధాని చాలా సందర్భాల్లో పిల్లల పరీక్షల సన్నద్ధతను ప్రస్తావించారు. తల్లి అరెస్టు ప్రభావం తనయుడిపై ఉంది. ఒక మహిళగా, తల్లిగా కవితకు ఉన్న బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని బెయిల్‌ ఇవ్వాలి.

ఈడీ తరఫున వాదనలు..
ఇక కవితకు బెయిల్‌ ఇవ్వొద్దని ఈడీ తరఫున న్యాయవాది జోయబ్‌ హుస్సేన్‌ వాదనలు వినిపించారు. కవితకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని ఆధారాలను కూడా న్యాయమూర్తికి చూపించారు. కవిత చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి అని, ఆమె బయటకు వెళితే సాక్షాలను ధ్వంసం చేస్తారు. లిక్కర్‌ కేసులో ఆమె కీలకంగా ఉన్నారు. కవిత తనయుడికి 11 పరీక్షలు రాయాల్సి ఉండగా 7 పరీక్షలు పూర్తయ్యాయి. కొడుకు ఒత్తిడికి గురవుతున్నాడనేందుకు, అరెస్టు ప్రభావం ఉంది అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు, వైద్య నివేదికలు లేవు. ఇండో స్పిరిట్‌లో అరుణ్‌పిళ్లై, కవితకు 33 శాతం వాటా ఉంది. కవిత తన ఫోన్లలో డేటాను డిలీట్‌ చేయాలన్న ఉద్దేశంతో ఫార్మాట్‌ చేశారు. ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఫోన్లలో డేటా ఫార్మాట్‌ చేశారు. డిజిటల్‌ ఆధారాలు లేకుండా చేసేందుకు యత్నించారు. కవిత బయటకు వెళితే ఇప్పటికే స్టేట్‌మెంట్‌ ఇచ్చినవారిని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేస్తారు. కవితకు నోటీసులు ఇవ్వగానే అరుణ్‌పిళ్లై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారు. దినేశ్‌ అరోరా అప్రూవర్‌గా మారాక అన్ని విషయాలు చెపాపడు. బుచ్చిబాబు ఫోన్‌లోని చాట్స్‌తో ఎక్సైజ్‌ పాలసీ నోట్స్‌ రికవరీ అయ్యాయి.

తీర్పు రిజర్వు..
ఇరుపక్షాలన వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వుచేశారు. ఏప్రిల్‌ 8న తీర్పు వెల్లడిస్తామని పేర్కొన్నారు. దీంతో ఈనెల 8 వరకు కవిత తిహార్‌ జైల్లోనే ఉండనున్నారు. మధ్యంతర బెయిల్‌ వస్తుందని ఆశించిన కవితకు నిరాశే మిగిలింది.