Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత భర్త: మూడో చార్జిషీట్లో ఈడీ సంచలన అభియోగాలు

అయితే ఈసారి ట్విస్ట్ ఏంటంటే చార్జిషీట్లో కవిత భర్త అనిల్ కుమార్ పేరు కూడా ఈడీ ప్రస్తావించడం విశేషం

Written By: K.R, Updated On : May 1, 2023 10:28 pm
Follow us on

Delhi Liquor Scam Case : ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ మరోసారి బాంబు పేల్చింది. ఈ కేసులో రెండుసార్లు విచారణకు హాజరైన కవిత మరో అభియోగం నమోదు చేసింది. అంతేకాదు ఈ కేసులో మరోసారి సంచలనాలను తెరపైకి తీసుకొచ్చింది. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు చాలామంది ఉన్నారు అంటూ అసలు విషయం బయటపెట్టింది. అదే కాదు మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ పై అభియోగాలు మోపింది. ఇక ఈ కేసులో పలుమార్లు విచారణ ఎదుర్కొన్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును చార్జిషీట్లో ఈడీ పలుమార్లు ప్రస్తావించింది. నిందితుల లావాదేవీలకు సంబంధించిన వాట్స్అప్ చాట్స్, ఈ మెయిల్స్ ను చార్జిషీట్లో ఈడీ జత చేసింది.

ఆర్థిక లావాదేవీలపై..

వాస్తవానికి ఇప్పటివరకు వ్యాపారం లో అక్రమాల గురించే ప్రస్తావించిన ఈడీ.. ఈసారి ఆర్థిక లావాదేవీలపై కూడా అభియోగాలు చేయడం విశేషం. అంతేకాదు లిక్కర్ స్కాం లో కవిత ముడుపులు ఇచ్చారని ఈడీ స్పష్టం చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఈసారి ట్విస్ట్ ఏంటంటే చార్జిషీట్లో కవిత భర్త అనిల్ కుమార్ పేరు కూడా ఈడీ ప్రస్తావించడం విశేషం. ఈడీ చార్జి షీట్ లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కవిత, రాఘవ, శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్రన్, బుచ్చిబాబు, బోయినపల్లి అభిషేక్ రావు, కవితకు అత్యంత సన్నిహితులు సృజన్ రెడ్డి, వి. శ్రీనివాసరావు, ముత్తా గౌతమ్, ఫినిక్స్ శ్రీహరి, తక్కలపల్లి లుపిన్, బీవీ. నాగేశ్వరరావు, చిట్టి రవిశంకర్, దండు రాజేష్, రవివర్మరాజు, కేవీఎస్పీ రాజు, అనిల్ రాజు, ఫీనిక్స్ గ్రూప్, ఎన్ గ్రోత్ క్యాపిటల్, క్రియేటివ్ డెవలపర్స్, ఆంధ్రప్రభ పబ్లికేషన్స్, ఇండియా హెడ్ న్యూస్ ఛానల్ పేర్లను ఈడీ మూడవ చార్జిషీట్లో ప్రస్తావించడం విశేషం.

₹100 కోట్లు హవాలా రూపంలో

మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ, కవిత తో కూడిన సౌత్ గ్రూప్ ₹100 కోట్లను హవాలా రూపంలో ఇచ్చారని ఈడీ అభియోగం నమోదు చేసింది. పాలసీ తనకు అనుకూలంగా ఉండేలా సౌత్ గ్రూప్ ముడుపుల ద్వారా భారీగా లబ్ధి పొందిందని ప్రస్తావించింది. అంతేకాదు హవాలా, ముడుపులు, వివిధ ప్రాంతాల్లో కొనుగోలు చేసిన భూముల వివరాలను ఈడీ తన చార్జిషీట్లో ప్రస్తావించింది. బినామీలతో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కవిత లిక్కర్ వ్యాపారం చేశారని ఈడీ పేర్కొన్నది. ప్రేమ్ రాహుల్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బినామీ అని, అరుణ్ రామచంద్రన్ కవిత బినామీ అని ఈడి తన చార్జి షీట్లో వెల్లడించింది. ఇక ఇండో స్పిరిట్ లో కవిత, కుంట శ్రీనివాసులు రెడ్డి ప్రతినిధులుగా ప్రేమ్ రాహుల్, అరుణ్ రామచంద్రన్ ఉన్నారని వివరించింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో ఇండో స్పిరిట్ ₹192 కోట్ల లాభాలు కళ్ల చూసిందని ఈడి ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితకు మరోసారి విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.