Sachin Tendulkar : ఆకలితో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడిన భారత్.. పాక్ పై గొప్ప విజయం..!

మధ్యాహ్నం భోజనం చేయకుండానే బరిలోకి దిగాల్సి వచ్చిన ఆటగాళ్లకు లెజెండ్ క్రికెటర్ అప్పటి జట్టులో ఆటగాడు అయినా సచిన్ టెండూల్కర్ సహచరులను ఉద్దేశించి మ్యాచ్ కు ముందు మాట్లాడాడు.

Written By: NARESH, Updated On : May 1, 2023 9:59 pm

sachin tendulkar

Follow us on

Sachin Tendulkar : భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తలపించే రీతిలో మ్యాచ్ లు జరుగుతూ ఉంతాయి. అభిమానులు కోటి ఆశలు పెట్టుకుని తమ జట్టు గెలవాలని కోరుకుంటున్నారు. ఇరు జట్లు ఆటగాళ్లు కూడా మ్యాచ్ గెలిచేందుకు సర్వశక్తులను ఒడ్డుతారు. అటువంటి భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ కు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అదేంటో మీరు ఓ లుక్కేయండి.

క్రికెట్ లో దాయాదుల పోరు అంటే చాలు స్టేడియాలు నిండిపోతాయి. ఇరుదేశాల అభిమానులు మ్యాచ్ ఎక్కడ జరిగిన వేలాదిగా గ్రౌండ్ కు తరలివస్తుంటారు. ఇక సామాజిక మాధ్యమాలు వేదికగా భారత్ – పాకిస్తాన్ జట్ల అభిమానులు చిన్నపాటి యుద్ధాన్ని జరుపుతుంటారు. తమ జట్టు విజయం సాధిస్తుంది అంటే.. తమది విజయం సాధిస్తుంది అంటూ వాధించుకుంటుంటారు. అంత ప్రతిష్టాత్మకంగా జరుగుతాయి భారత్ – పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు. అటువంటి ఒక మ్యాచ్ కు సంబంధించిన విషయం ఇప్పుడు తెగ ఆసక్తిని కలిగిస్తోంది. భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన ఆ మ్యాచ్ లో టీమిండియా చేసిన పనికి సెల్యూట్ కొట్టాల్సిందే. ఖాళీ కడుపులతో.. ఆకలితో.. ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో తలపడి వారిని మట్టి కరిపించింది టీమిండియా. మధ్యాహ్న భోజనం అందకపోవడంతో టీమ్ అంతా అల్లాడిపోయారు. సచిన్ స్ఫూర్తిదాయకమైన మాటలతో టీమ్ ఇండియా తమ ఆకలిని తీర్చుకొని మ్యాచ్ పై దృష్టి సారించి విజయం సాధించింది. సచిన్ టెండూల్కర్ కూడా హీరో ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

2011 వరల్డ్ కప్ లో జరిగిన ఘటన ఇది..

2011 వరల్డ్ కప్ లో భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మొహాలీ మైదానంలో ఇరుజట్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ధోని సారధ్యంలోని టీమిండియా శ్రీలంకను ఓడించి రెండోసారి 50 ఓవర్ల ప్రపంచ కప్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ కు ముందు మొహాలీలో భారత్ – పాక్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. సెమీ ఫైనల్లో 29 పరుగులు తేడాతో పాకిస్తాన్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు సచిన్ టెండూల్కర్ ఇన్నింగ్స్ 85 పరుగులతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అయితే పాకిస్తాన్ జట్టు 231 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఈ మ్యాచ్ సందర్భంగా భారత్ – పాకిస్తాన్ ప్రధానులు కూడా మ్యాచ్ చూసేందుకు మొహాలి స్టేడియం చేరుకున్నారు. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడి తరువాత ఇరుదేశాల మధ్య సంబంధాలు చాలా చెడిపోయాయి. ఈ మ్యాచ్ తో ఇరు దేశాల ప్రధానులు ఒకే వేదికపైకి తొలిసారి వస్తుండడంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

పటిష్ట భద్రత వలయంలో గ్రౌండ్.. సమస్యకు కారణం అదే..

పాకిస్తాన్ ప్రధానిని మ్యాచ్ వీక్షించేందుకు రావాలంటూ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆహ్వానించడంతో మైదానం మొత్తం పటిష్ట భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. ఈ భద్రత కారణంగా టీమ్ ఇండియాకు సకాలంలో ఆహారం అందలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీమ్ ఇండియా జట్టు ప్లేయర్లు, మధ్యాహ్నం భోజనం చేయకుండానే బరిలోకి దిగాల్సి వచ్చింది. ఆ సమయంలో జట్టులోని సభ్యులు కొంత కలతగా ఉన్నారు. అయితే, ప్రతిష్టాత్మక మ్యాచ్ కావడంతో అభిమానులతో మైదానం కిక్కిరిసిపోయింది. టీమిండియా ఆటగాళ్లు లంచ్ చేశారా లేదా అన్నది ఫ్యాన్స్ కూడా తెలియదు. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మిగిలిన ఆటగాళ్లకు చెప్పిన మాటలు వారిలో స్ఫూర్తిని నింపాయి. ఆ స్ఫూర్తితోనే విజయాన్ని సాధించి భారతీయులు గర్వపడేలా చేశారు.

సచిన్ టెండుల్కర్ ఏం చెప్పారంటే..

మధ్యాహ్నం భోజనం చేయకుండానే బరిలోకి దిగాల్సి వచ్చిన ఆటగాళ్లకు లెజెండ్ క్రికెటర్ అప్పటి జట్టులో ఆటగాడు అయినా సచిన్ టెండూల్కర్ సహచరులను ఉద్దేశించి మ్యాచ్ కు ముందు మాట్లాడాడు. ‘ఇది సెమీఫైనల్. పరుగులు చేయడం, వికెట్లు తీయడం ద్వారా మీ ఆకలిని తీర్చుకోండి. జట్టు గెలిస్తే ప్రపంచమంతా మీ వైపే చూస్తుంది. అప్పుడు ఈ ఆకలి గురించి మీకు అస్సలు గుర్తు ఉండదు’ అంటూ సచిన్ జట్టులోని అందరి ఆటగాళ్లకు చెప్పారు. సచిన్ చెప్పిన మాటలతో జట్టులోని ఆటగాళ్లలో ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతో మ్యాచ్ లో అద్భుతంగా రాణించి పాక్ ను చిత్తుగా ఓడించారు. ఇంత సుదీర్ఘ కెరీర్ ఉన్నప్పటికీ సచిన్ ప్రపంచ కప్ టైటిల్ గెలవడం ఇదే తొలిసారి. నాడు జరిగిన ఈ విషయాన్ని స్వయంగా జట్టులోని ఆటగాళ్లు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ మ్యాచ్ లో కూడా సచిన్ టెండూల్కర్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆటగాళ్లను పరుగులు చేసి ఆకలి తీర్చుకోమని చెప్పడమే కాకుండా.. తను అదే పని చేసి వారికి స్ఫూర్తిగా నిలిచాడు.