Kalvakuntla Kavita New Party: తెలంగాణలో త్వరలో మరో కొత్తపార్టీ ఆవిర్భవించబోతోంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూతురు.. కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ బహిష్కృత నేత త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. ఈమేరకు ఇప్పటికే ప్రకటన చేశారు. పార్టీ విధివిధానాల రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే జాగృతి పేరుతో రాష్ట్రమంతా పర్యటించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఇక రెండు మూడునెలల్లో పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటించనున్నారు. పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని కూడా తెలిపారు. ఈ క్రమంలో కవిత తాజాగా ఆమె కేసీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ ఫొటో లేకుండానే..
రెండు మూడు నెలల్లో పార్టీని ప్రకటిస్తామని కవిత తాజాగా ప్రకటించారు. జాగృతిని అధికారిక పార్టీగా మారుస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్లోకి తిరిగి వెళ్లే అవకాశం లేదని ప్రకటించారు. ఇది ఆమె రాజకీయ వ్యూహంలో కీలక మలుపుగా కనిపిస్తోంది ఇక ఇదేసమయంలో పార్టీ ప్రచారంలో కేసీఆర్ ఫొటో పెట్టుకోమని ప్రకటించారు. కేసీఆర్‌కు బదులు జయశంకర్ పొటో పెట్టుకుంటామని తెలిపారు. తద్వారా కేసీఆర్ ఫొటో పెట్టుకుంటే పెద్దగా ప్రయోజనం ఉండదని ఇండైరెక్టుగా చెప్పారు.
బీఆర్ఎస్ ఓటమికి కారణంపై..
తన కారణంగా బీఆర్ఎస్ ఓడిపోయిందనే విమర్శలకు కవిత ధీటుగా స్పందించారు. జైలు వెళ్లిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఓడితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడారని ప్రశ్నించారు. ఇది పార్టీ లోపాలను ఆమె మరోమారు బయటపెట్టారు. బీఆర్ఎస్ చేసిన పొరపాట్లే ఆ పార్టీని ఓడించాయని వెల్లడించారు.
సామాజిక తెలంగాణే లక్ష్యంగా కొత్త పార్టీ ఉంటుందని, పనిచేస్తుందని కవిత ఇప్పటికే ప్రకటించారు. 2029 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజల సమస్యలు, రైతుల అభివృద్ధి, బీసీల హక్కులు ప్రధాన ఎజెండాలుగా ఉంటాయని పేర్కొన్నారు. కవిత చర్యలు తెలంగాణ రాజకీయాల్లో శూన్యతను పూర్తి చేయాలనే ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇది రాష్ట్ర భవిష్యత్ ఎన్నికల్లో కీలక శక్తిగా మారవచ్చు.